ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్
ప్రభుత్వపరంగా ఆర్థిక తోడ్పాటు, స్థానికంగా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుతున్నందున నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు కోరారు. హౌసింగ్-డే కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన కార్పొరేషన్, హౌసింగ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖలకు చెందిన డిఈ, ఏఈలతో కలిసి కొమరగిరి లేఅవుట్‌ను సందర్శించి, ఇళ్ల నిర్మాణ ప్రగతిని పర్యవేక్షించారు. అనంతరం ఏడీసీ మాట్లాడుతూ కొమరగిలో సుమారు 16 వేల ఇళ్లు మంజూరు కాగా ప్రస్తుతం 4 వేల నివాసాలు గ్రౌండ్ అయ్యాయన్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 1.80 లక్షల ఆర్థిక తోడ్పాటుతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులుగా ఉన్న లబ్థిదా రులకు రూ.35 వేలు చొప్పున సహకారం అందిస్తున్నామన్నారు. టిడ్కో లబ్థిదారులకు సంబంధించి రూ.25వేలు నుంచి రూ.లక్ష వరకు సొమ్ము అందుబాటులో ఉందని చెప్పారు. అందువల్ల లబ్థిదారులు సొంతంగా సమకూర్చుకోవలసిన సొమ్మును కూడా సిద్ధం చేసుకుంటే ప్రస్తుత సీజన్‌లో ఇళ్ల నిర్మాణం త్వరిత గతిన పూర్తయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా ప్రత్యేకాధికారులు, నోడల్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు లబ్థిదారులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వపరంగా లేఅవుట్ లోనే ఇటుకల బట్టీలు ఏర్పాటు చేయడం, సుమారు 11 బోర్‌వెల్స్ ఏర్పాటు, విద్యుదీకరణ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని అక్కడ మంచినీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు పూటలా కార్పొరేషన్ నుంచి ట్యాంకర్లు కూడా పంపిస్తున్నామన్నారు. సకల సదుపాయాలు కల్పిస్తున్నందున లబ్థిదారులను చైతన్యవంతం చేసి మరింత వేగంగా ఇళ్లు పూర్తయ్యేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. గృహనిర్మాణశాఖ డిఈ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన గృహనిర్మాణం జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామని, గృహ నిర్మాణ సామగ్రి కోసం ప్రత్యేకంగా నాణ్యత నిర్ధారణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆయా శాఖలకు చెందిన డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాపై అధికారులకు సూచనలిస్తున్న ఎడిసి నాగనరసింహారావు