Jan 25,2022 22:08

సచివాలయ భవన ప్రారగణంలో పడవేసిన మందుసీసాలు

ప్రజాశక్తి - చిలమత్తూరు : మండల కేంద్రంలో ఆర్బీకే కేంద్రం వద్ద కొత్తగా నిర్మించిన సచివాలయం-1 భవనం మద్యం ప్రియులకు విడదిగా మారింది. ఈ భవనం వద్ద మందు బాబులు ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొంతమంది ఆకతాయిలు అక్కడే కర్నాటక మద్యం తాగి బాటిళ్లు పగలగొడుతున్నారు. భవనం పక్కనే దేవాలయం, ప్రభుత్వకార్యాలయాలున్నాయి. చీకటి పడగానే మద్యం ప్రియులకు ఈభవనం కేంద్రంగా మారుతోంది. నూతనంగా నిర్మించిన ఈభవనాన్ని రెండు నెలల క్రితం ఎమ్మెల్సీ ఇక్బాల్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఈ భవనంలో ఇప్పటిదాకా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. దీంతో కొందరు మద్యం ప్రియులు ఈ భవనాన్ని తమ కేంద్రంగా మార్చుకున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టువేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే భవనంలో సచివాలయ సేవలు ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ విషయంపై కార్యదర్శి బాస్కర్‌ను వివరణ కోరగా త్వరలోనే కొత్త భవనం నుంచి సేవలు ప్రారంభిస్తామని చెప్పారు.