Jul 27,2021 19:23

దేశానికి అన్నం పెడుతున్న రైతు సమస్యలపై మాట్లాడేందుకు పార్లమెంటు చర్చల్లో పాలకులు విముఖత చూపిస్తున్న వేళ ... జూన్‌ 26న జంతర్‌మంతర్‌ వద్ద 200 మందికి పైగా మహిళలు 'మహిళా పార్లమెంటు' నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు ఇలా ఒకరేమిటి.. పార్లమెంటు నిర్వహణా సిబ్బంది అంతా మహిళలే. అక్కడ చర్చకు వచ్చిన అంశాలు కూడా ఎన్నో ఏళ్ల నుంచి సమాజంలో వేళ్లూనికొన్న సమస్యలే. అందులో ముఖ్యంగా 'నిత్యావసర వస్తువుల సవరణా చట్టానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానం, 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఈ పార్లమెంటులో ఆమోదం పొందాయి.

ఇంట్లో పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ, ఎండలో పొలం పనులు చేసుకుంటూనే నెలల తరబడి కొనసాగుతున్న ఈ సుదీర్ఘ పోరాటంలో పాల్గొంటున్న మహిళల భాగస్వామ్యం వెలకట్టలేనిది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వాణిని 'మహిళా పార్లమెంటు' సాక్షిగా వినిపించారు.

'రైతులంటే పురుషులు మాత్రమే కాదు. మహిళలు కూడా.. మేము పురుషులతో సమానంగా వ్యవసాయ భూముల్లో పనిచేస్తాం. కాబట్టి మేము కూడా రైతులమే. ఆ విషయం ఈ ప్రపంచానికి చెప్పాలనే 8 నెలలుగా నేను ఈ పోరాటంలో భాగమయ్యాను. నా గ్రామం నుంచి కొంతమంది రైతుమహిళలను కూడా ఇందులో భాగస్వామ్యం చేశాను' అంటారు పంజాబ్‌ తరన్‌ తరన్‌ జిల్లా నుంచి వచ్చిన కుల్విందర్‌ కౌర్‌.

జులై 22 నుంచి నిర్వహిస్తున్న ఈ రైతు పార్లమెంటులో ప్రతి రోజూ 200 మంది సభ్యులు పాల్గొంటున్నారు. 'ఈ పోరాటం సుదీర్ఘంగా సాగుతుందని మేము ఊహించాం. పురుషులు మాత్రమే పాల్గొంటే ఇటు పొలం పనులు, అటు నిరసనను సమర్థవంతంగా నిర్వహించలేరు. అందుకే గతేడాది డిసెంబరులో వారు ఇక్కడకు రావడానికి ముందే మహిళలు ట్రాక్టర్లు నడపడం నేర్చుకున్నారు. నిరసనల్లో పురుషులు పాల్గొంటుంటే అక్కడ వ్యవసాయ క్షేత్రంలో వారు చేయాల్సిన పనిని అంటే ట్రాక్టర్లతో దున్నడం వంటివి మహిళలు చేస్తున్నారు' అంటారు పంజాబ్‌ భటిండా నుంచి వచ్చిన మహిళా రైతు నేత.

'రైతు అనగానే ప్రతిఒక్కరూ పురుషుడినే ప్రతిబింబంగా చూస్తారు. కాని పొలం పనుల్లో మహిళా భాగస్వామ్యం చాలా విలువైనది. అయితే కొన్ని రకాల పనులు మాత్రం పురుషులే చేస్తూ వచ్చేవారు. కాని ఎప్పుడైతే ఈ రైతు పోరాటం ప్రారంభమైందో ఆ పనుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పురుషులతో సమానంగా కాదు, పురుషులు చేసే పనులు కూడా మహిళలు అలవోకగా చేస్తున్నారు. వారి సామర్థ్యం మరోసారి రుజువైంది' అంటారు హర్యానా నుంచి వచ్చిన ఓ మహిళా రైతు.

సింఘు సరిహద్దుల్లో 8 నెలలుగా పోరాటం చేస్తోంది జస్ప్రీత్‌ కౌర్‌ (50). ఆరేళ్ల క్రితం ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.ఆరు లక్షల అప్పు నెత్తిమీద ఉంది. ఈ సమయంలో 'ప్రభుత్వం రుద్దుతున్న మూడు వ్యవసాయ చట్టాలు నాకు ఏవిధంగానూ ఉపయోగపడవు. మాకు ఉన్న రెండెకరాల్లో పంట వేశాను. పంట చేతికి వచ్చినా 'మండి విధానం' లేకపోవడంతో పూర్తిగా నష్టపోయాను. అధికారుల దగ్గరకు వెళ్లి నా అప్పులు మాఫీ చేయమని కోరాను. వారు పట్టించుకోలేదు. అప్పుల బాధ తట్టుకోలేకే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నా కొడుకు ఈ విధమైన జీవితం నాకొద్దని అంటున్నాడు. భూమినే నమ్ముకున్న మాకు ఈ చట్టాల వల్ల ఒరిగేదేమీ లేదు' అంటూ పార్లమెంటులో తన బాధను వెళ్లబోసుకుంది. 'ముఖ్యంగా ధరల పెరుగుదలపై నిరసన చేస్తూ నేను ఇక్కడ ఉన్నాను. ప్రభుత్వ విధానాల వల్ల ప్రతిదీ కార్పొరేట్‌ మయమౌతుంది. ప్రజలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది' అంటూ ఈ పోరాటంలో తాను భాగమవడానికి గల కారణాన్ని వివరించింది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన హర్విందర్‌ కౌర్‌ (20). రామన్‌ (17) చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి, సోదరితో కలసివుంటూ వ్యవసాయాన్ని వదిలివేసి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. 'నేను కూడా ఈ చట్టాలకు నిరసన తెలుపుతున్నాను. ఎందుకంటే వీటివల్ల జీవితం దుర్భరమవుతుంది. భవిష్యత్తు ఉండదు' అంటోంది.

వ్యవసాయంలో అధికశాతం మహిళా రైతులే ఉంటారు. కాని వారికి తగిన ప్రాధాన్యం, హోదా ఇవ్వరు. ఢిల్లీ సరిహద్దు రైతు పోరాటంలో మాత్రం మహిళల శక్తిసామర్థ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగించడంలో, వ్యవసాయ క్షేత్రంలో, ఇంట్లో, నిరసన ప్రదేశాల్లో పురుషులతో సమానంగా పోరాడుతున్న మహిళాలోకాన్ని అక్కడ చూస్తున్నాం. ఈ దృశ్యాలు సమాజంలో అనాదిగా వేళ్లూనుకొన్న లింగ అసమానత్వాలను పటాపంచలు చేస్తున్నాయి.