Jan 18,2021 07:18

    థలు ఆకాశంలోంచి పుట్టవని, కేవలం ఆలోచనల్లోంచి ఆవిర్భవించవని మనకు తెలుసు. కళ్లముందు కదలాడే సంఘటనలే కథకు బీజం. అనేకనేక విశేషాలతో, సంఘర్షణతో కూడిన మానవ జీవితమే కథకు మూలం. బతుకు సంఘర్షణల్లోంచి కథ చెప్పటానికి అవసరమైన బీజప్రాయమైన సంగతి ఏదో మనసున ఒక మొలకై తలెత్తుతుంది! ఆ మొలకకు అనేకనేక ఆలోచనలు చొప్పించి ఆకులను జోడించటం, నెమ్మదినెమ్మదిగా కొమ్మలు రెమ్మలుగా విస్తరించటం, ఊహా ఎరువు చేత ఇంతింతై అన్నట్టు ప్రవర్థమానం కావటం, పూలూ పిందెలూ కాయలూ పండ్లుగా పరిణామం చెందటం ... ఒక క్రమంలో సాగే ప్రక్రియ. ఇదంతా రచయితల ప్రతిభానైపుణ్యాలపై అలరారే విద్య. అలాంటి విద్యను అలవోకగా ప్రదర్శించే రచయిత్రి సమ్మెట ఉమాదేవి. ఆమె జీవితాల్లోని కథలను అవలీలగా పట్టుకోగలదు. జీవితాలను కథల్లోకి మళ్లించి, పాఠకుల హృదయాల మీదుగా ప్రవహింపజేయగలదు.
    వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు కావటం చేత- మాయామర్మం అంటని పిల్లలతో ఎక్కువ కాలం గడిపే అవకాశాన్ని పొందారు. సౌకర్యాలున్న పట్టణాల్లానో, వాటి దగ్గర్లోనే పనిచేయాలనే తాపత్రయం లేకపోవటం చేత- దాదాపుగా సర్వీసు కాలమంతా కొండకోనల్లోనే గడిపారు. మైళ్లకు మైళ్లు నడిచారు. ముళ్లదారుల్లో, మట్టిబాటల్లో పాదయాత్రలు చేశారు. తాగునీరు సరిగ్గా లేని ఊళ్లల్లో, రవాణా సౌకర్యం అంతగా లేని తండాలకు దగ్గర్లో పనిచేశారు. అలా చేయడం ద్వారా ఆమె పడిన కష్టం ఊరకనే పోలేదు. తనకు ఇష్టమైన మట్టి మనుషులు నిరంతరంగా తారసపడ్డారు. ఎంతటి కష్టాన్నయినా నవ్వుతూ స్వీకరించే శ్రమజీవులు ఎప్పటికప్పుడు దర్శనం ఇచ్చారు. రోడ్డుపక్కన అందంగా విరిసే రేలపూలు, అక్కడక్కడ అరుదుగా కనిపించే జమ్మిపూలు ఆమెకు ప్రియమైన కథా కానుకలుగా వచ్చి వొళ్లో వాలాయి. కొండకోనల్లో విభిన్నమైన జీవితాలను చూశారు. భిన్నమైన మనుషులను చూశారు. వారిని పలకరించారు. వాళ్ల చెలిమితో పరవశించారు. 'వీళ్లు మీ ఊరి వాళ్లు' అని గర్వంగా గుండెల్లో దాచుకున్నారు. ఘనంగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఉదయమూ సాయంత్రమూ నడిచో, ఆటోల్లోనో, బస్సులోనో హడావిడి ప్రయాణాలు చూస్తూనే- బోలెడు బోలెడు జీవిత శకలాలను దర్శించారు. ఎందరి సాధకబాధకాలనో ప్రేమగా పంచుకున్నారు. అలా విన్న, చూసిన జీవిత ఉదంతాలు ఉమాదేవి హృదయంనిండా పల్లవించాయి. కథలు కథలుగా ఇలా ప్రవహించాయి. ఇవి నేరుగా జీవితాల్లోంచి నడిచొచ్చిన కథలు కావడం చేత- తడితడిగా ఉంటాయి. మృదువుగా ఉంటాయి. హృదయానికి దగ్గరగా ఉంటాయి. మనిషి వాసన వేస్తాయి. మానవత్వాన్ని పరిమళిస్తాయి.
