Aug 03,2022 12:29

జబల్‌పూర్‌ : 2020లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి అరెస్టైన వ్యక్తి బెయిల్‌పై విడుదలై.. అదే బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఉదంతమిది. బెయిల్‌పై వచ్చిన నిందితుడు వివేక్‌ పటేల్‌.. కత్తితో ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడటంతో పాటు గతంలో తనపైన పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నిందితుడు, అతడి స్నేహితుడు ఉన్నట్లు బాధితురాలు చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె వయస్సు 19 ఏళ్లు కాగా, రెండేళ్ల క్రితం.. అంటే ఆమె మైనర్‌గా ఉన్న సమయంలో నిందితుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పారు. అప్పుడు అరెస్టు కాగా, ఏడాది తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడన్నారు. నెల రోజుల క్రితం మరోసారి ఆ మహిళ ఇంట్లోకి తన స్నేహితుడితో కలిసి బలవంతంగా ప్రవేశించిన నిందితడు.. కత్తితో బెదిరించి.. అత్యాచారానికి ఒడిగట్టాడని, ఈ ఘటనను వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో నమోదైన కేసును కూడా ఉపసంహరించుకోవాలని బెదిరించినట్లు చెప్పారు. దీనిపై కేసును నమోదు చేసి... నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.