‘చిన్ననాడే నన్ను ఏదో లయ వెంటా’డిందని చెప్పుకున్న కోగిర జైసీతారామ్ ఆ లయల అగాథపు లోయల్లో పడిపోకుండా
”… సుందరాంగుల చన్నుగవ పై
మందముగా చందస్సు అలదను…”
”….. రాచసభలకు రంగు వేయను
దోచు దొరలకు దోవచూపను….” అని అంటారు.. ఆ ‘అక్షర సైన్యం’ అనే కవితలోనే ఇంకా ఇలా ప్రకటిస్తారు :
”నేపథ్యంలో ఏడవను
బ్రాకెట్లో బ్రతకను
అరసున్నగా అసలే జీవించను” కనుకనే ‘కవికోకిల’ అనే ఇస్తామంటే వద్దు, కాకి పేరే జీవితమే కడు వాస్తవికం, ఎంతో ముద్దు కనుక తనను ‘కవికాకి’ అని పిలవమన్న సాహసి జై సీతారామ్!
సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం అనంతపురం ఆకాశవాణి గళం సారించిన సందర్భంలో మారుమూల పల్లె ప్రాంతాల్లో ఉన్న కళాకారులను సైతం రికార్డు చేసే అవకాశం లభించింది. అప్పటికి నాకు మా కోగిర తెలుసు కానీ, కోగిర సీతారామ్ గురించి తెలియదు. అయితే పెనుకొండలో జరిగిన పరిచయమే ఉప్పెనలా నా హృదయాన్ని కొట్టి, కట్టి పడేసింది.. ఏమిటా జీవద్భాష అని! అప్పటికి మూడేళ్లుగా కొంకణి ప్రసార భాషగా ఉన్న ఆకాశవాణిలో పని చేయడంతో తెలుగూ, దాని మాండలిక సొగసూ నామీద కొంత అదనపు అధికారం చలాస్తున్నాయి. అనంతపురం జిల్లా.. ఆ పెనుగొండ తాలూకా… రొద్దం మండలపు అచ్చమైన కోగిర గ్రామ ప్రాంతపు భాష. మరీ ముఖ్యంగా శ్రామికుల భాష. అప్పటికి ఈనాటి టెక్నాలజీ రాలేదు, లేకపోయింటే సీతారామ్ యూట్యూబ్లో వాడవాడలా వెల్లువై ప్రతిధ్వనించేవాడు. మాట్లాడేభాషను ఎపుడైనా ప్రాంతం, కాలం, సామాజిక నేపథ్యం అనే ఈ మూడు గొప్పగా ప్రభావితం చేస్తాయి. సీతారామ్ రచనల్లో, ఆయన ప్రజెంటేషన్లో ఈ మూడూ చాలా స్పష్టంగా, సులువుగా పరిశీలించవచ్చు. నిజానికి ఆయన రచనల్లోని మౌఖిక భాషాలక్షణాలను సాకల్యంగా పరిశీలించాలని నాకైతే ఆశ ఉంది, అది సాధ్యమవుతుందో లేదో!
‘కోగిర సీతారామ్’గా ప్రచారంలో ఉన్న గౌని జైసీతారామ్ రెడ్డి కోగిరలో1924 నవంబర్ 14న జన్మించి, 2000 అక్టోబరు 9న కనుమూశారు. అంటే ఆయన శతజయంతి సంవత్సరం ఈ నెలోనే పూర్తయింది. గౌని చన్నమ్మ, గౌని ఓబుళరెడ్డి దంపతులకు జన్మించిన సీతారామ్ బాల్యం ఒడిదొడుకులుగానే సాగింది. 5వ తరగతి తర్వాత మేకల కాపరిగా మారిపోయాడు. వారి పూర్వీకులు రెడ్డి ఉద్యోగం చేశారు కనుక రెడ్లు అయ్యారు, కానీ వారు గొల్లలు లేదా యాదవులు. చదువు మీద ఆశతో ఇంటి నుంచి పారిపోతే, వెనక్కి పట్టుకొచ్చి ఎద్దులు కాపరిగా ప్రమోషన్ ఇచ్చారని ఆయనే అంటారు. ఈ ఐదవ తరగతి చదువుకే ఆయనకు కృష్ణ, సుమతి, వేమన, దాశరథి, భాస్కర, నరసింహ శతకాలతో పాటు గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం, అమరం, ఆంధ్ర నామ సంగ్రహం వంటివి కంఠస్థంగా వచ్చేవి. ఈ శతకాల పుణ్యమా అని సీతారామ్‌కు ఆటవెలది, తేటగీతి అల్లిక బాగా అలవాటయింది. ఇక్కడ ఛందస్సుకూ, పద్యాలు చేయగలిగిన కమ్యూ నికేషన్ సామర్ధ్యానికీ లంకె ఏమిటో ఒకసారి చూడాలి.
