
ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్ : కర్నూలు మెడికవర్ హాస్పిటల్లో ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా వైద్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనేక ఆరోగ్య సమస్యలకు రక్తపోటు ( హైపర్ టెన్షన్ ) మూల కారణమని యువత అధిక శాతం ఈ వ్యాధి బారిన పడి ప్రమాదకరమైన ఆరోగ్య స్థితికి గురవుతున్నారని కర్నూలు మెడికవర్ హాస్పిటల్ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ చైతన్య, డాక్టర్ తేజానందన్, డాక్టర్ బిఎస్ ప్రవీణ్ అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు మెడికవర్ హాస్పిటల్లో వారు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర రెడ్డి, న్యూరాలజిస్ట్ డాక్టర్ నాగ సురేష్, నీలారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రమాదకరమైన హార్ట్ ఎటాక్స్, ఇతర స్ట్రోక్స్, డెమెంటియా, కిడ్నీ వ్యాధులు, ఎన్నో ఆరోగ్య సమస్యలకు మూల కారణమైన రక్త పోటు ( హైపర్ టెన్షన్ ) వ్యాధిపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తద్వారా భవిష్యత్తులో సంభవించే ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చునని అన్నారు. ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు రక్తపోటు ( హైపర్ టెన్షన్ ) మూలంగా నిలుస్తుందని అన్నారు. అవగాహన లేమి, సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడంతో ఈ వ్యాధి రోజు రోజుకూ అధిక మందికి సోకుతుందని వైద్యులు పేర్కొన్నారు. మారుతున్న జీవన శైలి నేపద్యంలో 25 ఏళ్ల వయస్సు లోపు యువత ఎక్కువగా హైపర్ టెన్షన్ బారిన పడుతున్నారని వివరించారు. ప్రతీ ఒక్కరూ రక్తపోటు పరీక్షలు చేయించుకుని ఒక వేళ రక్తపోటు ఉంటే వైద్యుల సలహా మేరకు మందులు వాడితే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చన్నారు. కర్నూల్ మెడికవర్ హాస్పిటల్ లో రక్తపోటు పరీక్షలు తక్కువ ఫీజులతోనే నిర్వహిస్తారని, వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారన్నారు.