
ప్రజాశక్తి-విజయనగరం : మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల విక్రయాలపై నిఘా పెంచాలని కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. జాతీయ బాలల హక్కుల కమిషన్, మాదక ద్రవ్యాల నిరోధక శాఖలు సంయుక్తంగా రూపొందించిన జాయింట్ యాక్షన్ ప్లాన్ అమలుపై సోమవారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు నెలవారీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్ధాలపై, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్గించాలన్నారు. దీనికోసం స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. మద్యం షాపుల్లో సిసి కెమేరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో కంప్లయింట్ బాక్సులను ఏర్పాటు చేయాలని, ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లను ప్రదర్శించాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ యాక్షన్ ప్లాన్ నోడల్ ఆఫీసర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటిండెంట్ వి.సుధీర్, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, ఐసిడిఎస్ పీడీ బి.శాంతకుమారి, ఔషధ నియంత్రణశాఖ ఎడి కె.రజిత, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి పి.రత్నం, బిసి సంక్షేమాధికారి యశోధనరావు, మున్సిపల్ హెల్తాఫీసర్ డాక్టర్ కెవిఎస్ సత్యనారాయణ జిల్లా యువజన సమన్వయాధికారి విక్రమాధిత్య తదితరులు పాల్గొన్నారు.