Sep 15,2021 21:22

సాలూరు.. చిన్నారికి అన్నప్రాసన చేస్తున్న ఎమ్మెల్యే రాజన్నదొర

ప్రజాశక్తి-సాలూరు : మాత, శిశు మరణాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తుందని ఎమ్మెల్యే రాజన్నదొర తెలిపారు. బుధవారం పట్టణంలోని శివాలయం వీధిలో ఉన్న కళ్యాణ మండపంలో అర్బన్‌ ఐసిడిఎస్‌ ఆధ్వర్యాన నిర్వహించిన పోషకాహార మాసోత్సవాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పోషకాహారం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. జగనన్న గోరుముద్ద లాంటి పథకాలతో పేదపిల్లలకు ఎంతో మేలు చేకూరుతోందని తెలిపారు. ఈ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఈశ్వరమ్మ మాట్లాడుతూ తల్లిపాలలోనే అధిక పోషకాలు ఉన్నాయని చెప్పారు. వైస్‌ చైర్‌పర్సన్‌ జర్జాపు దీప్తి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవాలని కోరారు. ఈ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్‌ని పరిశీలించారు. అంతకు ముందు చిన్న పిల్లలకు అన్న ప్రాసన చేశారు. సిడిపిఒ జె.విజయలక్ష్మి ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షుడు జర్జాపు సూరిబాబు, సీనియర్‌ నాయకులు పువ్వుల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు, సూపర్‌ వైజర్లు పాల్గొన్నారు.
భోగాపురం : తల్లిపాలలో పోషకాలు మెండుగా ఉంటాయని, పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని సవరవిల్లి సెక్టార్‌ సూపర్‌వైజర్‌ నాగమణి అన్నారు. బుధవారం పంచాయతీ పరిధిలోని ఉప్పాడపేట అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ఆవశ్యకతను ఆమె వివరించారు. కార్యక్రమంలో సవరవిల్లి సర్పంచ్‌ విజయభాస్కర్‌ రెడ్డి, నాయకులు పట్నా తాతయ్యలు పాల్గొన్నారు.
సీతానగరం : పౌష్టికాహారంతోనే ఆరోగ్యంగా ఉంటారని పెదభోగిలి సర్పంచ్‌ జె.తెరీజమ్మ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన పోషకాహార మాసోత్సవాల్లో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ అరవింద్‌ కుమార్‌ పాల్గొన్నారు.
గంట్యాడ : మండలంలోని పెదమజ్జిపాలెం పిహెచ్‌సి పరిధిలోని మదనాపురంలో పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పౌష్టికాహార ఆవశ్యకతను ఆరోగ్య సహాయకులు ఈశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పద్మ, పంచాయతీ కార్యదర్శి దిలీప్‌కుమార్‌, ఎఎన్‌ఎం ఈశ్వరమ్మ, మహిళా పోలీస్‌ రత్నం, అంగన్వాడీ కార్యకర్తలు భవాని, పద్మ, ఆశావర్కర్లు సంతోషి, విమల పాల్గొన్నారు.