Dec 26,2021 13:58

అడివి శేష్‌ సినిమాల విషయానికి వస్తే.. అందరిలా కాకుండా తనకు నచ్చిన జానర్‌లో సినిమాలను తీస్తూ.. వాటిలో హీరోగా చేస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్నారు. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలూ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కినవే. ఇందులో భాగంగా అడివి శేష్‌.. 'క్షణం', 'గూఢచారి' సినిమాలతో బాక్సాఫీస్‌ దగ్గర అదరగొట్టిన విషయం తెలిసిందే. అడవి శేష్‌ ప్రస్తుతం మేజర్‌ అనే సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్‌బాబు నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 17న తన పుట్టినరోజు సందర్భంగా 'మేజర్‌' సినిమా గురించి ఆయన పంచుకున్న విశేషాలు..

పేరు : అడవి శేష్‌
అసలు పేరు : అడవి శేష్‌ సన్నీ చంద్ర
ప్రొఫెషన్‌ : యాక్టర్‌, రైటర్‌, మోడల్‌, డైరెక్టర్‌
పుట్టిన తేదీ : డిసెంబర్‌ 17, 1985
పుట్టిన ప్రాంతం : హైదరాబాద్‌
చదువు : ఫిల్మ్‌ డైరెక్షన్‌లో నాలుగేళ్ల కోర్సు
తల్లిదండ్రులు : సున్‌షి చంద్ర అడవి,
భవానీ అడవి
సోదరి : షిర్లె అడవి

ప్రేక్షకులపై బలంగా ప్రభావం చూపిస్తున్న యువ కథానాయకుల్లో అడవి శేష్‌ ఒకరు. ఈయన సినిమా చేస్తున్నారంటే ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంటుంది. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా 'మేజర్‌' చిత్రాన్ని చేస్తున్నారు. దాంతోపాటు పాన్‌ ఇండియా స్థాయిలో మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం 'మేజర్‌' సినిమా చిత్రీకరణ పూర్తయింది. డబ్బింగ్‌తోపాటు, ఇతర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిస్వార్థపరుడు, ధైర్యవంతుడు మనందరికీ ఎంతో ఇష్టమైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌గా నటించడం ఎంతో గర్వంగా ఉందని అడవిశేషు తెలిపారు. ఇందుకు తగిన విధంగా రైఫిల్‌ షూటింగ్‌ చేస్తున్న స్టిల్‌ను 'మేజర్‌' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.
      'ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ సందీప్‌ జర్నీని ప్రేక్షకులకి అందించడమే ఈ చిత్రం ముఖ్యోద్దేశం. అతడు వీర మరణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానాన్ని.. అందులోని ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని' తెలిపారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్‌ బ్యూటీ సైఈ మంజ్రేకర్‌, ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్‌ కానుంది.
దీనిపై శేషు మాట్లాడుతూ మార్కెట్‌ పెంచుకోవడం కోసం 'మేజర్‌'ని పాన్‌ ఇండియా చిత్రంలా చేయలేదు. మేజర్‌ సందీప్‌ కథని నిజాయతీగా చెప్పాలనే ఉద్దేశంతో చేశాం. దీన్ని మేం అనువదించడం లేదు. హిందీ, తమిళం, తెలుగు.. ఇలా ఏ భాషకి ఆ భాషలో ఆయా భావోద్వేగాలకి అనుగుణంగా ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ రాసుకుని, రెండు భాషల్లో చేశాం. ఉత్తరాది నుంచి దక్షిణాదికో, లేదంటే ఇక్కడి నుంచి అక్కడికో వెళ్తున్న సినిమాలా చేయలేదు. ఇదొక ఇండియన్‌ సినిమా అని తెలిపారు.
నేను రచయితని కాబట్టి ఎప్పటికప్పుడు మేజర్‌ సందీప్‌ తల్లిదండ్రులతో మాట్లాడుతూ, ఒక ప్యాషన్‌తో చేసిన ప్రాజెక్ట్‌ ఇది. మనం కెమెరా ముందు నటించేసి కార్‌వ్యాన్‌లోకి వెళ్లి కూర్చుందాం అనుకునే సినిమా కాదు. చాలా బాధ్యతతో కూడిన ప్రాజెక్ట్‌. మాటల్లో చెప్పలేని అనుభవం. 26న పోరాటం చేసి, 27న సందీప్‌ మరణించారు. ఆ రెండు రోజులూ నేను హోటల్‌లో గడిపా. సందీప్‌ ప్రాణాలు వదిలిన ప్రాంతంలో కూర్చుని ఆయన తల్లిదండ్రులతో మాట్లాడా. నేను సందీప్‌లా అవ్వలేను కానీ, మీకు రెండో కొడుకుగా నేను ఉన్నానని, అది మనసులో పెట్టుకోండని ఆంటీ అంకుల్‌కి చెప్పా. వాళ్లూ అలాగే నాతో మెలుగుతుంటారు.
 

                                                 సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ..

సినిమాల్లోనే కాదు.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ.. తనదైన శైలిలో దూసుకెళ్తుంటారు శేష్‌. కరోనా సమయంలో అందరి స్టార్స్‌లాగానే శేష్‌ కూడా కరోనా బాధితులకు అండగా నిలిచారు. హైదరాబాదులోని కింగ్‌ కోటి ఆస్పత్రిలో పేషెంట్లు, వైద్యులు ఇతర సిబ్బంది మొత్తం కలిసి 300 మంది వరకూ ఆస్పత్రిలో ఉన్నారు. ఆస్పత్రిలో తాగునీరు కొరత ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అడవిశేషు తక్షణమే 850 లీటర్ల మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ను ఆస్పత్రికి పంపించారు.
 

                                              రెండు హిందీ చిత్రాలు సైన్‌ చేశా...

తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ 'నిజానికి నేను రెండు హిందీ సినిమాలకు సైన్‌ చేశాను. కానీ 'మేజర్‌' సినిమా తర్వాత మాత్రమే నేను వాటిని అనౌన్స్‌ చేస్తాను. త్వరలోనే మరికొన్ని విషయాలను ప్రకటిస్తాను. కానీ అన్నింటికంటే ముందుగా మేము మేజర్‌ సందీప్‌ కథని వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం' అని తెలిపారు. వీటితోపాటు 'హిట్‌ 2' చిత్రంలోనూ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది మూవీ టీమ్‌. ఇది ఎప్పటిలాగానే ఆడియన్స్‌ను ఇంప్రెస్‌ చేసేలా కనిపిస్తోంది.