Jul 30,2021 00:56

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ (విఎంఆర్‌డిఎ) మాస్టర్‌ప్లాన్‌ -2041పై అభ్యంతరాలు పెరుగుతున్నాయి. మాస్టర్‌ప్లాన్‌పై అనేక అనుమానాలు, భయాలు వ్యక్తం కావడంతో అభ్యంతరాల స్వీకరణ తుది గడువు పెంచాలన్న డిమాండ్‌ ఒకవైపు పెరుగుతుండగా, జులై 31తో ముగించాలని విఎంఆర్‌డిఎ అధికారులు భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి గురువారం నాటికి 5,600 వినతులు వచ్చినట్లు విఎంఆర్‌డిఎ ముఖ్య ప్రణాళికాధికారి సురేష్‌ కుమార్‌ తెలిపారు. విఎంఆర్‌డిఎ రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌-2041 ప్రజలకు మేలు చేసేలా కంటే ఆదాయం సమకూర్చుకొనేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వానికి ఆర్థిక వనరులను తెచ్చిపెట్టే రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా విఎంఆర్‌డిఎను ప్రభుత్వం తయారు చేసింది. మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనకరంగావుండేలా గృహవసతి కల్పించే పద్ధతి నుంచి ప్రభుత్వానికి నిధులు సమకూర్చే వ్యాపార సంస్థగా మారడంతో మాస్టర్‌ప్లాన్‌ కూడా అందుకు తగినట్లు తయారు చేసింది. విఎంఆర్‌డిఎ లక్ష్యమంతా మౌలికవసతుల పేరుతో కోట్ల రూపాయలు ఆర్జించేలా మాస్టర్‌ప్లాన్‌కు కసరత్తు చేసింది. దీని పరిధిలోకి వచ్చిన ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలకైనా అనుమతి తీసుకొనేందుకు నిర్ధేశిత ఫీజులు చెల్లించాల్సివుంటుంది. చిన్నపాటి ఇళ్లు కట్టుకొనే పేదవాడికైనా భారంపడక తప్పదు. రోడ్ల నిర్మాణాలు, విస్తరణకు అనేక వ్యవసాయ భూములు పోనున్నాయి. ఇళ్లు దెబ్బతిననున్నాయి. వ్యవసాయం కంటే రోడ్లు వంటివి నిర్మించి భూముల విలువపెంచి స్థిరాస్థి వ్యాపారం చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌ దోహదపడేలావుంది. ప్రజల్లో భయానిక పరిస్థితులు ఏర్పతున్నప్పటికీ గ్రామస్థాయిలో మాస్టర్‌ప్లాన్‌ సమాచారం పెట్టకుండా మండల కేంద్రాలకు పరిమితం చేసింది.
అభ్యంతరాల పరిశీలనకు నిపుణుల కమిటీ
విఎంఆర్‌డిఎ మాస్టర్‌ప్లాన్‌ -2041పై వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు ప్రభుత్వం గురువారం సాంకేతిక నిపుణుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెంబర్‌ కన్వీనర్‌గా డిటిసిపి అడిషనల్‌ డైరెక్టర్‌ బి.శ్రీనువాసులును నియమిస్తూ మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా వుడా విశ్రాంత ముఖ్యప్రణాళికాధికారి కెబి.అరుణాచలం, తెలంగాణాకు చెందిన విశ్రాంత డిటిసిపి కె.ఆనందబాబు, ఆర్కిటెక్చర్‌ శ్రీకొండ రమేష్‌, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి వి.మోహన్‌కుమార్‌ను నియమించారు. కమిటీ పనిపై విధివిధానాలను తెలియజేశారు.