Aug 10,2020 08:42

1973 మే నెలలో ఓ ఆదివారం. బరంపురం ఖల్లికోట కళాశాలలో బీకాం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న నేను.... వికాసం సాహిత్య సంస్థ సమావేశానికి హాజరయ్యాను. సమావేశం ఒక గదిలో జరుగుతూ ఉంది. సభ్యులందరూ చతురస్రాకారంలో నేలపై ఒక తివాచీ పరిచి కూర్చొని ఉన్నారు. వారి మధ్యలో తేజస్సుతో వెలిగిపోతూ ఒక పెద్దాయన తెల్లటి ఖద్దరు బట్టలతో బుస్కోటు పంచెతో తెలుగువారి సాంప్రదాయ వస్త్రధారణలో అందరు యువకులతో పాటే- తనూ మఠం వేసుకుని కూర్చొని ఉన్నారు. ఆయనే ఉప్పల లక్ష్మణరావు గారని, రష్యా నుంచి వచ్చి సంస్థలో సభ్యులుగా చేరారని మిత్రులు చెప్పగా తెలుసుకున్నాను. అప్పటికి ఆయన వయస్సు 75 ఏళ్లు. దృఢమైన శరీరం. దబ్బపండు ఛాయతో మెరిసిపోతూ ఉన్న ఆయన్ని చూడగానే గౌరవభావం పెల్లుబికింది. ఆయన్ని చూడ్డం అదే మొదటిసారి. తదుపరి కాలంలో ఆయనే మా జీవితాల్ని సమూలంగా మార్చేస్తారని అప్పటికి నాకు తెలియదు.
***
చాలాకాలం వరకు లక్ష్మణరావు గారి సంపూర్ణ జీవిత వివరాలు నాకు తెలియవు. ఆయన బరంపురం వాస్తవ్యులని, మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి గారికి తమ్ముడు వరస అవుతారని, జర్మనీలో వృక్షశాస్త్రంలో డాక్టరేట్‌ పట్టా పొందారని, ప్రగతి ప్రచురణాలయం మాస్కోలో రష్యన్‌ - తెలుగు అనువాదకులుగా పనిచేశారని, అనేక సాహిత్య సైద్ధాంతిక గ్రంథాలు రష్యన్‌ భాష నుంచి తెలుగులోకి అనువదించారని, భార్య ఒక స్విస్‌ వనిత అని, ఆమె మరణించిన తర్వాత రష్యాలో ఒంటరి జీవితం గడపలేక బరంపురం తిరిగి వచ్చేశారని... క్రమేపీ మాకు తెలిసివచ్చాయి. సమావేశాల్లో ఆయన ఎన్నడూ తన గురించి గొప్పగా చెప్పుకోలేదు. పైగా చిన్న వయస్కులైన మా అందరినీ గారూ అనే పిలిచేవారు. అంత పెద్దాయన మమ్మల్ని అలా పిలవడం ఇబ్బందిగానూ, వింతగానూ ఉండేది. అదే ఆయన వ్యక్తిత్వం, మహొన్నత సంస్కారం.
***
లక్ష్మణరావు గారు ప్రతి నెలా వికాసంలో వచ్చిన సాహిత్య ప్రక్రియల మీద సమగ్ర సమీక్ష రాసి, సమావేశంలో చదవటంతో పాటు ఆ నెలలో ఒక ఉత్తమ సాహిత్య ప్రక్రియను ఎంపిక చేసేవారు. ఆ రచయతకి సంస్థ ఒక నవలో, గ్రంథమో పురస్కారంగా ఇచ్చేది. ఈ విధంగా నా కవితలు అనేకసార్లు ఎంపికయ్యాయి. అది నాకెంతో ప్రోత్సాహకరంగా, ప్రేరణాత్మకంగా ఉండేది. ఆయన సమీక్షలు అనేక వివరాలు, ఉటంకింపులతో ఉండేవి. ఒకసారి నేను ఒక కవితలో 'ఎర్ర నోరు నల్లకాకి' అనే పదం వాడాను. దీన్ని మా సభ్యులు తప్పుబట్టారు. లక్ష్మణరావు గారు మాత్రం కాకుల్లో ఎన్ని రకాలున్నాయో, ఏయే దేశాల్లో ఏ జాతి కాకులు కనిపిస్తాయో వివరించి, నా ప్రయోగాన్ని సమర్ధించారు. వికాసం తొలి రోజుల్లో మేమంతా ఫ్రెంచ్‌ రచయతలు అల్బర్టు కామూ, జీన్‌ పాల్‌ సార్ట్రే రచనలు చదువుతూ ఉండేవాళ్లం. వారి అస్తిత్వవాదం మీద సమగ్ర వివరణ రాసుకొచ్చి ఆయన మాకు వినిపించారు. చిలీలో అలెండే ప్రభుత్వాన్ని అమెరికా సిఐఎ కుట్రతో కూల్చినప్పుడు నేను ఒక కవిత రాశాను. నా ఆసక్తిని గమనించి ఆయన ప్రముఖ కవి పాబ్లో నెరుడా కవితలు అనేకం అనువదించి సమావేశంలో వినిపించారు. ఐరిష్‌ స్వాతంత్య్ర పోరాటంలో బాబీ సాండ్స్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు... బాబీ సాండ్స్‌ డైరీలను అనువదించి మా ముందు ఉంచారు. ఈ సందర్భంలోనే అమరజీవి పొట్టి శ్రీరాములు తమ మిత్రులని, నిరాహార దీక్షకు వెళ్లేముందు రోజు రాత్రి విజయవాడలో తమ ఇంట ఆతిధ్యం స్వీకరించి వెళ్లారని, మాట వరసకైనా తనది ఆమరణ దీక్ష అని చెప్పలేదని గుర్తు చేసుకున్నారు.
