May 17,2022 06:52

మహమ్మారి వచ్చిన రెండో ఏడాదిలో ఐఎంఎఫ్‌ మూడో ప్రపంచపు 15 దేశాలతో చేసుకున్న రుణ ఒప్పందాలను ఆక్స్‌ఫాం ఇటీవల విశ్లేషించింది. వాటిలో 13 ఒప్పందాలలో చాలా స్పష్టంగా పొదుపు చర్యల కోసమై ఐఎంఎఫ్‌ పట్టుబట్టింది. ఆహారం మీద, ఇంధనం మీద పన్నులు పెంచాలని, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలని షరతులు పెట్టింది. ప్రభుత్వ వ్యయం తగ్గడం అంటే ప్రజలకు అందించే మౌలిక సేవలైన విద్య, వైద్య సేవలు కుదించడమే. ప్రస్తుతం రుణ ఒప్పందాల నిమిత్తం చర్చలు మరో ఆరు దేశాలతో జరుగుతున్నాయి. వాటిలో కూడా ఐఎంఎఫ్‌ ఇదే విధంగా పొదుపు చర్యల కోసం పట్టుబడుతోంది.

      త రెండు సంవత్సరాలుగా ప్రపంచంలో మహమ్మారి తాండవిస్తోంది. ఇటువంటి ఉపద్రవాన్ని మనం గత శతాబ్ద కాలంలో ఎన్నడూ చూడలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ఇప్పటికి ఒక కోటి ఏభై లక్షల ప్రాణాలు పోయాయి. ఇప్పటికీ ఈ మహమ్మారి అంతం కనుచూపుమేరలో ఎక్కడా కానరావడం లేదు. ఇది మానవజాతి ఎదుర్కొంటున్న అసాధారణ సంక్షోభం. దీనిని ఎదుర్కోడానికి ప్రతీ ప్రభుత్వమూ బ్రహ్మాండమైన ప్రయత్నాన్ని చేయాలి. ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చేయవలసిన అగత్యం ఉంది. ఆ దేశాల్లోని ప్రజానీకం ఈ మహమ్మారి ప్రమాదానికి లోనయ్యే ఆస్కారం ఎక్కువగా ఉండడమే కాకుండా దానితోబాటు వచ్చే దుర్భర పరిస్థితులు కూడా ఈ దేశాల్లోనే ఎక్కువగా తాండవిస్తాయి.
    ఈ దేశాల ప్రభుత్వాలు ఆస్పత్రులలో సదుపాయాలను విస్తరింపజేయాలి. తగు సంఖ్యలో ఆస్పత్రి పడకలను సిద్ధంగా ఉంచాలి. పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి. వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి. వ్యాక్సినేషన్‌ నిర్వహించే ఏర్పాట్లు తగు మోతాదులో ఉండాలి. దీనితోబాటు ప్రభుత్వాలు ప్రజలకు నగదు బదిలీ ద్వారా సహాయం అందించాలి. చిన్న ఉత్పత్తిదారులకు తగు తోడ్పాటు అందించాలి. వీటన్నింటికీ ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయవలసి వస్తుంది. కాని ఈ మహమ్మారి కారణంగానే ఉత్పత్తి దెబ్బ తింటున్నది. దానితోబాటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయమూ తగ్గిపోతున్నది. సంపద పన్ను రేటును పెంచకుండా ఉన్నట్లయితే ప్రభుత్వాలు తమ బడ్జెట్‌ ద్రవ్యలోటును పెంచవలసి వుంటుంది. అంటే ఇంకోవిధంగా చెప్పాలంటే ప్రభుత్వాలు నయా ఉదారవాద ఆదేశాలకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించాల్సి వుంటుంది. అంటే ద్రవ్యలోటును అదుపులో ఉంచడం, పొదుపు చర్యలను పాటించడం వంటి ఆదేశాలను పక్కన పెట్టవలసి వస్తుంది. కాని వాస్తవంగా ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం.
    ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గడం వలన అంటే మాంద్యం నెలకొన్నందువలన మూడో ప్రపంచ దేశాల ఎగుమతులు దెబ్బతింటాయి. వాటి స్వంత జిడిపి తగ్గినందువలన అవి చేసుకునే దిగుమతులు కూడా తగ్గుతాయి. ఎగుమతులు, దిగుమతులు రెండూ తగ్గితే విదేశీ చెల్లింపు లోటు కూడా తగ్గిన జిడిపి కి అనుగుణంగా తగ్గుతుంది. అందువలన పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కాని గతం నుండీ కొనసాగుతున్న విదేశీ రుణాల చెల్లింపులు అదే మోతాదులో ఉంటాయి. తగ్గిన జిడిపితో పోల్చితే వాటి పరిమాణం పెరుగుతుంది. ఈ రుణాల చెల్లింపులను సర్దుబాటు చేయడం, వాయిదా వేయడం అవసరమౌతుంది. అంటే మహమ్మారి ఫలితంగా తగ్గిన జిడిపి కి అనుగుణంగానే విదేశీ వాణిజ్యం తగ్గినప్పటికీ, జిడిపి మాంద్యంలో పడిపోతుంది. దానితో పోల్చినప్పుడు విదేశీ చెల్లింపుల వాటా పెరుగుతుంది. అంటే రుణభారం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మూడో ప్రపంచ దేశాలకు ప్రత్యేకంగా రాయితీలు కల్పించాల్సి వుంటుంది.
     కొన్నేళ్ళపాటు రుణాల వాయిదాలు చెల్లించనవసరం లేకుండా మారటోరియం అమలు చేయడం దీనికి పరిష్కారంగా మనకి వెంటనే తోస్తుంది. వర్తమాన పెట్టుబడిదారీ ప్రపంచంలో ఇటువంటి రుణ మారటోరియాన్ని అమలు చేసే బాధ్యత ఐఎంఎఫ్‌ వంటి సంస్థల మీద ఉంటుంది. మూడో ప్రపంచ దేశాలను ప్రోత్సహించి పొదుపు చర్యలను పక్కనబెట్టమని, ప్రజారోగ్యానికి, వారి సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు చేయమని ఈ సంక్షోభ కాలంలో చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ ఐఎంఎఫ్‌దే. నిజానికి ప్రస్తుతం ఐఎంఎఫ్‌ కి మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్న క్రిస్టాలినా జార్జీవా చాలాసార్లు ఈ సంక్షోభ కాలంలో పొదుపు చర్యలను పక్కనపెట్టమని సభ్యదేశాలను ప్రోత్సహించింది. ఇటీవలే ''పొదుపు చర్యల పేరుతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయవద్దని'' ఆమె యూరప్‌ దేశాలను కోరింది. దానిని బట్టి మానవజాతి మొత్తానికి ఈ మహమ్మారి వలన దాపురించిన ముప్పు తీవ్రత ఎంతటిదో బోధపడిందన్న అభిప్రాయం కలుగుతుంది.
      కాని వాస్తవం వేరుగా ఉంది. మహమ్మారి వచ్చిన రెండో ఏడాదిలో ఐఎంఎఫ్‌ మూడో ప్రపంచపు 15 దేశాలతో చేసుకున్న రుణ ఒప్పందాలను ఆక్స్‌ఫాం ఇటీవల విశ్లేషించింది. వాటిలో 13 ఒప్పందాలలో చాలా స్పష్టంగా పొదుపు చర్యలకోసమై ఐఎంఎఫ్‌ పట్టుబట్టింది. ఆహారం మీద, ఇంధనం మీద పన్నులు పెంచాలని, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలని షరతులు పెట్టింది. ప్రభుత్వ వ్యయం తగ్గడం అంటే ప్రజలకు అందించే మౌలిక సేవలైన విద్య, వైద్య సేవలు కుదించడమే. ప్రస్తుతం రుణ ఒప్పందాల నిమిత్తం చర్చలు మరో ఆరు దేశాలతో జరుగుతున్నాయి. వాటిలో కూడా ఐఎంఎఫ్‌ ఇదే విధంగా పొదుపు చర్యల కోసం పట్టుబడుతోంది.
