ఎవడు విడిగా ఉండగలడు, మగ బతుకులకు వెలుగులనద్దే కొవ్వొత్తులనుంచి, గుడ్లల్లో నీళ్లు దిగమింగే గృహస్థ కనుపాపల నుంచి, చీకటి రాత్రులను చుట్టుకుని పాలిపోయిన పాలిండ్ల నిట్టూర్పుల నుంచి, జీవితాంతం రాజీకోటి రాసుకునే క్షమయా ధరిత్రి సీతాయణం నుంచి, మనుసు బిగువున అదిమిపట్టిన నెరవేరని కలల నుంచి.. ఎవడూ విడిగా ఉండలేడు. రష్ట్రవ లోనే ష్ట్రవ ఉన్నపుడు ష్ట్రవతీ లో కూడా ష్ట్రవ ఉన్నపుడు భాషగానే కాదు; భావంగానూ వేదనగానూ విడివడడం కష్టం కదా! సరే మరైతే విడివడక ఏం చేయగలరు? సహానుభూతి కన్నీళ్లు కార్చగలరు. చారికను చెరిపే చూపుడువేలి ఔదార్యం కాగలరు. చిటికెడు చేవనివ్వగలరు. పిడికెడు ధైర్యమవ్వగలరు. మెత్తని గుండె, చిక్కని చూపు, లోతైన వేదన గల కవైతే ప్రతి నీడకూ అక్షరాలతో బొమ్మ కట్టగలడు. లండ సాంబమూర్తి కూడా అదే చేసాడు. కొంచెం అంతకు మించే చేసాడు. బయటకు నిటారుగా కనపడే బోలు స్త్రీలు, బాల్యంలోనే మోడులైన స్త్రీలు, ఏడుపే అలంకారమైన స్త్రీలు, సంగీతాన్ని దిగమింగిన కోకిలల లాంటి స్త్రీలు, పేలాల్సిన మందుపాతరలను గుండెల్లో సమాధి చేసిన అనేకానేక ఆమెకు మిగలని ఆమెలకు ఆమెను పునర్లిఖించి అందించాలని పూనుకున్నాడు. ఆ ప్రతిఫలనాలన్నింటినీ ఒక్క దగ్గర చేర్చి తిరుగుబాటునూ వేదననూ ఆవిష్కరించే ముఖచిత్రంగా కూర్చాలని నడుం కట్టాడు.
ఇవే ఆ కవితలు
ఇక్కడ వస్తువు, ఇతివృత్తం ఆమె. ఆమె అంటే తల్లి, సోదరి, స్నేహిత, సహచరి ఎవరైనా కావచ్చు. ఆమెను మాత్రమే వస్తువుగా చేసుకుని వచ్చిన ఒకే కవికి చెందిన కవితా సంపుటి ఇదే మొదటిదీ చివరిదీ కాకపోవచ్చు. అయినా ఇది ప్రత్యేకం. వస్తువు పేరుకు స్త్రీ ఒక్కటే అనే కానీ పరికించిన కోణాలు లెక్కలేనన్ని, తడిమిన లోతులు కొలవలేనన్ని. స్త్రీలు చాలా వాటితో సంభాషించగలరు. మగడి పెత్తనంతో ముచ్చట్లు పెట్టగలరు. పురుషుడి ఈగోతో సర్దుబాటు ఒప్పందం రాసుకోగలరు. కుటుంబపు మానిఫెస్టోలను అమలు చేయలేక పంచాయతీ పెట్టగలరు. అతడిని తోసిరాజని మరో దారినీ నిర్మించుకోగలరు. అతడి దారిని ధ్వంసమూ చేయగలరు. ఆ ఆమెకు సాంబమూర్తి అండనవుతానంటాడు. నీ కోసం ఓ గరళం చుక్కను ఇష్టంగా స్వీకరిస్తానంటాడు. మదర్స్ డే నాటి ‘మిస్ యూ మాం’ చక్కెరపూత చేదును సముద్రంలా సహించడమే తల్లితనం విషాదం అంటాడు. విస్తరిస్తున్న తామర కొలను దేశాన్ని నగంగా ఊరేగించనున్న ప్రమాదం గురించి హెచ్చరిస్తూ వాపోతాడు. క్షమించడం కాదు; శిక్షించడం నేర్పించు అని తర్జనితో విన్నపం చేస్తాడు. ఒక్కో కవితలో ఒక్కో ఆమెను, ఆమెకు చెందిన ద్ణుఖానంద విషాద భావావేశ నిస్సహాయతల నిఘంటువులను తనదైన తాత్పర్యాలతో తిరగరాస్తాడు. అలా అని కన్నీళ్లు పిడచ కట్టేంత ఏడుపుగొట్టు కవి కాదు. ఆమెను దుర్గామాతగా