Apr 19,2021 09:33
  • టాటా పవర్‌తో కేంద్రం ఒప్పందం
  • డిస్కాముల నిర్వీర్యానికి మరో కుట్ర

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుకు కట్టబెట్టడానికి కేంద్రప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పది వేల సోలార్‌ మైక్రోగ్రిడ్‌ల ఏర్పాటుకు టాటా పవర్‌, కేంద్ర ప్రభుత్వ ఇ గవర్నెన్స్‌ సేవలందించే కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ (సిఎస్‌సి) శనివారంనాడు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో గ్రిడ్‌ ద్వారా గృహ వినియోగదారులకు, వ్యవసాయ పంప్‌సెట్లకు విద్యుత్‌ సరఫరా చేస్తారు. కొత్త కనెక్షన్లు ఇవ్వడం, విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం, ఇతర నిర్వహణ నిమిత్తం ప్రతి గ్రామంలోనూ ఇద్దరు వ్యక్తులను నియమిస్తామని పేర్కొన్నారు. ఈ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో సమాంతర ప్రైవేటు విద్యుత్‌ వ్యవస్థ ఏర్పడుతుంది. అసలే నష్టాల్లో ఉన్న డిస్కాంలను మరింత నష్టాల ఊబిలోకి కూరుకుపో తాయి. ప్రైవేటు వారికి దొడ్డిదారిన కేంద్రం రాజమార్గం ఏర్పరుస్తోందన్నమాట. ఇప్పుడు డిస్కాముల ఉద్యోగులగా గ్రామాల్లో ఉన్న లైన్‌మ్యాన్లకు వారు పోటీగా వస్తారు. పది వేల మైక్రోగ్రిడ్లు ద్వారా 3.75 లక్షల పంప్‌సెట్లకు కనెక్షన్లు ఇస్తామంటున్నారంటే వ్యవస్థ విస్తృతిని అర్దం చేసుకోవచ్చు. అంతేగాక ఆరు వేల ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్లతో ఒప్పందాలు చేసుకోనున్నట్టు టాటా పవర్‌ పేర్కొంది.
ఇప్పటివరకు ఉత్పత్తి అవుతున్న సౌర, పవన విద్యుత్‌ ప్రభుత్వ డిస్కాముల ద్వారా వినియోగ దారులకు సరఫరా అవుతోంది. ఇళ్ల పైకప్పుల మీద, అలాగే పొలాల్లోనూ ఉత్పత్తి చేసే విద్యుత్‌ను సైతం డిస్కాంలకు ఇవ్వాలే తప్ప ఇతరత్రా వినియోగించ వీలు లేదు. ఇక పెద్ద సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్ల నుండి గ్రిడ్‌కు ఇచ్చి, ఆ తరువాత డిస్కాముల ద్వారా విద్యుత్‌ వినియోగదారులకు అందుతుంది. తాజాగా తరపైకి తెచ్చిన మైక్రో గ్రిడ్‌ మూలంగా విద్యుదుత్పత్తి, పంపిణీని టాటా పవర్‌ (ప్రైవేటువారే) చేస్తుంది. ప్రభుత్వ డిస్కాంలను నిర్వీర్యం చేయాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని విద్యుత్‌ నిపుణులు అంటున్నారు.
ఇలాంటి ఒప్పందాలు చేసుకునే ముందు ప్రభుత్వం విధానాన్ని ప్రజలకు తెలియజే యాలి. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వాలను సంప్ర దించి, వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలి. అలాగే కేంద్ర విద్యుత్‌శాఖ వెబ్‌సైట్‌లో ప్రచురించాలి. ఇవేవీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా కేంద్రం ఈ ఒప్పందం ద్వారా డిస్కాంలను దొంగదెబ్బ తీస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిషా వంటి రాష్ట్రాల్లో డిస్కాముల్లో పాగా వేసిన టాటా పవర్‌ దేశమంథటా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించేందుకు ఈ ఒప్పందం దారి తీస్తుందని అంటున్నారు.