     ఈ విధంగా పొదుపు చర్యలకోసం పట్టుబట్టడం అనేది ఏవో కొద్ది దేశాలకే పరిమితంగా పాటిస్తున్న విధానం కాదు. మార్చి 2020 నుండి-అంటే మహమ్మారి తాకిడి మొదలైనప్పటి నుండి 2020 అక్టోబర్‌ 12 మధ్య 81 దేశాలతో 91 రుణ ఒప్పందాలను ఐఎంఎఫ్‌ కుదుర్చుకుంది. వీటిలో 76 ఒప్పందాల్లో- అంటే, 84 శాతం ఒప్పందాల్లో పొదుపు చర్యల కోసం పట్టుబట్టడం జరిగిందని ఆక్స్‌ఫాం వెల్లడించింది. అంటే ప్రపంచంలో ప్రజానీకం పొదుపు చర్యల భారాన్ని ఇంకేమాత్రమూ తట్టుకోలేని ఈ పరిస్థితుల్లో కూడా ఐఎంఎఫ్‌ ఏ మాత్రమూ తగ్గకుండా బలంగా పొదుపు చర్యల కోసం పట్టుబడుతోంది. అందుచేత క్రిస్టాలినా జార్జీవా యూరప్‌ దేశాలకు ఇచ్చిన సలహాలను బట్టి కాకుండా, ఆమె నాయకత్వం వహిస్తున్న సంస్థ ఐఎంఎఫ్‌ వాస్తవంగా మూడో ప్రపంచ దేశాలకు నిర్దేశిస్తున్నదేమిటో చూడాలని ఆక్స్‌ఫాం నొక్కిచెప్పింది. ఐఎంఎఫ్‌ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని ఆక్స్‌ఫాం విమర్శించింది. సంపన్న దేశాల విషయంలో ఒకలాగ, మూడో ప్రపంచ దేశాల విషయంలో ఇంకొకలాగ వ్యవహరిస్తోందని ఎత్తిచూపింది. మామూలు పరిస్థితుల్లోనే ఈ తరహా ద్వంద్వ ప్రమాణాలను పాటించడం తప్పు. ఇక ప్రస్తుత మహమ్మారి కాలంలో, మానవజాతి మొత్తం మనుగడకే ముప్పునెదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం మరీ తప్పు.
     ఆక్స్‌ఫాం విశ్లేషణ విస్మరించిన విషయం ఏమిటంటే, ఐఎంఎఫ్‌ వ్యవహారశైలిలో వ్యక్తమైన ద్వంద్వ ప్రమాణాలు పెట్టుబడిదారీ వ్యవస్థలో ముందు నుంచీ ఉన్నవే. ఒక వర్గ సమాజం అంటేనే అందులో ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయి. ఒక కార్మికుడు బ్యాంకుకి వెళ్ళి రుణాన్ని పొందడం సాధ్యం కాదు. అదే ఒక సంపన్నుడు రుణాన్ని పొందడం తేలిక. వేరే విధంగా చెప్పాలంటే, మన దగ్గర ఎంత 'పెట్టుబడి' ఉంటే, అంతగా బైట నుండి 'పెట్టుబడి'ని (రుణం రూపేణా) పొందడం సాధ్యం అవుతుంది. స్వంతంగా పెట్టుబడిని కలిగివుండడం అనేది పెట్టుబడిదారుడిగా వ్యవహరించడానికి అవశ్యమైన షరతు. ఇటువంటిదే లేకపోతే ఎవరైనా పెట్టుబడిదారుడిగా తయారవవచ్చు. అప్పుడిక వర్గ విభజనలకు తావు లేకుండా, సామాజికంగా అందరూ ఎదిగేదానికి అవకాశం ఉంటుంది.
     పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధించే జోసెఫ్‌ స్కమ్‌పీటర్‌ వంటి మేథావులు లాభాలు సంపాదించడానికి ఉత్పత్తి సాధనాలను స్వంత ఆస్థిగా కలిగివుండడం మూల కారణం కాదని వాదిస్తారు. పెట్టుబడిదారులుగా ఉన్నవారికి ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుందని, దానినే ' కొత్త పద్ధతుల్లో ఆలోచించడం' అంటారని అటువంటి నైపుణ్యం ఉన్నవారు ఒక కొత్త ఉత్పత్తి పద్ధతిని అమలు చేయడమో, లేక ఒక కొత్త వస్తువును ఉత్పత్తి చేయడం గాని చేసి, ఏ బ్యాంక్‌ నుంచైనా రుణం తీసుకుని ఒక వ్యాపారాన్ని ప్రారంభించవచ్చునని అంటారు. సమాజంలో వాస్తవంగా నెలకొన్న వర్గ విభజనను కనపడనివ్వకుండా దాచిపెట్టేందుకు చేసే ఇటువంటి వాదనలు శుద్ధ తప్పు. ఎంత కొత్త పద్ధతుల్లో ఆలోచించగలిగినప్పటికీ, ఒక వ్యవసాయ కూలీ స్వంతంగా వ్యాపారం ప్రారంభించలేడు. అతడి కొత్త ఆలోచనను ఒక సంపన్నుడు గనుక కాజేస్తే అప్పుడు ఆ సంపన్నుడు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతాడు.
