Nov 25,2021 08:04

న్యూఢిల్లీ : మేఘాలయలో కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఒక్క రాత్రిలోనే ఆ పార్టీలోని 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయాన్ని తృణమూల్‌ పార్టీ నేతలు ప్రకటించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరినవారిలో మాజీ సిఎం ముకుల్‌ సంగ్మా ఉండటం విశేషం. కొంతకాలంగా పార్టీపై ముకుల్‌ సంగ్మా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన తన సహచరులతో కలిసి తృణమూల్‌లో చేరినట్లు సంబంధిత వర్గాల సమాచారం. తృణమూల్‌లో చేరడంపై అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. దీంతో తృణమూల్‌ ప్రధాన ప్రతిపక్షపార్టీగా అవతరించింది. 2023 లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో టిఎంసి బలమైన పోటీఇచ్చే అవకాశం ఉంది.

మేఘాలయకు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మనీష్‌ ఛత్రత్‌..
మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీకీ 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు ఊహించని విధంగా 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ వార్త తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి మరింత ఊతమిచ్చింది. కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయింది. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో... రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి మనీష్‌ ఛత్రత్‌ ఈ రోజు మేఘాలయకు వెళుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మొదటి వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఆయన గుజరాత్‌కు వెళ్లాల్సి ఉండగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో... మనీష్‌ తన పర్యటనను రద్దు చేసుకొని మేఘాలయకు వెళుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

టిఎంసిలో చేరుతున్న కీలక నేతలు..
మూడోసారి బెంగాల్‌లో అధికార పగ్గాలను చేజిక్కించుకునేందుకు, ఈశాన్య రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవడంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి సారించింది. కొద్దినెలలుగా పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో టిఎంసి నిమగ్నమయింది. పలువురు కీలక నేతలు టిఎంసి కండువా కప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు కీర్తి ఆజాద్‌, రాహుల్‌ గాంధీకి ఒకప్పుడు సన్నిహితుడైన అశోక్‌ తన్వర్‌లు రెండు రోజుల క్రితం మమతా బెనర్జీ సమక్షంలో టిఎంసి లో చేరారు. గత సెప్టెంబర్‌లో గోవా మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ బలమైన నేత లుజినో ఫలైరో తృణమూల్‌లో చేరారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా టిఎంసి కండువా కప్పుకున్నారు. వచ్చే ఏడాది గోవాలో ఎన్నికలున్న వేళ గోవాలో గెలుపే లక్ష్యంగా మమతాబెనర్జీ వ్యూహాత్మక పావులు కదుపుతున్నారు.

సోనియాను కలవాల్సిన అవసరం లేదు : మమతా
ప్రస్తుతం తృణమూల్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోడితో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ' కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మీరు కలవనున్నారా' అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, ఆమె బదులిస్తూ.... '' కలవడం లేదు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ మేము సోనియా గాంధీని కలవాల్సిన అవసరం లేదు '' అని మమతా చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మమత బెనర్జీకి మంచి సంబంధాలు ఉన్న విషయం విదితమే.