అక్కడ కన్నీటి సాగరాలు ఇంకిపోతున్నాయి
గుండెల్లో బడబాగ్ని గోళాలు
బద్దలవుతున్నాయి.
జాతి హననమే లక్ష్యంగా
సాగుతోన్న బాంబుల విస్ఫోటనంలో
కుప్పకూలుతున్న పసిపాపలు
నెత్తురోడుతూ మట్టిలో
కలిసినవారు కలిసిపోగా
మిగిలివున్న పాలబుగ్గల ఊపిరితిత్తుల్ని
సుళ్ళు తిరుగుతున్న తెల్ల భాస్వరం
మెల్లమెల్లగా కుళ్ళబెడుతోంది!
తినటానికి రొట్టె లేదు
తాగటానికి నీళ్లు లేవు
గుక్కెడు బురద నీళ్లతో
డొక్కలు చల్లార్చుకునే
దిక్కుమాలిన స్థితి
నిత్యం బిక్కు బిక్కుమంటోంది!
చిట్టితల్లుల బెదురు కళ్ళలో
చెదిరిపోతున్న నిదుర కలలు
ప్రపంచ శాంతి కాముకులకు
కునుకు పట్టని రాత్రుల్ని
బహూకరిస్తున్నాయి.
జరుగుతున్న విధ్వంసాన్ని
లోకం ముక్త కంఠంతో ఖండిస్తోన్నా
ఆ కాలనాగు కోరలో గానీ
నాగుని ఆడిస్తున్న
కాలయముడి బూరలో గానీ
జాలన్నది శూన్యం!
కాలిపోయిన సౌధంలో
పేలిపోయిన బాంబులా
అది మరింత వికృతంగా మారి
గుడ్లురిమి చూస్తోంది!
అయినా కాలం ఎప్పటికీ
ఒకేలా ఉంటుందనుకోవడం
మితిమీరిన అహంకారమే!
అది కాలిన గాయాల్ని ఏనాటికైనా
ఉపశాంతి కలిగించక మానదు.
అదిగో.. అక్కడ
విరిగిపడిన శిధిలాల మధ్య
విద్య నేర్చుకుందుకు
ఉరకలేస్తున్న పసిపాపలు!
చిక్కబట్టుకున్న ఆ పాలగుండెల్లో
ఇప్పుడిప్పుడే కొత్త ఆశల పావురాలు
రెక్కలు విప్పుకుంటున్నాయి
అవి తప్పక తమ ఉనికినీ మనికినీ
పదిలపరిచే నేలతల్లి స్తన్యాన్ని
అందుకొని తీరుతాయి!
– పతివాడ నాస్తిక్
సెల్ : 9441724167