     సామ్రాజ్యవాద ప్రపంచంలో కూడా సరిగ్గా ఇదే విధంగా జరుగుతుంది. సంపన్న దేశాలుగా కొన్ని, అభివృద్ధికి దూరంగా ఉండే దేశాలుగా తక్కినవి ఉండే పరిస్థితుల్లో, అభివృద్ధికి దూరంగా ఉన్న దేశాలకు రుణాలు ఇవ్వడానికి సంపన్న దేశాల బ్యాంకులు ముందుకు రావు. సంపన్న దేశాలకు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంటాయి. ఆ విధంగా రుణాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఈ సంపన్న దేశాల ఆర్థిక సంస్థల ఆధిపత్యంలో ఉండే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి కాపలా కాసే పనిలో ఐఎంఎఫ్‌ ఉంటుంది. అందుచేత ఆ ద్వంద్వ ప్రమాణాలను ఐఎంఎఫ్‌ కూడా పాటించి తీరుతుంది. ఐఎంఎఫ్‌ ఒక సదుద్దేశం కలిగిన, మానవత్వం నిండిన సంస్థ అని, మానవజాతి మొత్తం ప్రయోజనాలక ోసం అది పాటుపడుతుందని అనుకుంటే అది పొరపాటు. ఐఎంఎఫ్‌ ఒక పెట్టుబడిదారీ సంస్థ. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలను కాపాడడమే దాని పని.
     అందుచేత ఐఎంఎఫ్‌ వ్యవహరించే తీరు పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ వ్యవస్థ లోని అమానవీయతనే ప్రతిబింబిస్తుంది. ప్రజల కన్నా లాభాలే దానికి ప్రాధాన్యతగా ఉంటుంది. అంతే కాదు, మానవులందరి ప్రాణాలకూ ఒకే మాదిరి విలువ ఉంటుందని అది భావించదు. సమాజ జీవితంలోని ప్రతీ పార్శ్వానికీ అది ద్వంద్వ ప్రమాణాలనే వర్తింపజేస్తుంది. ఉదాహరణకు: కాలుష్య కారక పరిశ్రమలను సంపన్న దేశాల నుండి వెనుకబడిన దేశాలలోకి మార్చాలన్న డిమాండ్‌ను అది బలపరుస్తుంది. సంపన్న దేశాల మానవుల ప్రాణాలతో పోల్చితే దాని దృష్టిలో వెనుకబడిన దేశాలలోని మానవుల ప్రాణాలకు పెద్దగా విలువ లేదు.
     ఈ ద్వంద్వ ప్రమాణాలు, లేదా మౌలికమైన వివక్షతతో కూడిన సమాజపు దుష్టత్వం ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ మహమ్మారి చెలరేగుతున్న కాలంలో, మరీ స్పష్టంగా కానవస్తుంది. మహమ్మారిని ఎదిరించి పోరాడాలన్నా, మానవత్వంతో వ్యవహరించాలన్నా, మనం యావత్తు మానవజాతి ప్రాణాలను కాపాడుకోడానికి ప్రయత్నించాలి. ఆ మానవులు ఎక్కడివారైనా, ఏ సామాజిక వ్యవస్థలో ఉన్నవారైనా, వాని నడుమ ఎన్ని తేడాలు, వివక్షతలు ఉన్నా, వారందరి ప్రాణాల విలువా సమానమే. కాని ఆ విధంగా గుర్తించడానికి సిద్ధపడక పోవడంలోనే ఈ పెట్టుబడిదారీ సమాజపు అమానవీయత, హేతు విరుద్ధత కానవస్తాయి.

( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