చూడాలనుకునే కవి. అతనే సాంబమూర్తి లండ ఫ్రం ఉద్దానం. ఏ కవి ఏ వస్తువును ఎక్కువగా ఎంచుకుంటాడో దాన్నిబట్టి అతని సాహిత్య వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చనే సాహిత్య తత్వశాస్త్రాన్ని నేను నమ్ముతాను. సాంబమూర్తికి స్త్రీ అంటే చెప్పలేనంత గౌరవం. ప్రతి స్త్రీలోనూ మాతృత్వాన్ని మాత్రమే చూడగల స్త్రీత్వం అతనిది. అతని లోపలి స్త్రీకి విశ్వ మహిళ లోతుగా పరిచయం. ఆమెను ఔపోసన పట్టిన కవి ఇతను. అతని లోపలి ఆమె పాడే పాటలే ఈ కవితలు.
సాంబమూర్తికి కవితా నిర్మాణ లోతుపాతులన్నీ తెలుసు. కవితను ఎలా ఆవిష్కరించాలో, ఎక్కడ అలంకరించాలో, ఎక్కడ సవరించాలో, ఎక్కడ రెచ్చగొట్టాలో, కవితకు ఎలా రెక్కలు తొడగాలో బాగా తెలుసు. అంతేకాక సాంబమూర్తి ఏ ఇతివృత్తాన్నయినా కవిత చేయగలడు. అందుకు వెన్నెల వాసనేసే ఇల్లు సాక్ష్యం. ఇటువంటి సారాన్ని ఎంచుకోవడం అనే చైతన్యాన్ని పక్కన పెడితే దాన్ని కవితగా మలచడం అంత సులువైన పనికాదు. అది కేవలం సాంబమూర్తికే సాధ్యం. ఇదే తరహాకు చెందిన మరో కవిత అమ్మ అడుగుతుంది. అమ్మ గురించి కవిత రాసే క్రమంలో తాను ఎంచుకున్న పద్ధతి ప్రత్యేకం. అమ్మ రాదులే కానీ వస్తే ఏమేం అడుగుతుంది అనే భావనను కవితగా చేసిన రూపం నిజంగా పాఠకుడి గుండెకింది తడికి చెమ్మనద్దుతుంది. అతని నిర్మాణ సామర్ద్యం చాలా గొప్పది. ఒక ఆరంభం, ఒక ఎత్తుగడ, ఒక నడక, ఒక ముగింపు… అన్నింటినీ బిగువుగా అల్లగల నేర్పు సాంబమూర్తికి ఉంది. ఇక్కడ ఆ సామర్ద్యానికి అద్భుతమైన వస్తువు తోడయింది.
అక్షరానికి ఉన్న అన్ని రంగులనూ ఇంద్రధనుస్సు చేసి ఎక్కుపెట్టాడు సాంబమూర్తి. కనుకనే తలుపు తెరవడానికి ప్రతిసారీ కారణం ఉండక్కరలేదనే స్వేచ్ఛ గురించి మాట్లాడాడు. నాన్న అన్న తమ్ముడు భర్త … అందరూ కత్తికి ప్రత్యామ్నాయాలే అని మగహింస గురించి కత్తిగట్టాడు. జీవితాలను రెక్కలకు కట్టుకుని ఎగిరేవాళ్లు సొంత గూడు నిర్మించుకోలేని కలల్లోనే బతుకుతుంటారని ఆర్థిక వాస్తవాన్ని లెక్క కట్టాడు. అమ్మను నిత్యం తనతో పొదువుకుంటూనే నిత్యం అరిచే గుండెల కాడి కాకిని నిరసనగానే సహిస్తున్నాడు. చేతులు ఎటు చాచినా చీకటిలా తగిలే గోడల గదులు చిన్నవే కనుక వాటిని కూల్చి కొత్తవి కట్టుకొమ్మనే ఆశావహాన్నిస్తున్నాడు. మరీ ఒక్క మందలింపుకే ఊపిరి బలిపెట్టే ఆత్మాహుతి సున్నితత్వాల గురించి బెంగపెట్టుకుంటాడు. ఇవి కొన్ని మాత్రమే! ఇంకా ఎన్నెన్నో కోణాలు, లోతులు. అయితే కవి తన అనుభవం నుంచి మాత్రమే ఇతివృత్తాలను ఎంచుకుంటాడు అనేది నిజమే అయితే, సాంబమూర్తి స్త్రీలలో నాకు బహుజన దళిత స్త్రీ కనపడలేదు. బహుశా స్త్రీని వర్గ దృక్పథంలోంచి మాత్రమే చూడాలన్నది సాంబమూర్తి సిద్దాంతమా? ఏమో! అది వేరే చర్చ.
