Oct 13,2021 12:27

చెన్నై :   స్థానిక ఎన్నికల్లో అద్భుతమైన విజయం అందించిన ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఈ రోజు మధ్యాహ్నంతో ముగియనుంది. తొమ్మిది జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డిఎంకె పార్టీ డిఎంకె విజయపతాకాన్ని ఎగురవేసింది. ఆ జిల్లాల్లోని జిల్లా పంచాయతీ యూనియన్‌లన్నింటినీ గెలుచుకంది. జిల్లా పంచాయతీ యూనియన్‌ సభ్యులుగా డిఎంకె పార్టీకి చెందిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలిచారు. 140 జిల్లా పంచాయతీ యూనియన్‌ కౌన్సిలర్ల పదవులకుగాను 99 మంది డిఎంకె సభ్యులే గెలిచారు. అన్నాడిఎంకె తరఫున ఐదుగురు కౌన్సిలర్లు గెలిచారు. ఇక 1381 యూనియన్‌ కౌన్సిలర్ల పదవులకు జరిగిన ఎన్నికల్లో 325 మంది డిఎంకె అభ్యర్థులు గెలిచారు. అన్నాడిఎంకె తరఫున 47 మంది అభ్యర్థులు గెలుపొందారు.ఒక చోట డిఎండికె తన ఖాతాను తెరవగా, బిజెపి, అమ్మామక్కల్‌ మున్నేట్ర కజగం, నామ్‌ తమిళర్‌ కట్చి ఘోరపరాజయాన్ని చవిచూశాయి. పలుచోట్ల డిపాజిట్లను కూడా కోల్పోయాయి.

బిజెపి అభ్యర్థికి ఒక్క ఓటే

తొమ్మిది జిల్లాలతోపాటు, కోయంబత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ యూనియన్‌ సభ్యత్వ పదవికి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. కురుడంపాళయం తొమ్మిదవ వార్డు సభ్యత్వ పదవికి బిజెపికి కార్తీక్‌ పోటీ చేశారు.మంగళవారం కౌంటింగ్‌లో ఆయనకు ఒకే ఓటు వచ్చింది. ఆ వార్డులోనే కార్తీక్‌, తల్లిదండ్రులు, భార్య, సోదరుడు కూడా నివసిస్తున్నారు. కార్తీక్‌ కుటుంబ సభ్యులు ఆయనకు ఓటేసి ఉంటే కనీసం ఐదు ఓట్లు రావాల్సి వుండగా ఒకే ఓటు పోలవడం గమనార్హం.