నాలుగ్గోడల ఊపిరాడని
సజీవ సమాధుల్లోంచి
కొంచెం సేపు మమ్మల్ని మేము
పునర్జీవింప చేసుకోవడానికి
చచ్చుబడిన నరాల్లో
కొంచెం ఉత్సాహం సెలైన్
ఎక్కించుకోవడానికి
శ్రుతి చేసి కొంటున్న సితారలం
నాలుగు వీధుల కూడళ్లు
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
తేనీటి షాపుల ముంగిళ్ళు
అలల గలగలల నదీతీరాలు
పారదర్శక పానీయాల గాజు గ్లాసుల
గుండ్రటి బల్లల వీధి గదులు
వింజామరలు వీచే వాయువులు
పచ్చని పచ్చిక గీతాల పార్కులు
ఇవేమీ మా సమావేశ చిరునామాలు కావు
అస్పష్ట కవితల పసిపిల్లల ఏడుపుల
అతృప్త కాంక్షల సహచరుని సాధింపుల
సరిపడని నిద్రల సుదీర్ఘ రాత్రుల
బలవంతపు మెలకువల
తెరిపిడి పడని కళ్ళతో
తడబడే కాళ్ళతో
తెల్లవారుజాము ముహూర్తం
విరామం లేని పనుల ప్రారంభం
అప్రకటిత బానిసత్వం
శరీరంతో పుట్టిన సంకెళ్లు
తరతరాల అమ్మమ్మల నాయనమ్మల
తరగని చాకిరీల పెంజీకటి బతుకుల నేపథ్యం!
మిక్సీ పాప్ సంగీతం
గ్రైండర్ పాట కచేరీ
బట్టలు ఉతుకుతున్న దరువులు
అంట్లు తోముతున్న గరగరలు
మా నేపథ్య సంగీతం
కూరగాయలు తరుగుతూ
ఇల్లంతా తడిగుడ్డ పెడుతూ
కుంతల జలపాతంలా కబుర్ల జలపాతం
అంతులేని కాషాయీకరణ
బాల్యం మూపులపై పుస్తకాల బస్తాలు
ఉప్పు పప్పు చెప్పులపై జిఎస్టీ కొరడా
వంటింటి చూరు కింద కన్నీటి మున్నీటిలో
కదిలే కాగితం పడవలం
అపుడపుడూ ఆగ్రహ గంగలం
ఆవేశాల వరద గోదారులం
ఆలోచనల మాండవీ నదులం!
– మందరపుహైమవతి,
9441062732