
అమ్మ పిల్లల కోసం ఏదైనా చేస్తుంది. తన జీవితాన్నే పణంగా పెడుతుంది. బిడ్డల బాగు కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. ఆమె ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో వేరెవరూ పంచలేరంటారు చాలామంది. అలాంటి అనురాగంతోనే తన ప్రత్యేక అవసరాలు గల బిడ్డను తీర్చిదిద్దింది ఓ తల్లి. ఇప్పుడా బిడ్డ సాధిస్తున్న కీర్తి, ప్రశంసలన్నీ ఆ అమ్మకు తప్ప మరెవరికీ చెందనివి.
ఎన్నో కలలతో బిడ్డకు జన్మనిచ్చిన విశాలాక్షి అనారోగ్యంతో పుట్టిన బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. ముడతలు పడిన చర్మం, ఎప్పుడూ ఏడుస్తూ ఉన్న కొడుకును చూసి బిడ్డకు ఏమైందోనని తెగ బెంగపడిపోయింది. ఆ దిగులుతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది కూడా. అటువంటి ఆమె, తన భర్త, కుటుంబ సభ్యులు, వైద్యులు ఇచ్చిన ధైర్యంతో కోలుకుని బిడ్డే ప్రపంచంగా బతుకుతోంది. అంతేనా.. మాటలు రాని ఆ బిడ్డను పాటలు పాడే స్థాయికి చేర్చింది. ఇప్పుడు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న తన బిడ్డను చూసి మురవని క్షణం లేదు. 'మెదడు పనితీరు సరిగ్గా లేదు. ఈ బిడ్డ ప్రత్యేక అవసరాలు గలవాడు' అన్న వైద్యుల మాటలు నా గుండెల్లో గునపాల్లా గుచ్చుకున్న రోజు నాకిప్పటికీ గుర్తే. నా బిడ్డను ఈ సమాజం ఆదరిస్తుందా! వీడి భవిష్యత్తు ఏంటి? ఎన్ని అవమానాలు పడాలో..! అన్న బాధ నన్ను వేధిస్తుండేది' అంటున్న విశాలాక్షి కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంత నివాసి.
ఉన్నత విద్యావంతురాలైన విశాలాక్షి యూనివర్శిటీ టాపర్‌లలో ఒకరు. రాధాకృష్ణయ్యతో వివాహమయ్యాక 2000 సంవత్సరంలో వెంకట్‌కు జన్మనిచ్చారు. పుట్టుకతోనే వెంకట్ బలహీనంగా పుట్టాడు. చర్మం ముడతలు ముడతలుగా ఉండేది. డాక్టర్లను సంప్రదిస్తే 'నువ్వు అనవసరంగా దిగులు పడకు. పిల్లాడికి అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి' అని సర్దిచెప్పారు. కాని బిడ్డలో ఏదో తేడా. అతను ఎదుగుతున్న కొద్దీ విశాలక్షి దిగులు మరింత పెరిగింది. అదేపనిగా రోజుకు 18 గంటలు ఏడుస్తూ ఉన్న కొడుకును చూసి తీవ్ర మానసిక ఒత్తిడితో ఆస్పత్రి పాలైంది. ఆ సమయంలో ఒకపక్క కొడుకు, మరోపక్క భార్య పరిస్థితికి రాధాకృష్ణయ్య ఆవేదన అంతాఇంతా కాదు. ఆయన కూడా ఉన్నత విద్యావంతుడు. పరిస్థితి అర్థం చేసుకుని మెలగాలని ఎన్నోసార్లు భార్యకు సర్దిచెప్పారు. ఆ క్షణం నుంచి ఇప్పటివరకు భార్యాభర్త ఇద్దరూ బిడ్డ కోసం అహర్నిశలు పరితపిస్తున్నారు. తమ భవిష్యత్తును వదులుకున్నారు. విశాలాక్షి ఎంకామ్ చదివారు. భర్త బిఎ బియిడి చేశారు. విద్యార్హతలతో మంచి ఉద్యోగావకాశాలు వచ్చినా కాదనుకున్నారు. బిడ్డ సంరక్షణలోనే మెలగాలనుకుని నిశ్చయించుకున్నారు. రాధాకృష్ణయ్య తండ్రి సంపాదించిన కాస్త పొలాన్ని కౌలుకు ఇచ్చి వచ్చిన ఆదాయంతోనే జీవిస్తున్నారు. హంగు, ఆర్భాటాలకు తావివ్వకుండా బతకడానికి అవసరమైన కనీస వసతులతో ఆ కుటుంబం జీవిస్తోంది.
