Jun 11,2021 21:20

ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన

ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌
మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతుసంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద రైతుసంఘం సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. తోతాపురికి 20 రూపాయలు, బేనీషాకు 30 ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు టి.జనార్ధన్‌, మాంగాటి గోపాల్‌రెడ్డి, కె.కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మామిడి సీజన్‌లో రైతాంగం రోడ్డెక్కితే తప్ప గిట్టుబాటు ధర సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా కలెక్టర్‌ గుజ్జు ఫ్యాక్టరీ యజమానులతో గిట్టుబాటు ధర విషయమై చర్చించినా ఫలితం శూన్యమన్నారు. ఫ్యాక్టరీ యజమానులు ధర తగ్గిస్తే, మిగిలిన మొత్తాన్ని ధరల స్థిరీకరణ నిధి నుంచి ప్రభుత్వమే ప్రోత్సాహకరంగా అందజేయాలని కోరారు. గుజ్జు యజమానులు ప్రభుత్వ సూచనలు పాటించకపోతే లైసెన్సులు రద్దుచేయాలని కోరారు. జిల్లాకు మామిడి బోర్డు ఏర్పాటు చేసి తరచూ రైతుల సాధక బాధలు తెలుసుకోవాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారి సురేష్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు పిఎల్‌ నరసింహులు, హేమలత, బి.శ్రీనివాసులు, చిన్నం పెంచలయ్య, పి.మురళి, డి.రామచంద్రయ్య, కృష్ణయ్య, దామోదరం పాల్గొన్నారు.