Apr 08,2021 19:54

ప్రజాశక్తి - పెనుమంట్ర
            మేలైన వరివంగడాలను రైతులకు అందించాలని ఎన్‌జిరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఎ.విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ మార్టేరులో మొట్టమొదటిసారిగా దేశవాళీ విత్తన కంపెనీలు, విత్తనాభివృద్ధి సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలన్నింటికీ ఆచార్య ఎన్‌జిరంగా విశ్వవిద్యాలయం ద్వారా ఇటీవల కాలంలో విడుదలైన ప్రముఖ 49 వరి వంగడాలను గురువారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విష్ణువర్థన్‌రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్శిటీలు ఇప్పటి వరకూ ప్రభుత్వ సహకారంతో దేశవ్యాప్తంగా వరి పరిశోధనా స్థానాల నుంచి నేరుగా రైతులకు ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వరంగ సంస్థల ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులిచ్చే రకాలను చేరవేయాలనే ఉద్దేశంతో సుమారు 450 ప్రభుత్వ, ప్రయివేటు రంగాలకు సంబంధించిన వరి సంస్థలన్నింటినీ మార్టేరు పరిశోధనా స్థానానికి ఆహ్వానించామన్నారు. తద్వారా ప్రభుత్వ, ప్రయివేటు, రైతు భాగస్వామ్యంగా నెలకొల్పి దేశంలో తిరుగులేని వ్యవసాయరంగ సంస్థగా మార్టేరు వరిపరిశోధనా సంస్థ అంతర్జాతీయంగా అభివద్ధి చెందాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పరిశోధనా సంస్థ సంచాలకులు డాక్టర్‌ ఎన్‌.త్రిమూర్తులు, పాలక మండలి సభ్యులు డాక్టర్‌ వి.చెంగారెడ్డి, రిటైర్డ్‌ పత్తి విత్తన ప్రధాన శాస్త్రవేత్త పి.దేవుళ్లు, ఎపి విత్తన ధృవీకరణ సంస్థ ప్రతినిధి విశ్వనాథ్‌, ఎపి విత్తనాభివృద్ధి సంస్థ ప్రతినిధి శ్రీలత, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళాభ్యుదయ విత్తన వ్యాపారవేత్త సుస్మితారారు పాల్గొన్నారు.