మరల ఇదేల గీతాంజలి?

Oct 14,2024 05:49 #Geetanjali, #sahityam

తెలుగులో రామాయణం రాసిన వారిని మొదటి నుండి లెక్కిస్తే పెద్ద జాబితాయే తయారవుతుంది. రవీంద్రనాధ్‌ గీతాంజలి తెలుగు అనువాదాల విషయంలో కూడా ఇదే పరిస్థితిని గమనిస్తాం. సరే ఒక్కొక్కరు వారి వారి అభిరుచి మేరకు అనువాదం చేసి ఉండవచ్చు. కవి సమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ గారన్నట్టు ఎవరి రచనలు వారిష్టం… అయితే కారణాలేవైనా కావచ్చు మనం ఇప్పటికీ గీతాంజలికి చలం అనువాదాన్ని ప్రామాణికంగా భావిస్తూ చదువుతుంటాం. ఆంగ్ల కవి ఔ దీ ్‌వa్‌ర అన్నట్టు ప్రతిరోజూ అందులో ఒక గేయాన్ని పాడుకోవడం ద్వారా ప్రపంచం నుంచి మనల్ని చుట్టుముట్టిన అన్ని కష్టాలను మరచిపోతాం. గీతాంజలి ఇదివరకే చాలామంది చాలాసార్లు చదివి ఉండవచ్చు. బెంగాలీ, ఆంగ్లం బాగా వచ్చిన వారైతే ఇక చెప్పాల్సిన పనిలేదు. మన భాషలో కూడా చదివిన వాళ్ల సంఖ్య తక్కువేమీ కాకపోవచ్చు. మరి ఇప్పుడు కొత్తగా ఏముంటుంది గీతాంజలి గురించి మాట్లాడటానికి? కానీ, ఈ సందర్భంలో గీతాంజలి గురించి కన్నా అది అనువదించిన పద్ధతి గురించే ఎక్కువ చర్చ జరగాలి.
మానవుని కృంగదీసే నిరాశానిస్పృహల నుంచి కాస్త ఉపశమనం కావాల్సి వచ్చినపుడు, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ యొక్క గొప్పదనం తెలియపరచడంలోనూ గీతాంజలి విశిష్టత దాగి ఉందని ఇవాళ కొత్తగా చెప్పుకుంటున్న విషయమేమీ కాదు. మార్మకతలో కూడా మాధుర్యముంటుంది. అది అనుభూతికి చెందిన అంశం. శబ్దంలో కూడా ఒక ఆకర్షణ ఉంటుంది… అది భాషా సౌందర్యానికి సంబంధించిన అంశం. తాత్వికతలో కూడా సౌరభం ఉంటుంది… అది లోచూపునకు సంబంధించిన అంశం. వీటన్నిటినీ నింపుకున్న గీతాంజలిని రవీంద్రనాథ్‌ రాసే సమయంలో భక్తి మార్గం బలంగా ఉంది. ఆ మార్గాన్ని రవీంద్రనాథ్‌ బలపరిచారా లేదా నిరసించారా? ఈ రెంటి మధ్య ఉన్న సున్నితపు తెరను తొలగించకుండా చదివి అర్థం చేసుకున్నవాళ్ళు కొందరైతే… దానిని తొలగించి అంతర్లీనమైన భావుకతను పట్టుకున్న వాళ్ళు కొందరుంటారు. అలా అర్ధం చేసుకుని అనుసృజన చేసిన వారిలో గండేడ గౌరునాయుడు కూడా ఒకరు.
