May 14,2022 07:34
  • త్వరలో సంస్థాగత మార్పులు తెస్తామని వెల్లడి

ఉదయ్ పూర్ : మైనార్టీలను అణచివేస్తున్నారనీ, గాంధీజీని హత్య చేసిన వాళ్లను కీర్తిస్తున్నారంటూ కేంద్ర సర్కార్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. రాజస్తాన్‌లోని ఉదయ్ పూర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌ శుక్రవారం ప్రారభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా మాట్లాడుతూ.. 'కనీస ప్రభుత్వం.. గరిష్ట పాలన విధానం' అంటే ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం, మైనారిటీలపై క్రూరంగా దాడులు చేయడం, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడమేనా అని మోడీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రజలు నిత్యం భయం, అభద్రతల మధ్య నలిగిపోయేలా మోడీ పరిపాలన ఉంది. ఇది బాధాకరమైన అంశమని అన్నారు. మన చక్కని వాగ్దాటి కలిగిన ప్రధాని.. మాట్లాడాల్సిన క్లిష్టమైన సమయాల్లో మౌనం వహిస్తారని చురకలంటించారు. సమాజంలో అంతర్భాగంగా ఉన్న మైనార్టీలను తరచూ లక్ష్యంగా చేసుకోవడం, వారిని బాధితులుగా చేయడమే మోడీ ప్రభుత్వ కనిష్ట ప్రభుత్వం - గరిష్ఠ పాలన' నినాదం అర్థమన్నారు. మహాత్మాగాంధీ హంతకులను కీర్తిస్తున్నారనీ, నెహ్రూ వంటి వారి జ్ఞాపకాలను లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని అణచివేస్తున్నారనీ, ప్రజల మధ్య ఐక్యతను బలహీనపరుస్తున్నారని అన్నారు. మతపరమైన విభజనను ఎదుర్కొని దేశాన్ని పునర్మించాలనే లక్ష్యంతో మున్ముందు పనిచేయాలని నిర్దేశించారు.
     మతపరమైన విభజన రాజకీయాలను ఎదిరించాలని ఆయన కోరారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీ నేతలను, కార్యకర్తలను చాలా మందిని ఇచ్చిందని.. ఇప్పుడు మనమంతా పార్టీకి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులు సత్వరమే చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేతల పనితీరులోనూ మార్పు రావాలని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగత స్వార్థం వీడాలని, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలపై ఎక్కువ దఅష్టిపెట్టాలన్నారు. ఈ సదస్సులో నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పొచ్చని, అయితే పార్టీ బలంగా, ఐక్యంగా ఉందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పారు. పార్టీ వ్యూహాల్లోనూ మార్పు అవసరమన్నారు. ఈ సదస్సు దేశంలోని సమస్యలను చర్చిచేందుకు, ఆత్మశోధన అర్థవంతంగా కొనసాగేందుకు ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సదస్సుకు సోనియా, రాహుల్‌, ప్రియాంక సహా దాదాపు 400 ప్రతినిధులు హాజరయ్యారు.