స్కూల్లో మొదటిరోజు
నడక, మాట సరిగ్గా లేని ఆటిజమ్, హైపరాక్టివ్ గల వెంకట్‌ను ప్రత్యేక స్కూల్లో చదివించే అవకాశం లేని ప్రాంతం అది. దీంతో ప్రొద్దుటూరులో గీతా కిషోర్ నిర్వహించే గౌతమ్ స్కూలు గురించి తెలిసి అక్కడికి పంపాలనుకున్నారు. అయితే 'మాటలు రాని పిల్లాడిని అంతదూరం పంపించడం అవసరమా? మీరు చూస్తే ఏ పనీ లేకుండా ఉన్నారు. ఇది ఎంత ఖర్చుతో కూడిన వ్యవహారం' అంటూ చాలామంది నిరుత్సాహపరిచారు. 22 కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రొద్దుటూరుకు వెళ్లడమంటే ఖర్చుతో పాటు శ్రమతో కూడిన పని. అయినా ఆ అమ్మానాన్న వెనకడుగు వేయలేదు. కాని 'మొదటిరోజు క్లాసులో కూర్చొన్న వెంకట్ కార్పెట్ అంతా మూత్ర విసర్జన చేసేశాడు. దీంతో స్కూలు వాళ్లు మమ్మల్ని పిలిపించి తీసుకెళ్లిపొమ్మన్నారు. ఎంతో బతిమిలాడి వారిని ఒప్పించాం. స్కూలు నుంచి ఇంటికి వచ్చాక నేను ఏ పనీ పెట్టుకునేదాన్ని కాదు. అక్షరాలు, పాటలు వల్లె వేయిస్తుండేదాన్ని. ఆరో ఏడు వచ్చాక కాని వెంకట్ నన్ను అమ్మా అని పిలవలేదు. మాటలు రావాలంటే వందలసార్లు వల్లె వేయడమే సాధన అని డాక్టర్లు చెప్పారు. ఆ మాట పట్టుకుని వెంకట్‌కు అనేక వందలసార్లు సాధన చేయించేదాన్ని. దీంతో నా స్వరపేటిక పూర్తిగా పాడైంది. కొన్నాళ్లపాటు మాట్లాడకుండా ఉండాలని చెప్పారు. అప్పుడు కూడా పెదాల కదలికలతో అక్షరాలు గుర్తు పట్టడం, పేర్లు చెప్పడం వంటివి సాధన చేయించాను' అంటారు విశాలాక్షి. అలా సినిమా పాటలు, కీబోర్డ్, డ్యాన్స్, వంటి వాటిలో వెంకట్‌ను నిష్ణాతుణ్ణి చేశారు. ఇప్పటివరకు 500 ప్రదర్శనలు ఇచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులెందరి ముందో వెంకట్ ఇచ్చిన ప్రదర్శనలు ఆ కుటుంబానికి సమాజంలో మంచి గుర్తింపునిచ్చాయి.
'సాధనమున పనులు సమకూరు ధరలోన...' అన్నదాన్ని నేను బాగా నమ్ముతాను. అందుకే వెంకట్‌లో ఇంత మార్పు వచ్చింది' అంటున్న విశాలక్షి 'వెంకట్ సాధన చేసిన పాటలను స్టేజి మీద చూడకుండా పాడతాడు. కీబోర్డు కూడా చాలా బాగా ప్లే చేస్తాడు. ప్రదర్శనకు వచ్చిన వాళ్లు, ప్రముఖులు అతనిని ప్రశంసిస్తుంటే ఆనందంతో ఉప్పోంగిపోయేదాన్ని. ఆ ప్రోత్సాహం చూసి నాకు మాటలు వచ్చేవి కావు' అంటూ భావోద్వేగమయ్యారు. ఆ తల్లి పుత్రోత్సాహానికి ఆమె కన్నీళ్లే సాక్ష్యం.
భవిష్యత్తులో వెంకట్ ముఖ్య పాత్రలో ఓ వెబ్‌సిరీస్ ప్రారంభించాలని ఆమె కలలు కంటున్నారు. రాష్ట్రపతి అవార్డు, తానా వంటి సంస్థల్లో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్, వండర్ కిడ్ వంటి ఎన్నో గుర్తింపు సంస్థల పత్రాలు దక్కించుకున్న వెంకట్ భవిష్యత్తు ఆ తల్లి కోరుకున్న విధంగా ఉండాలని మనమూ మనసారా కోరుకుందాం.
పరుల సేవలో...
తాము పడిన కష్టం, మరే తల్లిదండ్రులు పడకూడదని 'వెంకట్ ఫౌండేషన్' స్థాపించి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.కరోనా టైంలో వృద్ధులకు, పేదవారికి నిత్యవసరాలు అందించాం. స్కూళ్లకు వెళ్లి మోటివేషన్ క్లాసులు ఇస్తున్నాం. మానసిక వికలాంగుడైన నా బిడ్డ ఇంత ఘనత సాధించాడు. భవిష్యత్తులో తనలాంటి వారికి ప్రతినిధిగా అతడు ఎదగాలి. అతను ఇచ్చిన ప్రదర్శనల వల్ల ఎంతోమంది తమ స్థితిని మార్చుకోవాలి. అటువంటి బిడ్డల తల్లిదండ్రులు తమ బిడ్డల ఉన్నతి కోసం పాటుపడాలి.
- విశాలాక్షి, 98484 93297
- ఎం ఫరూక్ బాబా,
ప్రొద్దుటూరు ప్రజాశక్తి విలేకరి.