    ఎప్పుడైనా ఏదైనా మనసును తాకిన సంఘటన తారసపడితే- ఉమాదేవి కదిలిపోతారు. దాన్లో మమేకం అయిపోతారు. ఎంతగా మమేకం అయిపోతారంటే- ఆరోజో, ఆ మర్నాడో మనతో మాట్లాడినా- అదే సాంద్రత.. అదే గాఢత! అసహాయగా మిగిలిపోయిన ఆడపిల్ల గురించో, అర్ధాంతరంగా చదువు ఆగిపోతున్న పిల్లాడి గురించో - అల్లాడిపోతారు. వాళ్లలోని ఏమూలనో దాక్కొని వెలిగిన ధైర్యాన్ని చూసి, ఆశను చూసి మురిసిపోతారు. అలా ప్రేక్షకురాలిగా ఉండిపోరు. ఆ ఆశలదివ్వెకు తన చేతులు రెండూ దాపుగా పెడతారు. మాటల ధైర్యం చెబుతారు. చేతల్లో సాయమూ చేస్తారు. అలా ఓ అమ్మలా, అక్కలా, ఓ మార్గదర్శిగా గొప్ప భరోసాగా నిలుస్తారు. ఆ కదిలిపోయే గుణమే ఉమాదేవిని మంచి మంచి ఉపాధ్యారాయులిని చేసింది. గొప్ప కథకురాలిగా తెలుగు సాహిత్యానికి అందించింది.
   ఉమాదేవికి ఎప్పటినుంచో కథలు రాసే అలవాటు ఉన్నా- 2010 నుంచి ఉధృతంగా రాశారు. అనేక కథాపోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. అనేక కథాసంపుటాల్లో చోటు సంపాదించుకున్నారు. కొన్ని కథాసంకలనాలూ వెలువరించారు. అమ్మ కథలు, రేలపూలు, జమ్మిపూలు పేరిట కథాసంకలనాలు ప్రచురించారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న 'సమ్మెట ఉమాదేవి కథలు' కధాసంకలనాల్లో నాలుగోది. ఈ కథలన్నీ దాదాపు వివిధ పత్రికల్లో వెలువడినవే! ఈ కథలన్నింటా మానవీయమైన స్పందన, హృదయాంగతమైన స్నేహం, మనిషిపై నమ్మకం, అవధుల్లేని ప్రేమా ... ధారలు ధారలుగా కురుస్తూ ఉంటుంది. అది పాఠకుడి హృదయాంతరాల్లో ఒక మార్మికమైన భావధారను సృష్టిస్తూ ఉంటుంది.
ఈ సంపుటిలోని మొదటి కధ 'తడి..'. మండు వేసవి వేళ ముంచుకొచ్చే తాగునీటి సమస్య కథావస్తువు. భూగర్భంలో నీరు ఇంకిపోతున్నకొద్దీ మనుషులలో సహాయపడే గుణమూ అడుగంటుకుపోతుంది. వాళ్ల వాళ్ల స్వభావాలను బట్టి రాజారావు, శంకర్రావు, రామ్మూర్తి మాస్టారూ ... వ్యవహరిస్తారు. గుక్కెడు నీరు ఇవ్వటానికి కూడా ఇష్టపడడు ఆఫీసులో రాజారావు. తొలుత బావినీరు ఇచ్చి, ఆ తరువాత మాకే చాలడం లేదంటూ ముఖం చాటేస్తాడు రామ్మూర్తి. కాలనీలో అందరి ఇళ్లల్లో ఇదే పరిస్థితి! పలకరింపుల్లో, పట్టించుకోవటంలో తేడాలు వస్తాయి. మనిషితనం అలా హరించుకుపోవటం ససేమిరా సహించదు చంద్రానికి. భార్య మాలతి గాజులమ్మి- బోరు మరింత లోతు చేయిస్తారు. అప్పుడు పుష్కలంగా నీళ్లు అందుతాయి. కాలనీలో పలకరింపులూ మళ్లీ మామూలు స్థాయికి వస్తాయి. ఓ అర్ధరాత్రి వేళ... మోటారు నడుస్తున్న శబ్ధం వినిపిస్తుంది. చంద్రం, మాలతి నిద్ర లేస్తారు. వాకిట్లో ఇద్దరు మనుషులు.. లైటు వేయకుండానే చీకట్లో పరికించి చూస్తే- ఆ ఇద్దరూ రామ్మూర్తి మాస్టారూ, అతడి కొడుకూనూ. తమ మోటారు వేసుకొని, వారి ఇంటి సంపును నింపుకుంటున్నారు. ఈ కథను ఇక్కడితో ఆపేసి, ఆ ఇద్దరి దుర్బుద్ధిని లేదా స్వార్థాన్ని బయటపెట్టి- కథకురాలు ఓరకమైన ఆనందాన్ని పొందొచ్చు. కానీ, ఉమాదేవి అలా చేయలేదు. చంద్రం దంపతులు ఆ సంఘటనను గుర్తించనట్టే అప్పటికీ ఊరుకున్నారు. ఆ మర్నాడు చంద్రం భార్య మాలతితో .... పాప ట్యూషను ఫీజును మాస్టారికి ఇమ్మని చెప్పి... పనిలో పనిగా తమ బోరు 'నీళ్లు కావాలంటే వాడుకొమ్మని చెప్పు' అని పురమాయిస్తాడు. స్వార్థాన్ని వెల్లడి చేసే ముగింపు కన్నా- ఇలా మంచితనాన్ని పరిమళింపచేసే ముగింపు ఉదాత్తమైంది కదా? మనుషులు సహజంగా మంచివాళ్లే. పరిస్థితులే స్వార్థపరులుగా మార్చేస్తాయి. ఆ భావననే రచయిత్రి ''నీళ్ల కరువు మానవ సంబంధాలను మార్చేస్తున్నది.'' అని మాలతి చేత అనిపిస్తారు. ఇదే ఈ కథకు ఆత్మ. ఉమాదేవి కథలన్నిటా ఈ తరహా తత్వాన్నే మనం గమనిస్తాం.
     ఈ సంపుటిలో మన సమాజ సామరస్య జీవనాన్ని కళ్లకు కట్టే కథ 'వెన్నెల లోగిలి'. హసన్‌ ఆర్టీసీ డ్రైవరు. భార్య జరీనా, పిల్లలతో కలిసి... రాజు - జయల ఇంట్లో అద్దెకు ఉంటాడు. ఆ రెండు కుటుంబాల మధ్య వర్థిల్లిన అనుబంధం అద్భుతంగా ఉంటుంది. హసన్‌, రాజు మధ్య తరచూ గొడవ జరుగుతూ ఉంటుంది. 'బాధ్యత లేని మనిషివి. సమయానికి బాడుగ ఇవ్వవు. ఇల్లు ఖాళీ చేసి పో..' అంటాడు రాజు. 'ఆ.. ఇంతోటి ఇంట్లో ఉండకపోతే మాకు గడవదా? ఖాళీ చేసి పోయేది ఖాయం.' అని విరుచుకుపడతాడు హసన్‌. తరువాత ఇంకేదో జరుగుతుంది అనుకుంటాం. కథ ఆ ఇంటిని దాటి ఇంచీ కూడా కదలదు. ఆ కుటుంబాల మధ్య అంత బలమైన అనుబంధం ఏర్పడి ఉంటుంది. ఒకరి తిండి ఒకరు మెచ్చుకొని మరీ తింటారు. ఒకరి బాగును ఒకరు ఎంతో కోరుకుంటారు. అలాంటి తరుణంలో హసన్‌ కుటుంబం హఠాత్తుగా బదిలీ అయిపోతుంది. అప్పుడు వాళ్ల మనసులు ఎలా విలవిల్లాడాయో, మళ్లీ కలవటానికి ఎంతగా పరితపించాయో కథలో చదవాల్సిందే! బంధాలకు అనుబంధాలకు కులమతాలు అడ్డంకులు కారాదనే ఉదాత్త భావన కథనిండా పరిమళిస్తోంది. ఇలాంటి కథలూ, వాతావరణాలు దేశానికి ఇప్పుడు ఎంత అవసరమో కదా అనిపిస్తోంది.
