
- టిఆర్ఎస్, ఎంఐఎం అవిభక్త కవలలు
- తుక్కుగూడ సభలో అమిత్ షా విద్వేష ప్రసంగం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు రిజర్వేషన్లు తగ్గిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆ మేరకు దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. ఎంఐఎం చేతిలో టిఆర్ఎస్ కారు స్టీరింగ్ ఉందని, ఆరెండు అవిభక్త కవలలని చెప్పారు. మజ్లిస్ ఏం చెబితే టిఆర్ఎస్ అది చేస్తుందని ప్రజలు గ్రహించాలని కోరారు. బిజెపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి మళ్లీ అప్పులు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని అమిత్షా అన్నారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభలో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలోని అవినీతి సర్కార్ను గద్దె దించేందుకు యువత కదిలి రావాలని పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు రాష్ట్రంలో జరిగాయా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనట్లేదని కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ధాన్యం సేకరణ మీ బాధ్యత చేతకాకపోతే రాజీనామా చెరు మేం అధికారంలోకి వచ్చి కొంటాం. గాంధీ, ఉస్మానియాను పట్టించుకోని సీఎం.. కొత్తగా నిర్మిస్తారా?'' అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి కెసిఆర్ అమలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు కావట్లేదు? అని ప్రశ్నించారు. సభలో బిజెపి జాతీయ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, డికె అరుణ, తదితరులు పాల్గొన్నారు.