ఏ తావున వెతకాలి ?

పల్లవి : నీ మోమున చిరునవ్వు ఏ తావున వెతకాలి
రాయాల్సిన స్కిట్స్‌ కొరకు ఎవరిని బ్రతిమాడాలి
మిన్ను విరిగి మీద పడ్డా నిబ్బరంగా వుండడం
సాటి కళాకారులను అబ్బురంగా సాకటం
ఎంతటి విషయాన్నైనా నిమిషంలో చెప్పటం
మార్క్సిజాన్ని జీవితాన్ని కలగలిపి చెక్కటం
నేర్పడమే జీవితంగా బ్రతికావు ఇన్నాళ్లు
వేలమంది మనసుల్లో చెరగవు నీ ఆనవాళ్లు
నిర్వహణ తన పేరు సుబ్బారెడ్డి అంటుంది
నటన తన చిరునామా ఎలా మార్చుకుంటుంది ?

చరణం : ఒక్క పరిచయంతోనే స్నేహం చిరకాలం
మాట గాని కలిసిందా జరుగు మంత్రజాలం
నీ ప్రతి సంభాషణ నాటకంలో దృశ్యం
ఎలా మనసొప్పింది నీకు అయ్యావు అదృశ్యం
నీ మోమున చిరునవ్వు ఏ తావున వెతకాలి
రాయాల్సిన స్కిట్స్‌ కొరకు ఎవరిని బ్రతిమాడాలి

చరణం : ఒక్కసారి జ్ఞాపకాలు ఉప్పెనలా దాడిచేస్తే
వేసుకున్న ప్రణాళికలు అనాథలై విలపిస్తే
ప్రజానాట్యమండలి పెద్ద కొడుకు నిష్క్రమణం
రంగస్థల యవనిక అయ్యింది విభ్రమణం
నీ మోమున చిరునవ్వు ఏ తావున వెతకాలి
రాయాల్సిన స్కిట్స్‌ కొరకు ఎవరిని బ్రతిమాడాలి?

చరణం : ఎలా మొదలెట్టాలో ఎక్కడ మలుపివ్వాలో
డైలాగ్‌లు పంచులుగా మనసునెలా తట్టాలో
అలవోకగా ఆశువుగా నువు చెప్పిన స్క్రిప్ట్‌లు
ఎలా తట్టుకోవాలి వాటి కన్నీటి దక్కులు
నీ మోమున చిరునవ్వు ఏ తావున వెతకాలి
రాయాల్సిన స్కిట్స్‌ కొరకు ఎవరిని బ్రతిమాడాలి?

చరణం : కళాకారులం మాకు చెప్పలేని ఇగోలు
పనిలో చొరబడకుండా చూపినావు సులువులు
మలుపులు ఆటుపోట్లు ఉద్యమాల సహజమంటూ
కాడి వీడనట్టి గొప్ప సేద్యగాడివి నువ్వు
నీ మోమున చిరునవ్వు ఏ తావున వెతకాలి
రాయాల్సిన స్కిట్స్‌ కొరకు ఎవరిని బ్రతిమాడాలి?

చరణం : పిల్లల కోడి లెక్క నీ చుట్టూ గుంపు
ఆప్యాయత కురిపిస్తూ సాగు పలకరింపు
ఇట్టే గడిచిపోతుంది ఎంత సమయమైనా
దిగిపోవును ఎంతటి హదయ భారమైనా
నీమోమున చిరునవ్వు ఏ తావున వెతకాలి
రాయాల్సిన స్కిట్స్‌ కొరకు ఎవరిని బ్రతిమాడాలి?

చరణం : ప్రజానాట్యమండలి ముద్దుబిడ్డవు నువ్వు
చివరి మాట చిన్నదైనా చెప్పకుండా వెళ్ళావు
పరీక్ష పెట్టేందుకే ఇలా నువ్వు చేసావా
ఏం చేస్తాం భరిస్తాం నీ లక్ష్యం సాధిస్తూ…..
నీ మోమున చిరునవ్వు ఏ తావున వెతకాలి
రాయాల్సిన స్కిట్స్‌ కొరకు ఎవరిని బ్రతిమాడాలి?
కామ్రేడ్‌ సుబ్బారెడ్డి స్మృతి గీతం

రచన : దేవేంద్ర, పిఎన్‌ఎం

➡️