1971 నవంబర్ 13న అనంతపురంలో జరిగిన ఒక కవిసమ్మేళనంలో శ్రీశ్రీ, ఇంకా నలుగురు దిగంబర కవులతోపాటు పాల్గొన్న సీతారామ్ తన ‘మదాంధ భారతం’లోని కొన్ని పద్యాలను చదివారు. శ్రీశ్రీ ప్రతిస్పందిస్తూ ”కవిత్వం సామాన్యులకర్థమైతుంది. అది చందోబద్ధమైతే వచ్చిన నష్టమేమి?” అంటూ పుస్తకం అచ్చు వేయించండని తన విరాళంగా రూ.10 ఇచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో ముషీరా బాద్ జైల్లో విప్లవ రచయితలందరూ సమావేశమైనచోట రాకెట్, జాకెట్, లాకెట్, పాకెట్ అనే దత్తపదిని ఇంగ్లీష్‌లో ఇస్తే సీతారామ్ అలవోకగా ఉత్పలమాల చెప్పేశారు. దీనికి తోటి రాజకీయ ఖైదీ, తర్వాత ఎమర్జెన్సీలో ఒరిస్సా గవర్నర్‌గా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ‘దత్తపదిలో కూడా విప్లవాన్ని గురించే చెప్పినాడు, అందులోనూ ఇచ్చిన నాలుగు పదాలు ఇంగ్లీషువే అయినా వాటిని తెలుగు పదాలుగా పరివర్తించడం ఎంతో చాతుర్యం. ఆయనను చందోబద్ధంగానే రాయనీయండి” అని అన్నారు. అదీ సీతారామ్ రచనా సామర్థ్యం, సార్వత్రికత.
మనిషి మహా సన్నం. అంత ఎత్తు కాదు. మొహాన గాంధీ కళ్ళజోడు. ఫ్రెంచ్ కట్టు మీసం. అయితే మనిషి ఎల్లప్పుడూ ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఎప్పుడూ ముతక నూలు పంచె, షర్టు, భుజాన చల్లా… అప్పుడప్పుడు చలికాలంలో అయితే స్వెటర్. వీటన్నిటినీ మించి చెరగని చిరునవ్వు, వదలని చమత్కారం. వీటికి మించి మాటకు మాట రిపార్టీ. ఆయన మంచి చిత్రకారుడు. ఫ్రెంచి కట్ మీసంతో సహా తన సంతకంలో సులువుగా తన మొహాన్ని మనకు దర్శింప చేయగల నేర్పరి. తన ‘అక్షర సైన్యం’ పుస్తకం 1996 ఏప్రిల్ 14న నాకు ఇస్తూ చేసిన సంతకం ఎలా ఉందో చూడండి. వారసత్వంగా సంక్రమించి జీవితాంతం పీడించిన ఆస్మా గురించి ‘అబ్బగంటైన ఉబ్బసంబు’ అని చమత్కారంగా అనడమే కాదు; పలు సభల్లో ‘దుర్భర దారిద్య్రాన్ని మహా దర్జాగా అనుభవిం’చానని కాలరెగరేస్తూ చెప్పగల వేదాంతి. విప్లవ రచయితల సంఘం సభ్యుడు కాకపోయినా ఆ సంస్థ సభ్యుడిగా ముద్ర వేసి అరెస్టు చేశారు. ముషీరాబాద్ జైల్లో 17నెలలు ఉన్నపుడు ‘ఇందిరమ్మ జైలురా ఇంటి కన్నా మేలురా’ అంటూ పాటలు పాడేవారు. జైల్లో వీరికి సోపులు, పేస్టులు మొదలైనవి ఇస్తే వాటిలో కొన్నింటిని వాడుకొని, మిగతా వాటిని ఇతరులకు ఇచ్చి, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పుస్తకాలు కొని చదివారు. అక్కడ ‘విప్లవ రచయితలందరూ ఒక చోట చేరి, ప్రతిరోజు విప్లవాన్ని గురించి తరగతులు నిర్వహిస్తూ, రచనలు వినిపిస్తూ ఎంతో ఆనందోత్సాహాలతో గడిపిన మహదావకాశమది. అది ప్రభుత్వం భరించిన ఖర్చుతో నిర్వహించ బడిన ఒక కోర్సు.’ అని ‘అక్షర సైన్యం’ ముందు మాటలో సీతారామ్ అంటారు.
