
నోటీసులివ్వకుండా మా ఇళ్లు జెసిబితో ధ్వంసం చేశారు
సర్పంచి భర్త కక్ష సాధింపు చర్యలు సరికావు
చేవూరు ఎస్‌టి కాలనీ వాసుల ఆవేదన
ప్రజాశక్తి - ముదినేపల్లి
''గ్రామ సర్పంచి భర్త ఆగడాలకు మేము రోడ్డున పడ్డాం. మాకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, మేము ఇంటి వద్ద లేని సమయంలో జెసిబితో మా ఇళ్లు ధ్వంసం చేశారు. దీంతో మాకు రూ.ఐదు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది'' అని మండలంలోని చేవూరు గ్రామ ఎస్‌టి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు కట్టా సుబ్బారావు, కట్టా ఏడుకొండలు, కుంభ వెంకటేశ్వరరావు, కుంభా నాంచారమ్మ తమ బాధను వివరించారు. మండలంలోని చేవూరు గ్రామంలో గత 108 సంవత్సరాలుగా మంచినీటి చెరువు వద్ద ఎస్‌టిలు జీవిస్తున్నారు. ఇంటిపన్ను, కరంట్ బిల్లు, ఇంటి పట్టా అన్నీ ఉన్నాయన్నారు. ఎస్‌టిలు ఇంటి వద్ద లేని సమయంలో ఎలాంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా గ్రామ సర్పంచి భర్త వల్లభనేని వెంకట్రావు, గ్రామ విఆర్‌ఒ, అధికారులు, పోలీసులుతో వచ్చి తమ ఇళ్లను జెసిబితో కూల్చివేశారని వాపో తున్నారు. రెండు ఇళ్లల్లో నాలుగు కుటుంబాలు నివాసి స్తున్నాయన్నారు. ఇళ్లు కూల్చి వేత విషయం తెలుసుకుని పరుగు, పరుగున వచ్చి అడ్డుకోబోగా తమను సర్పంచి భర్త వెంకట్రావు దుర్బాషలాడినట్లు తెలిపారు. ''మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వెంటనే వెళ్లిపోవాలి, కూల్చివేత పనులు అడ్డుకుంటే మిమ్మల్ని కూడా ఇంటితో పాటు జెసిబితో తొక్కించి వేస్తాం' అని బెదిరించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఇళ్లల్లోని టివిలు, బీరువాలు, గృహోపకరణాలన్నీ పగిలిపోయినట్లు చెప్పారు. అంతేకాకుండా ఇళ్లును, ఇళ్లల్లోని అన్నీ వస్తువులను జెసిబితో తీసుకువెళ్లి చెరువులో పూడ్చివేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో రూ.ఐదు లక్షలు మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఎస్‌టిలు చెబుతున్నారు. తరతరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమను కక్షసాధింపుతో వెంకట్రావు తొలగించాలని చూస్తున్నారన్నారు. వైసిపికి చెందిన వారు కాదని, వేరే పార్టీకి చెందిన వారంటూ వెంకట్రావు తమపై పెట్టే హింసాకు చనిపోవాలనిపిస్తుందంటూ ఎస్‌టి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణమైన వల్లభనేని వెంకట్రావుపై అధికారులు తగిన చర్యలు తీసుకొని, కూల్చివేసిన తమ ఇళ్లను తిరిగి పున:నిర్మించాలని, నష్టపోయిన తమకు నష్టపరిహారం ఇప్పించి, తాము ఇక్కడే ఉండేవిధంగా అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఎస్‌టి కాలనీ వాసులు కోరుతున్నారు.
చెరువు విస్తరణ చేయాలి
గ్రామ సర్పంచి వి.లక్ష్మి
గ్రామ జనాభాకు నీరు అందిచేందుకు సరిపడ చెరువు సామర్థ్యం లేదు. చెరువు విస్తరణ పనులు చేయాలి. ఎస్‌టిలకు ముందస్తు నోటీసులు ఇచ్చాం. వారిలో ఇద్దరికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఎస్‌టిలు చెరువు గట్టుపై పందులను పెంచుతున్నారు. అవి చెరువులో దిగి నీటిని కలుషితం చేస్తున్నాయి. నా భర్త వెంకట్రావు ఎస్‌టిలను దుర్భాషలాడలేదు. అందులో నిజం లేదు.