తెలుగు భాషా సేవలో ఆ ఇద్దరు

Aug 26,2024 10:25 #aksharam

ఆ ఇద్దరిలో ఒకరు గిడుగు రామ్మూర్తి పంతులు, మరొకరు గురజాడ వేంకట అప్పారావు. ఒకరు శ్రీకాకుళానికి 20 మైళ్ల దూరంలో ఉన్న పర్వతాలపేటలో ఆగస్టు 29, 1863లో జన్మిస్తే, మరొకరు విశాఖ జిల్లా, యలమంచిలికి దగ్గరలో ఉన్న రాయవరంలో సెప్టెంబరు 21, 1862లో జన్మించారు. వీరిద్దరూ విజయనగరంలోని మహారాజావారి ఉన్నత పాఠశాలలో సహపాఠులై ఆంగ్లం, సంస్కృతం, చరిత్ర పట్ల అమితమైన శ్రద్ధ చూపేవారు. వృద్ధిలోకి వస్తారనుకున్న పిల్లలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులైన చంద్రశేఖరశాస్త్రి ఇంటిదగ్గర పాఠాలు చెప్పేవారు. అక్కడా వీరిద్దరూ సహాధ్యాయులయ్యారు. అప్పటి నుంచి వీరు ఒకరికొకరు మిత్రులు, సన్నిహితులు, ఆప్తులయ్యారు. తరువాత ఒకరు పర్లాఖిమిడి మహారాజా కళాశాలలో, మరొకరు విజయనగరం మహారాజా కళాశాలలలో ఉపన్యాసకులుగా ప్రసిద్ధులయ్యారు.
ఏ జాతి సంస్కృతిలోనైనా ఆహారం తరువాత కీలకమైన పాత్ర పోషించేది భాష. మానవ సమూహాలు తమ అనుభవాలను, కష్టసుఖాలను పంచుకోవడానికి భాషను సృష్టించుకుంటాయి. మనిషికీ మనిషికీ మధ్య సజీవ సంబంధాలు నెలకొల్పే వాహిక భాష. అటువంటి భాష మనిషికీ మనిషికీ మధ్య గుదిబండగా నిలిచిన వైనాన్ని ఇద్దరూ స్పష్టంగా దర్శించారు. ఈ దేశవాసుల వాడుకలోలేని భాషలో భారతీయ ప్రాచీన సాహిత్యమంతా వచ్చింది. అదే సంస్కృత భాష.
తెలుగు భాష లిఖితరూపంలో మనకు దొరికిన తొలినాళ్లలో అది ఆనాటికి ప్రజల వాడుకలో ఉన్నట్లు శాసనాల్లోని సరళ వాక్యాల ద్వారా తెలుస్తుంది. కాలక్రమంలో శాసనభాషలో రెండు రూపాలు వెలిసాయి. ఒకటేమో చిన్నచిన్న మాటలతో సూటిగా రాసిన భాష. చాలా దాన శాసనాల్లో ఈ భాషారూపం కనిపిస్తుంది, రాజులు, సేనాపతుల విజయవార్తలను ప్రకటించే శాసనాల్లో భాష క్రమంగా కఠినమై, సంస్కృత భూయిష్టమై ప్రజావ్యవహార భాషకు దూరం కావడం మొదలయింది. ఈ స్థితి క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి క్రమ పరిణామం చెంది చివరకు కావ్యభాష అనే కృత్రిమ రూపాన్ని మనకు ప్రసాదించింది.
నన్నయకు 200 ఏళ్ల ముందే ‘కొరవ’ శాసనం ద్వారా ఈ కృత్రిమ కావ్య భాష వచనంలో కూడా స్థానం సంపాదించుకున్నట్లు మనకర్థమవుతుంది. నన్నయ నాటికి ఈ రూపం సంపూర్ణంగా నిలదొక్కుకుంది. తరువాత వచ్చిన ప్రబంధ సాహితీకర్తలందరూ రూపంలోను, సారంలోను నన్నయను అనుసరించినవారే. 1565లో తళ్లికోట యుద్ధంలో విజయనగరం సామ్రాజ్యం కుప్పకూలిపోయాక ఆంధ్రసాహిత్యంలో పొద్దుగుంకి చీకటిపడింది. మూడు శతాబ్దాల అనంతరం గురజాడతో మళ్లీ తూర్పు భళ్లున తెల్లవారింది.
