
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రవాణారంగంలో నెలకొన్న సమస్యలపై డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తీర్మానించింది. రాష్ట్రంలో 40 లక్షల మంది ఉపాధి పొందే రవాణారంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అసోసియేషన్ తీర్మానాల అమలుకు కృషి చేయాలని కోరింది. బుధవారం కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోషియేషన్ హాలులో ఎపి లారీ ఓనర్స్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గోపాలనాయుడు మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌టాక్స్‌ను రూ.200 నుంచి రూ.20 వేలకు పెంచడం సరైందికాదని అన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో రవాణా రంగాన్ని ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు రెండు త్రైమాసిక పన్నులు రద్దు చేయగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పన్ను వసూలు వాయిదా కూడా వేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి 20 శాతం మేర వాహనపన్ను పెంచే ఆలోచన చేస్తోందని, ఇది సరైందికాదని అన్నారు. రాష్ట్రంలో ఇంధన ధరలు అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా వున్నాయని చెప్పారు. లీటర్‌కు ఐదు రూపాయలు సెస్‌ను వసూలు చేయడం తగదని విమర్శించారు. అసోసియేషన్ నాయకులు చెన్నుపాటి వజీర్ మాట్లాడుతూ రవాణా రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నలభై లక్షల మంది ఉపాధి పొందుతున్నా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. వాహన యాప్ సాఫ్ట్వేర్ సమస్య కారణంగా పొరుగు రాష్ట్రాల్లో అన్ని పత్రాలున్నా జరిమానాలను చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో హమాలీలకు ఎగుమతి, దిగుమతి కూలీని సరుకు యజమానే చెల్లించాలని, లారీ డ్రైవర్ నుండి లోడింగ్ అన్ లోడింగ్ మామూళ్లు తీసుకోరాదని తీర్మానం చేశారు. డిసెంబరు 15 నుండి రాష్ట్రంలో లారీ డ్రైవర్లు, యజమానులు లోడింగ్, అన్ లోడింగ్ మామూళ్లు ఎవరికి చెల్లించనవసరం లేదని, గుమస్తా రుసుములూ చెల్లించక్కరలేదని, ధాన్యం బస్తాల అన్‌లోడింగ్‌లో అరుగుదలకు అద్దెనుండి మినహాయింపు వుండరాదని, అన్లోడింగ్ 24 గంటలు దాటితే వెయిటింగ్ ఛార్జీ సరుకు యజమాని చెల్లించాలని తీర్మానించారు. ఆశీలు వసూలు చేయరాదని ఈ రౌండ్‌టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో నాయకులు గోపిశెట్టి వీరవెంకయ్య, దాసరి శ్రీనివాసరెడ్డి, నారాయణ, దేవరాజ్, సత్యనారాయణ, గిరి, ప్రసాద్ రెడ్డి, కొల్లి మురళీకృష్ణ మాట్లాడారు.