Jan 23,2022 07:29

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో మైనార్టీ ముస్లింలపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. ఖాండ్వా జిల్లాలో రెండు ముస్లిం కుటుంబాలపై గురువారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు తెగబడ్డారు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ దాడుల్లో బాధితుల ఇంటికి, ఆటో వాహనానికి నిప్పుపెట్టి దగ్ధం చేశారు. ఈ ఘటనలకు సంబంధించి ఖాండ్వా పోలీసుల కథనం ప్రకారం, రెండు ముస్లిం కుటుంబాలపై గురువారం రాత్రి దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి స్థానికంగా ఉండే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా తమ ఇళ్లలోకి కొంతమంది వస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ ప్రాంతాన్ని వదిలేసి వేరే చోటకు వెళ్లాలని బెదిరిస్తున్నారని బాధిత ముస్లిం కుటుంబ సభ్యులు కోట్వాలీ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లో మైనార్టీలపై దాడులను అడ్డుకునేందుకు బిజెపి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదనే చర్చ సాగుతోంది. మార్చి, 2020లో తిరిగి బిజెపి అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై దాడులు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం విదిష జిల్లాలో క్రిస్టియన్‌ మిషనరీపై భజ్‌రంగ్‌ దళ్‌, విహెచ్‌పి కార్యకర్తలు దాడులకు తెగబడటం తీవ్ర దుమారం రేపింది.