గురజాడ తరువాత వాడుకభాషలో కథా సాహిత్యాన్ని అద్భుతంగా నిర్వహించిన శ్రీపాద ఈ సందర్భంలో గురజాడనుద్దేశించి ‘భాష ఎంత శృంఖలాబద్ధమైపోవాలో, అంత శృంఖలాబద్ధమైపోయాకా, సాహిత్యం ఎంతగా దిగజారిపోవాలో, అంతగా దిగజారిపోయాక, భవిష్యత్తు ఎంతగా అంధకారమైపోవాలో అంతగా అంధకార బంధురమైపోయాక పుట్టుకొచ్చాడీ మహాకవి’ అన్న మాటలను బట్టి ఇరవయ్యో శతాబ్ది ఆరంభానికి తెలుగు భాషా సాహిత్యాల స్వరూపమెట్లా ఉందో మనకు స్పష్టమౌతుంది.
గిడుగు పిడుగే, ప్రజాభాషకు సాహిత్యంలో స్థానం ఉండాలని, అసలే అత్యధిక సంఖ్యాకులు నిరక్షరకుక్షులుగా ఉన్న సమాజంలో ప్రాచీన రూపాలను, సంస్కృతభాషా మర్యాదలనూ చొప్పించి కృత్రిమంగా నిర్మించిన భాషకు బహుముఖమైన ఆధునిక సారస్వతంలో స్థానం లేదని వాదించిన మొట్టమొదటి భాషా శాస్త్రవేత్త. సమాజంలో భాషా విషయకంగా వచ్చిన, వస్తున్న సిద్ధాంతాలనూ, ఆచరణలనూ గుర్తించిన తొలి తెలుగు భాషా శాస్త్రవేత్త గిడుగు. ఈ సందర్భంలో భారతీయ భాషల గురించి ప్రపంచ భాషా శాస్త్రవేత్తల అభిప్రాయాలను ఇక్కడ గమనించవలసిన అవసరముంది.
“The Vernacular has been split into two sections. The tongue which is understanded of the people and the literary dialect known only through the press, which is not intelligible to those who donot know Sanskrit. Literature has thus being divorced from the grate masses of the populations and also to the literary classes” (GREARSON)
‘భారతీయ భాషలకు గమనార్హమైన ఒక ప్రత్యేక లక్షణముంది. వీటిలో రచనలు వెలువడ్డం ప్రారంభం కాగానే, భాషా శైలులు ప్రజాజీవితం నుంచి వేరుపడి తన స్వంత వ్యాకరణమూ, పదజాలమూ ఉన్న ఒక గ్రాంధిక భాషగా రూపొందే ధోరణిని అలవర్చుకుంటుంది.’ (కాడ్వెల్‌, ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం).
‘దక్షిణ భారతదేశ భాషలలో ప్రతీ ఒక్కదానికి కవిత్వభాష, వ్యావహారిక భాష ఉన్నాయి. వీటిమధ్య శేగ్జన్‌ భాషకూ, ఇంగ్లీషు భాషకు మధ్య ఉన్నంత తేడా ఉంది. (సి.పి.బ్రౌన్‌, తెలుగు, ఇంగ్లీషు, నిఘంటు పీఠిక).
భాషకు సంబంధించి తన ఆలోచనతో ఏకరూపత కలిగిన ఈ అభిప్రాయాలన్నీ గిడుగును వాడుకభాషా ఉద్యమానికి పురికొల్పడమే కాకుండా ఎంతో విశ్వాసాన్ని, ధైర్యాన్ని కల్పించాయి. గిడుగు సిద్ధాంత ప్రవక్త. వాద వివాదాల సందర్భంగా పండితులనుద్దేశించి రాసిన భాష, ఖండన గ్రంథాల్లో రాసిన భాష సహజంగా క్లిష్టంగానే ఉండేది.
