
పారిస్ : దేశంలో చోటు చేసుకున్న తీవ్ర రాజకీయ విభేదాలను విస్మరించలేమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ పేర్కొన్నారు. ఈ విభేదాల కారణంగానే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాక్రాన్ సంపూర్ణ మెజారిటీని సాధించడంలో విఫలమయ్యారు. టివిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆయన, నేషనల్ అసెంబ్లీలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలతో చర్చించానని, నేషనల్ యూనియన్‌పై ఉమ్మడి సమాధానం రాలేదని చెప్పారు. దేశ సాధారణ ప్రయోజనాలు నెరవేరేందుకు గానూ ఇతర రాజకీయ పార్టీలతో రాజీపడడం అవసరమవుతుందని అన్నారు. ఓటింగ్ చట్టాలు, ఇతర నిర్ణయాలు చేసేటపుడు రాజకీయ గ్రూపులు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం వుందని అన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఒంటరిగా చట్టాలను చేయలేదని వ్యాఖ్యానించారు. భిన్నంగా పాలించడం, చట్టాలు చేయడం మనం నేర్చుకోవాల్సి వుందన్నారు. జూన్ 12, 19 తేదీల్లో జరిగిన ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో మాక్రాన్ కూటమికి కేవలం 245 సీట్లు వచ్చాయి. సంపూర్ణ మెజారిటీ కావాలంటే 289 సీట్లు రావాల్సి వుంది.