బాలుడిగా సీతారామ్ శ్రద్ధను గమనించిన తల్లిదండ్రులు ఇక తప్పదని అనంతపురం మున్సిపల్ పాఠశాలలో చదువుకు పంపితే ఎనిమిదో తరగతి పూర్తి చేశారు. స్ట్రీట్ లైట్ వెలుగులో చదువుకోవడమే కాకుండా, సర్కస్ కంపెనీ వారి అడ్వర్టైజ్మెంట్ పేపర్లను నోట్బుక్‌గా చేసుకొని చదువు సాగించిన సాధకుడు. తర్వాత ఎయిర్ గ్రేడ్ టీచర్‌గా శిక్షణ పొంది పెనుకొండ గుట్టల్లో చాలా బదిలీలు ఎదుర్కొంటూ ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన నిత్య చదువరి. ఏ గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేసినా ఆ పాఠశాల గోడలపై తన సొంత ఖర్చులతో అ, ఆ లు, గుణింతాలు, ఒకట్లు (ఎక్కాలు), వారాలు, నెలలు, సంవత్సరాలు రంగురంగుల పెయింట్లతో రాయించేవారు. ఆయన స్వయంగా కవి, రచయిత.. గాయకుడు, చిత్రకారుడు, నటుడు కూడా! వీటన్నిటిని తన బోధనలో కలగలిపి తరగతిని అర్థవంతంగా తీర్చిదిద్దేవాడు. 1984- 85 సంవత్సరంలో మూడో తరగతి తెలుగు వాచకాన్ని రచించిన సీతారామ్‌గా ఉభయ రాష్ట్రాల తెలుగు వారికి బాగా పరిచయం. ఆయనకు నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, తరిమెల నాగిరెడ్డి, పరిటాల శ్రీరాములు, చితంబరరెడ్డి, బిటిఎల్‌ఎన్ చౌదరి, పి వి చౌదరి వంటి రాజకీయ నాయకులే కాకుండా ఎందరో సాహిత్యమూర్తులు సుపరిచితులు. 1983లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ద్వారా అందుకున్నారు.
సీతారామ్ భార్య పేరు వీర ఓబుళమ్మ. ఈ దంపతులకు ఆరుగురు సంతానం. కుమారులు జయసింహారెడ్డి, జయసూర్యరెడ్డి కను ముమూయగా; జయచంద్రారెడ్డి కళాకారుడిగా కొనసాగుతున్నారు. జయ ఓబుళరెడ్డి వైజాగ్‌లో డాక్ యార్డ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అరుణమ్మ, జయరత్నమ్మ కుమార్తెలు. ఆయన చిత్రకళా సామర్థ్యం కొంత కుమారుడు జయఓబుళరెడ్డికి లభించగా; నటన, సాహిత్యాభినివేశం మరో కుమారుడు జయచంద్రారెడ్డికి వచ్చాయి. పల్లె ప్రాంతపు మూఢ నమ్మకాలు, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలను ఎదుర్కొంటూ హాస్యాన్ని రమణీయంగా కలిపిన ‘అంగలాశి గాడు- కుశాలుగాడు’ 1982 నుంచి పలుసార్లు, పలుచోట్ల ప్రదర్శింపబడింది. వీటికి మించి 1991- 92 నుంచి అనంతపురం ఆకాశవాణిలో ఎన్నోసార్లు ప్రసారమైంది. ఇందులో రచయిత సీతారామ్ బుడబుడకల రామన్నగా పాత్ర పోషిస్తే, అమళ్ళదిన్నె గోపీనాథ్ కుశాలుగాడిగా, రంగప్పగా రామశేషయ్య, టీచర్‌గా ఏలూరు యంగన్న, కుమారుడు జయచంద్రారెడ్డి అంగలాశిగాడుగా, గంగమ్మగా శ్రీమతి లక్ష్మీ రాందాస్ నటించేవారు.
నిట్టూర్పులు, అక్షర సైన్యం, జై సీతారం- సీసాలు తోపాటు బాలసాహిత్యానికి సంబంధించి బాలల జెండా, వెన్నెల విందు, మేం పిల్లలం … మొత్తం ఆరు పుస్తకాలు ఇంతవరకు ప్రచురింప బడ్డాయి. అంగలాశిగాడు-కుశాలు గాడు, సుగుణ సుబోధిని ఇప్పుడు వెలువడు తున్నాయి. ఇంకా వేశ్య విశ్వామిత్ర, చలిమంట, బుడబుడకల భారతం, శినపోతన్న సిన్నాయన, యల్లామల్లీయం, మదాంధ భారతం, సున్న వాచకం, తిమ్మక్కోపాఖ్యానం మొదలైనవి ప్రచురించాల్సి ఉంది. ఆర్భాటం, ప్రచారం లేని చాలా సీదా సాదా అయిన వ్యక్తి కనక ఆయన శత జయంతి సంవత్సరం కూడా అలాగే గంభీరంగా సాగిపోతోంది.
– డా.నాగసూరి వేణుగోపాల్,
94407 32392