ఇక గురజాడ విషయానికి వస్తే ఆయన తన పరిశీలనా, అధ్యయనాల ద్వారా వాడుక భాషపై సాహిత్య భాష (గ్రాంథిక భాష) ఆధిపత్య, ప్రభావాలకు గల మూలాలను గ్రహించినట్లుగా వివిధ సందర్భాల్లో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల ద్వారా మనకు స్పష్టంగా అర్ధమౌతుంది. ‘సంకుచిత, సామాజిక, రాజకీయ సాహిత్యాదర్శాలది పైచేయిగా ఉన్న సామాజిక పరిస్థితుల వలన కావ్యభాష ఉత్పన్నమయింది. విశాల ప్రజానీకం, ప్రభువర్గం కోసమే బతికేది, శ్రమించేది, ఆనాడు సూద్రుడు చదువుకోవడమే ఒక నేరం’. ‘విశాల ప్రజానీకం చదువుకోవడం, పూర్వాచార సాంప్రదాయంలో భాగం కాదు. నాడు జ్ఞానార్జన, సాహిత్యం, బ్రాహ్మణుని గుత్త సొమ్ము. అతని దృష్టిలో సంస్క ృతం పెట్టిన ఒరవడి పవిత్రమైనది, మీరరానిది. తెలుగు సాహిత్యం సంస్కృత ప్రభావంలో అంకురించింది.సంస్కృత సాహిత్యం క్షీణదశలో ఉన్న కాలంలో తెలుగు సాహిత్య సృష్టి ప్రారంభమైనందువల్ల క్షీణదశ లక్షణాలైన భాషా, కళా సాంప్రదాయాలు తెలుగు సాహిత్యంలో పాతుకుపోయాయి’. ‘ఈ సందర్భంలో తెలుగు సాహిత్యానికి సంకెళ్లు వేసి కడుపుమాడ్చడమా? లేక దానికి జవసత్వాలనిచ్చి ఒక నాగరిక శక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడి ఉంది’. అంటూ ఈ దృష్టితోనే తను వివిధ తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కావ్యసృష్టికి అంకురార్పణ చేసి, పరాకాష్ట స్థాయిలో వాటిని అద్భుతంగా నిర్వహించిన మహాకవి గురజాడ.
గిడుగు జీవితమంతా ప్రత్యర్థి వాదాన్ని పరాస్తం చేయడంలోనే గడిచిపోయింది. సిద్ధాంతానికి అనువర్తన ప్రధానం. ఆచరణ సాధ్యం కాని ఏ సిద్ధాంతమూ నిలబడదు, బతకదు. సామాన్య రచనల్లో, వ్యావహారిక భాషా వాదాన్ని ప్రతిష్టాపించగల సత్తా ఉండదు. లక్ష గ్రంథాలకంటే ఒక మహా కావ్యం తెచ్చిపెట్టగలిగిన గౌరవం మిన్న. ఏ ఆదర్శం కోసమైతే జీవితాన్ని ధారపోస్తామో ఆ ఆదర్శపు ఔన్నత్యాన్ని బట్టి అతడు చరితార్ధుడౌతాడని గ్రహించి, ‘నాకు కావలసింది నా దేశ భాష, సజీవమైన తెలుగు భాష. నాది ప్రజల ఉద్యమం దానిని ఎవరినో సంతోష పెట్టడానికి వదులుకోలేను’ అని ప్రకటించి వ్యావహారిక భాషకు మహాసాహితీ గౌరవం సంపాదించి పెట్టి గిడుగు ఆబోరు దక్కించినవాడు గురజాడ. దీనికి ప్రథమ సాక్షి ‘ముత్యాలసరాలు’, ప్రధాన సాక్షి ‘కన్యాశుల్కం’ ముఖ్యమైన సాక్షి ‘దేవుళ్లారా మీ పేరేమిటి’ వ్యావహారిక భాషా నిరూపకడు గిడుగు అయితే, ప్రతిష్టాపకుడు గురజాడ. ఈ వాదాన్ని నిలిపిన మరో మహాశక్తి తెలుగుజాతి.
– డా|| బి.వి.ఎ.రామారావు నాయుడు
94410 95961

➡️