పదబంధాలు ప్రతీకల అల్లికలో సాంబమూర్తిది చేయి తిరిగిన నైపుణ్యం. సరైన సందర్భానికి కుదిరే కచ్చితమైన ఇమేజ్‌ను తెచ్చుకోవడం సాంబమూర్తి చమత్కారం. మార్క్స్‌ను చదివిన పోతన అని చేయి తిరిగిన ప్రతీకకుడు మాత్రమే అనగలడు. ఆ నైపుణ్యమే శత్రువుతో బతకొచ్చుగానీ బూతద్దంతో బతకడం కష్టం అనిపిస్తుంది. ఆమె జీవం లేని గోడల మధ్య వేళ్లకింత చెమ్మయినా దొరక్కపోతుందా అని ఎదురుచూసే గాజు దీపం అని ఆ చమత్కారమే పలికిస్తుంది. నీది వసంతంలేని కాలం కథ అని అటువంటి భావశిల్పి మాత్రమే అనగలడు. అయితే చాలా సందర్భాల్లో కవితలో సాంబమూర్తి ప్రతీకలతో పరేడ్ చేస్తాడు. ఇమేజరీని గుప్పిస్తాడు. కానీ, కొన్ని ఇతివృత్తాలను కవిత్వం చేసేపుడు వెర్బల్ జగ్లరీ లేదూ ఫోనెటిక్ గిమ్మిక్స్ భావ వ్యాకరణంలోకి ఇమడవు. సింపుల్ నెరేటివ్‌గా, లేదూ అండర్ స్టేట్‌మెంట్‌గా యుఫెమిస్టిక్‌గా కొన్ని సందర్భాల్లో రాయడం దానికదే కవితాత్మకమైపోతుంది కూడా. రూపకం తెలుగు కవిత్వాన్ని ధ్వంసం చేస్తోందన్నది నా విశ్వాసం. కేవలం రూపకాన్ని పట్టుకుని వేళ్ళాడుతూ మహాకవులైనవారూ యుగకవులై పోదామానుకుంటున్నవారూ కుప్పలు తెప్పలు. సరే… ఇదే అంశాన్ని మరో కోణంలో మాట్లాడుకుంటే సాంబమూర్తి కవితలో పూర్తిగా బహిరంగమైపోతాడు. కవిగా తన ఇతివృత్తంలో మొత్తం స్పష్టంగా తనను తాను ఆవిష్కరించేసుకుంటాడు. మొత్తం విషయాన్ని పండు వలిచినట్టు వలిచి పెట్టేస్తాడు. ఇదొక నిర్మాణ పద్ధతి. కాదనను. కవితలో ఎప్పుడూ అంతా చెప్పేయకూడదని నేను నమ్ముతాను. చెప్పకుండా చెప్పడం కూడా ఉండకూడదు. కొంత దాచిపెట్టాలి. పాఠకుడు కవిత చివరనుంచి మళ్లీ మొదటికి వచ్చి ఏదో వెతుక్కోవాలి. కవి ఇంకా ఏదో చెప్పాల్సి ఉంది అని అనుకుని దానికోసం తాను అన్వేషణ మొదలుపెట్టాలి. పాఠకుడు కవిలోకి పరకాయ ప్రవేశం చేసి తనే ఆ ఖాళీని పూరించుకోవాలి. సింపుల్ నెరేటివ్ కవిత బాగుంటుంది అని చెపుతూ ఇదేమిటి? ఇది పూర్తి విరుద్ధంగా ఉంది కదా అనే సందేహం ఎవరికీ రానక్కరలేదు. ఓపెన్ పోయెమ్‌లో కూడా దాపరికం పాటించొచ్చు. అది కవితకు అందాన్నీ గాఢతనూ అద్దుతుంది. ఇది నా ఒకానొక ఆలోచన మాత్రమే!