”ఎంత గొప్పదో నీ కృప స్వామీ
నన్ను అనంతుణ్ణి చేసినావు
అది నీ ఆనందం” అని ప్రారంభ గేయంలోనే భాషలో సౌందర్యం మనల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ సంప్రదాయ అన్వయం కంటె కూడా వ్యక్తిగత ఇష్టం ముడిపడి ఉంటుంది. దైవం పట్ల ఏ నమ్మకం లేని వారిని కూడా ఆకట్టుకునే గీతాంజలిలో ఎక్కడా దేవుని యొక్క నిర్ధిష్టమైన చిత్రణ లేదు. విశ్వసించే ఆలోచనతోనే ముడిపడి ఉంటుదన్న విషయం గౌరునాయుడు బాగా ఆకళింపు చేసుకున్నారని ఈ అనువాదం పాఠకుడికి చేరడంలో అట్టే సమయం తీసుకోదు. ”ఈ మట్టి పాత్రను పలుమార్లు ఒలకబోసి / నింపుతావు మళ్ళీ మళ్ళీ నవజీవనం/ ఈ చిన్ని వేణువును కొండ కోనల తిప్పి/ పూజించే నవ్య స్వరమాధుర్యం.” ఈ గేయాలు ఇక్కడ అనువదించబడ్డాయి అనడం కంటే కూడా పునర్నిర్మాణాన్ని పొందాయని నాలాంటి సామాన్య పాఠకుడు అనుకుంటే అది తప్పో ఒప్పో అని కూడా ఎవరినైనా తేల్చమని ఎందుకంటాం.
మనవాళ్ళు ఎంతో గొప్పగా ఆధ్యాత్మికతలో లీనమైపోయామనుకుంటారు గాని ప్రార్ధనల విషయంలో చాలా హడావిడిగా ముగుస్తాయి. ఆచారాల పేరిట మనవాళ్ళ తీసుకునే సమయంతో పోలిస్తే ఒంటరిగా కూర్చొని తన ఆరాధ్యంతో సంభాషణ చేయడానికి తీసుకున్న సమయం అస్సలు లెక్కకు రాదు. రవీంద్రనాథ్‌ ఆలోచనకు ఇసుమంత భంగం కలగకుండా గౌరునాయుడు తెలుగీకరించడం ఇక్కడ మనం గమనిస్తాం. భాష ఎంత అందంగా ప్రయోగించారో అంతే లెక్కన అంత్యప్రాసల సౌందర్యం సహజమైన రీతిలో ఆకట్టుకుంటుంది. ఆంగ్ల భాషలోని గేయాలు తనలోకి ఇంకింపజేసుకొని అనుసృజన చేసి ఉంటే తప్ప ఈ గేయాలు ఇలా వచ్చి ఉండవు.
‘ఒక్క క్షణం నీ పక్కన విశ్రమించనీ/
పనులా అవి ఎప్పుడూ ఉన్నవే గాని
నిను చూడక మనసుకు ఏమున్నది శాంతి?
నిను చేరని బ్రతుకున ఏదీ విశ్రాంతి?
ఎంత చిన్న పనిగానీ జలధిగ తోచే భ్రాంతి.
తెలిసెనేదొ నీ తావు నీవుండే నెలవు
దిక్కుమొక్కులేని జనంలోనె కదా నీ కొలువు
నిరుపేదల నిర్భాగ్యుల హీనుల అతి దీనుల నీరింకిన కన్నుల్లో ఉన్నది నీ పద పీఠం
శ్రమసౌందర్యం నీవని చేతలలో ప్రకటిస్తా..
నా చేతుల నీవొసగిన చేవవుంది గనుక …
మనం ఇక్కడ మూలకవి అంతరంగాన్ని అనువాదకవి ఎంత స్పష్టంగా మనముందుంచారన్న అంశం గమనిస్తాం. సాధారణ ప్రజలు పూజించే మూర్తి ఎక్కడుంటుంది? అది తెలుసుకునే ప్రయత్నం జరిగిందా? ఆ పద పీఠం ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసుకోమని చెప్పే కవి భావజాలాన్ని గౌరునాయుడు గేయం చాలా సంక్షిప్తమైన పదాలతో సమున్నతమైన భావాన్ని మనకు చేరవేస్తుంది.
