”వాడెప్పుడు తెలుసుకుంటాడో”

Feb 12,2024 08:28 #sahityam

ఒక మిత్రుడున్నాడు బలేచిత్రమైనవాడు

తెలివైనవాణ్ణనుకుంటాడు తనకు తెలిసిందేజ్ఞానమంటాడు

 

వాడొక పానమట్టం లేని బోడిలింగం

భూగోళం లింగాకారంలోనే ఉందని దబాయిస్తుంటాడు

 

ఎన్ని రుజువులు చూపినా తనుపట్టిన కుందేలుకు మూడే

కాళ్ళని వాదిస్తుంటాడు

 

భూమ్మీద ఎన్నిరకాల జాతుల పళ్ళున్నా అతడు కొనేదీ తినేదీ

ఒక్క నారింజపండు మాత్రమే

 

అన్నిరకాల పువ్వుల్లో కనకాంబరాలే శ్రేష్టమైనవంటాడు

 

మిరప్పండంటే భయమో కోపమో గానీ అతని వంటింటిలో

దానికి చోటేలేదు

 

కూరలో కారం వేసుకోడు ఎర్రగా ఉంటుందని

 

చప్పిడికూడు తినీతినీ రుచులకు దూరమై

ఈకలుమొలిచిన తోలుముక్కయిపోయింది వాడి నాలుక

 

సింధూరం దిద్దుకున్న నుదురెదురైతే బెదిరిపోతాడు

 

మందారం తురుముకున్న జడ కనబడితే అదిరిపడతాడు

 

నారింజరంగును చూడ్డానికి మాత్రమే అలవాటుపడిన వాడి

కళ్ళు ఇంద్రధనసును చూడలేకపోతున్నాయిప్పుడు

 

సప్తవర్ణమిశ్రమం కాషాయమే అని అతని ప్రగాఢ విశ్వాసం

 

పొద్దుపొడుపు సమయంలో బయటికి రాడు

అరుణకాంతి తనకు పడదని

 

చీకటికి అలవాటుపడ్డ కళ్ళు వెలుగును చూడలేవుకదా

 

ఎరుపును నిషేధించిన వాడి జీవితానికి ఉదయాలెలావస్తాయి?

 

ఎప్పుడో ‘అపాయం’ అనే హెచ్చరిక బోర్డు కూడా

నారింజరంగులోనే కనిపించి వాడేమైపోతాడోనని భయం నాది.

 

వాడెప్పుడు తెలుసుకుంటాడో

ప్రమాదానికి గురై ఎక్కడో ఉన్నాడని వాడు నమ్మేవాడు తనని

రక్షించడానికి రాడనీ,

కాపాడాల్సింది ఆస్పత్రిలో వైద్యుడేననీ

తన ఒంట్లోకి ఎక్కించాల్సింది ఎర్రని నెత్తురేనని ..!!

గంటేడ గౌరి నాయుడు9441415182

➡️