Jun 10,2021 19:03

* టెండర్లు పిలిచినా.. స్పందన కరువు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
ప్రభుత్వ ఇంజినీరింగు శాఖల్లో ఒక పని కోసం టెండర్లు పిలిస్తే పనులు దక్కించుకోవడానికి పోటీపడేవారు. పోటీ తీవ్రంగా ఉంటే టెండర్‌ రేట్‌ కంటే తక్కువ కోట్‌ చేసుకొని పనిని చేజిక్కించుకునే పరిస్థితి ఉండేది. మరికొన్ని చోట్ల ఎదుటివారు టెండర్‌లను వేయకుండా అడ్డుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు చేసిన పనులకు సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు అసలు టెండర్‌లకే ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బిల్లుల బకాయి దాదాపు రూ.25 వేల కోట్లుంటే... ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించి దాదాపు రూ.5 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో పోలవరం మినహా మిగిలిన ఇరిగేషన్‌ శాఖ పనులు, రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, గ్రామీణ నీటి సరఫరాల శాఖ తదితర శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పడటంతో పాత టెండర్‌ పనులను చేయకపోగా, కొత్తగా టెండర్‌లు వేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, దీర్ఘకాలంగా మరమ్మతులు చేయని వాటి పునురుద్ధరణకు ప్రభుత్వం టెండర్‌లను పిలిచింది. అనంతపురం జిల్లాలో రూ.165 కోట్ల నిధులతో 97 పనులకు టెండర్‌లు పిలిస్తే స్పందనే లేదు. గతంలో చేసిన పనులకు సకాలంలో చెల్లింపులు జరగక తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు కూడా బిల్లులు వెంటనే అవుతాయనే నమ్మకం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈసారి బిల్లుల చెల్లింపునకు ఆటంకం ఉండబోదని ఇంజినీరింగు అధికారులు చెప్పే ప్రయత్నం చేసినా కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోనే రోడ్లు భవనాల శాఖలో దాదాపు రూ.250 కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నట్లు సమాచారం. కొన్నిచోట్ల పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్య ఉన్నారు. కర్నూలు బళ్లారి రోడ్డుపై 75 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల దాకా దెబ్బతిన్న రోడ్డు పనుల కాంట్రాక్టును స్థానిక మంత్రి అనుచరుడు చేజిక్కించుకున్నా పని పూర్తి చేశాక బిల్లులు రాకపోతే వడ్డీలకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని మధ్యలోనే పని చేయకుండా ఉడాయించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.