   ఆర్థిక స్వాతంత్య్రం ఉంటే మహిళలు ధైర్యంగా బతకగలుగుతారని మనం అంటూంటాం. అలాంటి మహిళలు కూడా కొద్దిపాటి అవసరాలను చక్కబెట్టుకోవటానికి ఎన్నెన్ని అవస్థలు పడాలో 'చర్వితచరణం' కథలోని అవని పాత్ర వివరిస్తుంది. ఒంటరి మహిళల బతుకు వెతను ఈ కథ విస్తారంగా చర్చించింది. అవని తనకెదురైన అవస్థలతో అలసిపోదు. బెదిరిపోదు. ఎదురైన ప్రతి కొత్త సమస్యనీ తెలివిగా, ధైర్యంగా ఎదుర్కొంటుంది. 'ఇంత చిన్న వయసులో ఒంటరి జీవితం బాధగా లేదూ?' అని సహోద్యోగి వసుధ అంటే- 'లేదు .. మేడమ్‌! ఒక పెత్తందారీ నుంచి విడుదల తరువాత ఈ స్వేచ్ఛ హాయిగా ఉంది.' అని అంటుంది. అవని చెప్పిన సమాధానం ఆమె వివాహ అనుభవంలోని విషాదాన్ని, దాన్నించి బయటపడ్డంతో పొందిన ఉపశమనాన్నీ స్ఫురింపచేస్తోంది. సాయపడే నెపంతో రకరకాల మగమనస్తత్వాల ప్రదర్శనలూ, వాటిని తెలివిగా తిప్పికొట్టిన వైనాలూ కథను బలంగా ముందుకు నడిపాయి. అవనిలా ఆత్మస్థైర్యమున్న మహిళలు, తమనూ, తమ కుటుంబాలనూ చక్కదిద్దుతున్న వనితలూ ఇంకా చాలా కథల్లో తారసపడతారు. జీవనహేల, పంచుకునేందుకు, పితృదేవోభవ, నా కంటినీటిముత్యమా, నీ వాకిట తులసినోయీ .... వంటి కథలన్నీ స్త్రీ ప్రధాన భూమికగానే నడుస్తాయి.
   ఉమాదేవి కథలు నది నిండుగా ఒరుసుకొని పారే ఉధృత ప్రవాహంలా సాగుతాయి. లక్ష్యిత దిశ వైపు నడుస్తూనే... అనేకనేక ఘట్టాలను స్పృశిస్తాయి. సన్నివేశాలను సృష్టిస్తాయి. సంఘటనలు వరుసబెట్టి నడుస్తాయి. అనేకనేక పాత్రలు తారసపడతాయి. ఈ విస్తృతి, ఉధృతి పాఠకులను తమలో మరింతగా మమేకం చేసుకోవటానికి దోహదపడతాయి. కథ ముగిసే సమయానికి మనమూ అందులో మునిగీ, తేలీ తెప్పరిల్లుతాము. హృదయం చెమరించి మరింత విశాలమై మనం మనసున్న మనుషులమే అన్న నిరూపణతో ఆనందపడతాము. కదిలించే ఈ కథలు పాఠకులకిచ్చే కానుక అదే మరి! ఇంకెందుకు ఆలస్యం.. కథల్లోకి వెళ్లండి. మానవత్వపు పరిమళాలను మనసారా అద్దుకొండి. కథలు పరిమళించినట్టే మనమూ పరిమళిస్తాం. మనిషిగా పరిమళింపచేయడం కన్నా మంచి కథలకు వేరే ప్రయోజనం, పరమార్థం ఇంకేం ఉంటాయి?!

('సమ్మెట ఉమాదేవి కథానికలు'కు ముందుమాట)
- సత్యాజీ