Jun 11,2021 21:06

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
కరోనా కష్ట సమయంలో వైద్యసేవలందిస్తున్న వైద్యారోగ్యశాఖలోని కాంట్రాక్టు మెడికల్‌ సిబ్బందికి ప్రభుత్వ ఉత్తర్వులు, ఒప్పంద నియమ నిబంధనలు తక్షణమే అమలు చేసి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎఐటియుసి రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు విజయవాడ దాసరి భవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కరోనా వారియర్స్‌ చనిపోతే రూ.50 లక్షలు బీమా వర్తింపజేస్తామన్న ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదని, తక్షణమే అమలు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రూ.16 వేలు వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎపి మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ పాల్గొన్నారు.