Oct 25,2021 06:56

ముఖం ముడతల్లోని
పెదవి విరుపు వంకర నవ్వులు
విస్తరిస్తూనే ఉన్నాయి
మృతకణాల్లాంటి మాటల్లోని
వెటకారపు కంపు వ్యాపిస్తూనే ఉంది
మాటలు దిగజారి తిట్లుగా
తిట్లు దిగజారి దూషణలుగా
దూషణలు దిగజారి 'ఛీ' పురాణంగా
హుందా సంప్రదాయాల నోట్లో
ఖాండ్రించి ఊసిపోతున్నాయి
కొత్త తరహా అశ్లీల ఇతిహాసం
ఖద్దరు గొంతులో
జబ్బలు చరుచుకుంటూనే ఉంది
చౌకబారుగా ఢకొీట్టి
మైకులు నోరుజారుతున్నకొద్దీ
భాష నిలువెల్లా
మ్యాన్‌ హౌల్‌లో కూరుకుపోతోంది
మురుగు పెదాలను ముద్దుపెట్టుకోవడానికి
కెమెరా ముందరే
ఎందుకంత ఆత్రం?
సంస్కారపు ఎరువుతో
ఏపుగా పెంచుకున్న
భాషా సంస్క ృతుల పంటంతా
బూతు తెగులు సోకి తలదించుకుంది!
భాష ఉత్కృష్ట రూపాన్ని
జన వ్యవహారంలో ఉంచాల్సిన వారు
దాని నికృష్ట రూపాన్ని
మీడియా పాయింట్లలో ప్రదర్శించొచ్చా?
విమర్శ గానీ, ప్రతి విమర్శ రానీ
రాజకీయ పద్యానికి అతుక్కుపోయిన
అయిదో పాదాన్ని
సెన్సార్‌ చెయ్యండి ప్లీజ్‌!
ఆవేశకావేశాలు ఎన్నున్నా
మృదువైన రాగాలతో
అవలీలగా పలికించగల
శిష్ట నిరసన ఛందస్సును
ఆశ్రయించండి ప్లీజ్‌!
పిల్లలంతా గమనిస్తున్నారు
భాష మార్చండి ప్లీజ్‌!
- కంచరాన భుజంగరావు
94415 89602