Jul 21,2021 20:59
ఎస్‌ఇ కార్యాలయం వద్ద జోరు వర్షంలోనూ ఆందోళన చేస్తున్న మాచ్‌ఖండ్‌ గ్రామస్తులు

ప్రజాశక్తి - ముంచంగిపుట్టు (విశాఖపట్నం) : ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం మాచ్‌ఖండ్‌ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు ఎస్‌ఇ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడకు వచ్చిన జయపురం సౌత్‌కో ఎస్‌డిఒ, టాటా పవర్‌ సిబ్బంది, ప్రాజెక్టు ఇఇ జనరేషన్‌ డి.రమణయ్యలను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 71 సంవత్సరాల పాటు ఆరు జనరేటర్లతో విద్యుదుత్పత్తి చేస్తూ ఎంతో ఘనచరిత్ర కలిగి ఉన్న దేశ మొట్టమొదటి జల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోబోమన్నారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ఒడిశాకు చెందిన సౌత్‌కో సంస్థకు అప్పజెప్పడం దారుణమని పేర్కొన్నారు. బుధవారం సౌత్‌కోకు చెందిన టాటా పవర్‌ సిబ్బంది తమ ప్రాంతానికి సర్వే చేయడానికి వచ్చారని తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్‌ ఎస్‌ఇ కెవి.నాగేశ్వరరావు గ్రామస్తుల వద్దకు వచ్చి ప్రైవేటీకరణ చేయడంలేదని, భవిష్యత్తు అవసరాలరీత్యా సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాత్రమే టాటాపవర్‌ సిబ్బంది వచ్చారని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.