మన హృదయాలను నిష్కల్మషంగా ఉంచుకోకుండా చేసే దైవ పూజలు అనవసరం అంటూ మార్మికంగా హితబోధ చేసిన విషయాన్ని ఎక్కడా విస్మరణకు లోను కానివ్వకుండా ప్రతిధ్వనింప చేయడంలోనూ… గీతాంజలిలో అన్ని గేయాలు కప్పే ఓదార్పు దుప్పట్ని కరుణ రసాత్మక పదజాలంతో ఎంబ్రాయిడరీ చేసి మరీ అలంకరించడంలోనూ గౌనా విజయం సాధించారు.
”అదిగో ఆ గది మూల ఉంది మట్టిదీపం
ఆ దీపంలో ఏదీలేదే తేజం నువ్వూ ఇంతేకదా నవ్వనేల మనసా నీకన్నా మిత్తినయం అది నీకు తెలుసా”
మన హృదయాల్లో ఉన్న ఆరాధ్యాన్ని మనం మరచిపోవడాన్ని నిరసించే గేయాల ఆత్మను పట్టుకోవడం, ఎక్కడెక్కడో వెతుకులాడే ఈ సమాజం.. అతడి ప్రేమలో పడటం గానీ, స్నేహితుడిగా ప్రకటించుకోవడంలో గాని వేసే తప్పటడుగుల్ని ఎత్తి చూపే పారదర్శకతను అనువాదంలోకి ఏ పొరపాటూ లేకుండా బదిలీ చేయగలగటం చూసినపుడు మనం కవితో కలసి నడుస్తాం. ”నాతోనే ఉంటాడు నేనైన వాడు..” అన్న మాటొక్కటి తెలియని మానసిక స్థైర్యాన్ని అందించవచ్చు.
నిర్భయంగా మనసు తలెత్తుకు తిరగాలని కవి ఆకాంక్షించినపుడో… పరాధీనతలో ఉన్న దేశాన్ని మేల్కొలుపు అంటూ కాలాన్ని ప్రార్ధించినపుడో… ఎదలో సుడిరేగే మాటలు పలకించమన్నప్పుడో.. మాట తొట్రు పడకముందె కొత్త రాగాలు మొలిపించమన్నప్పుడో… మోక్షమిచ్చే మార్గం సన్యాసమా? వైరాగ్య చిహ్నం కాషాయమా? అంటూ ప్రశ్నించినపుడో.. అనువాదకుడి శ్రద్ధ మన గొంతుల్ని కలుపుకుంటుంది.
మరణమా! నా జీవన కావ్యాంతిమ చరణమా…నీ రహస్యమేదో.. నా చెవిలో వినిపించుమా.. మరణం కూడా జీవితంలో ఒక తీయనైన ఘట్టమే కదూ, మరణాన్ని కూడా ఆనందంగా అహ్వానించాలని ఆ రహస్యాన్ని వినాలని నైరాశ్యాన్ని దూరం చేసే తాత్వకతను విస్తృతం చేసిన కవికీ మనకీ మధ్య అనువాదకుని కష్టానికి మనం ఆహా అంటాం. ఊహలోకి జారుకుంటాం.
ఈ పుస్తకం అందరి ఇళ్లలోనూ ఉంచుకోవాలి. అనువాదకుడు ఎలా తన తండ్రి మరణించిన సమయంలో పొందిన ఆర్తిలో ఈ అనువాదానికి పూనుకున్నాడో బహుశా ప్రతి మనిషీ అలాంటి ఏదో ఒక వేదనకి గురయ్యే సందర్భంలో ఈ పుస్తకం ఒక సాంత్వన చేకూర్చవచ్చు. జీవితం పట్ల మరింత విలువను పెంచవచ్చు. ఏ సమ్మతీ కోరని అనుమతి అడిగే అనేకానేక సందర్భాల్లోకి మనల్ని లాక్కుపోవడంలో.. మనదైన హృదయం సమర్పించే సమయంలోకి పయనింప చేయడంలో ముగింపు లేని గీతాంజలికి ఈ అనువాదం అణువణువునా మనిషితనాన్ని పరితపించేందుకు మరో సఫలీకృతమైన ప్రయత్నం.

– పాయల మురళీకృష్ణ
83094 68318

➡️