సాంబమూర్తికి తన ఎజెండా ఏమిటో స్పష్టంగా తెలుసన్న విషయాన్నీ తను ఏ వైపు నిలబడి మాట్లాడుతున్నాడో తెలుసన్న విషయాన్నీ చెప్పే కవిత ‘నగదేశం’. భవిష్యత్తు ఏం కాబోతోందోనన్న ఆందోళన ఈ మణిపూర్ ఘటన కవితలో స్పష్టంగా కనపడుతోంది. మత రాజ్యం అనే చీకటి కిరణం ఈ వెలుగువాడలోకి దూసుకొస్తోందేమోనన్న భయం స్పష్టంగా వ్యక్తం అవుతోంది. అది చాలు, కవి రాజకీయ వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి. సాంబమూర్తి కవితది కథాకథన శైలి. తన ఇతివృత్తాన్ని ముందు కథగా మనసులో పేర్చుకుంటాడు. పాత్రలలాంటి పల్లవులనూ, చరణాలనూ అల్లుకుంటాడు. సంఘటనా పదచిత్రాల రాగాలను కూర్చుకుంటాడు. ఉత్కంఠ ఉత్కర్శలోకి పరుగు పందెపు గెలుపు గీత మీది చివరి అడుగు బరువుతో దూకి ఉచ్ఛస్వరమవుతాడు. కవిత పాటలాంటి కథగా పాఠకుడ్ని చేరుతుంది. ఉద్వేగం కవితగానో కథగానో పెయింటింగ్‌గానో మారేలోగా మనసు పొరల్లో దాని తీవ్రత క్రమక్రమంగా వేగంగా పలచబడుతుందన్న వాస్తవం సాంబమూర్తికి తెలుసు. ఏ ఫిల్టర్ వాడకుండా యథాతథంగా దాన్ని అనువదించేస్తాడు. అందుకే సాంబమూర్తి కవితలు స్వచ్ఛంగా వినిపిస్తాయి.
వచనం డెజావూ అయితే కవనం జమాయిస్ వూ. ఇది ఇంతకుముందెప్పుడో తెలుసు కదా అనిపిస్తుంది వచనం. ఇప్పుడు తెలిసినదాన్నీ తెలియనట్టు అనిపిస్తుంది కవనం. కవికి ఈ రెండింటి స్పహ కచ్చితంగా ఉండాలి. ఇప్పటి కవులకు మంచి వచనం రాయడం రావడం లేదన్నది నా ఫిర్యాదు. కానీ, సాంబమూర్తి తన మాటగా రాసుకున్న వచనం చూస్తే ఇతను మంచి వచనం రాయగలడన్న హామీ దొరికింది. కేవలం స్త్రీ కేంద్రకంగా కవితల సమూహాన్ని ఒకే దగ్గర పొదివి పట్టుకుని చదవడం పాఠకుడికి కూడా ఒక అందమైన అనుభూతి. ఆ అనుభూతి కొంత ప్రేమనూ, కొంత ద్ణుఖాన్నీ, కొంత రాజకీయాన్నీ, కొంత చమత్కారాన్నీ, కొంత సామాజిక బాధ్యతనూ, కొంత వాగర్థాన్నీ, కొంత చైతన్నాన్నీ పంచేదైనపుడు అంతకు మించి ఇంకేం కావాలి? ఏ కవితా సంపూర్ణ సత్యం కాదంటుంటాం కదా. సాంబమూర్తి కవితలు సంపూర్ణం కంటే కొంచెం మాత్రమే తక్కువ సత్యాలు. ఆమెకు ఆమె ఎందుకు మిగలలేదో తెలుసుకోవడానికి లోపలికి కదలండి. తల్లిలాంటి ఆమెలోకి. బిడ్డలాంటి కవితల్లోకి. ప్రతులకు : 96427 32008
(‘ఆమెకు మిగలని ఆమె’ పుస్తకానికి రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు)
– ప్రసేన్
98489 97241