***
లక్ష్మణరావు గారి ఇంట్లో ఉష్ణ కాలం అనే రాత పత్రిక నిర్వహిస్తూ ఉండేవారు. అందులో ఆయన 'అతడు ఆమె' శీర్షికన ధారావాహిక ఇచ్చేవారు. అతడు, ఆమె డైరీల రూపంలో కథనం నడిచేది. ఆయన రష్యా నుంచి తిరిగి వచ్చాక ఆ నవలను ముద్రించాలని సంకల్పించారు. అరసం అధ్యక్షులు అట్లూరి పిచ్చయ్య గారు పర్మిట్‌ మీద నవల ప్రచురణ కోసం కాగితం కూడా సేకరించారు. లక్ష్మణరావు గారు సంతోషిస్తారని ప్రింటయ్యాక ఆ తొలి ప్రతిని రచయితకు పంపారు. లక్ష్మణరావు గారు తమ ఇంట్లో అందరి ముందూ చదివి వినిపించారు. అది స్వాతంత్య్ర ఉద్యమ కాలం. ఈ నేపథ్యంలో 'ఈ మొగుడూ పెళ్లాల కీచులాట మీద ఏమిటిరా రాశావూ?' అని తల్లి ప్రశ్నించింది. మిగిలిన కుటుంబ సభ్యులూ ఆమెతో ఏకీభవించారు. దాంతో ఆయన మొత్తం ప్రతిని చింపేసి కొత్తగా మరొకటి రాశారు. ఈ విషయం తెలిసి మేము విస్తుపోయాం. ఆయన నవల 3, 4 భాగాలు వికాసంలో ఉన్నప్పుడే రాశారు. వారం వారం మాకు చదివి వినిపించేవారు. నవలలో శాంతం, శాస్త్రి మొదటితరం వారైతే- శుభలక్ష్మి, జనార్థనం రెండో తరం. వారి అంతరంగాల చిత్రణ అపురూపంగా ఉండేది. మూర్తీభవించిన మానవత్వంగా శాంత పాత్రను చిత్రించారు. పనివారి పట్ల ఆమె కార్మిక పక్ష వైఖరి. మనం ఇప్పుడు సైతం అలా ప్రవర్తించగలమా అనిపిస్తుది. పనిమనిషికి ఆమె నెల జీతంతో పాటు ఏడాదికి ఒకసారి తమ సొంతూరు వెళ్లి రావడానికి రైలు ఖర్చులు, ఏటా ఒక నెల జీతం బోనస్సు, పండక్కి బట్టలు, వారానికి ఒక రోజు సెలవు... ఇస్తుంది. తన పిల్లలపై అధికారం చూపలేదు. వారి జీవిత భాగస్వాముల ఎంపికలో స్వేచ్ఛ ఇచ్చింది. లాయరైన భర్త ఒక విడాకుల కేసులో వాదిస్తూ... అవతలి మహిళ మీద కోర్టులో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుంది. ఒక కేసులో ఆయన జమిందారుల తరపున వాదించి, రైతులను ఓడిస్తే భర్తను ఆక్షేపిస్తుంది. సత్యాగ్రహంలో తను లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్తే... ఆ పరపతిని ఉపయోగించి భర్త కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తే అతడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. శాస్త్రి మరో కేసులో రైతుల పక్షం వహించి, గెలిచినప్పుడే తిరిగి వస్తుంది. ఇలా మహిళల వ్యక్తిత్వాన్ని ఎంతో ఉన్నతీకరించారు ఆయన.
***
లక్ష్మణరావు గారు తన జీవిత కథను బతుకు పుస్తకం పేరిట రాశారు. ఇందులో వందేళ్ల తెలుగు సామాజిక జీవితం కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమం అన్ని దశల్లోనూ పోరాట రూపాల గురించి, కమ్యూనిస్టులు క్విట్‌ ఇండియా ఉద్యమంలో అనుసరించిన వైఖరి గురించి, స్వాతంత్య్రం కోసం ఫాసిస్టుల ఒడిలో చేరిన నేతాజీ గురించీ... చర్చించారు. సహచరి మెల్లితో పెళ్లి, ఆ పెళ్లికి ఆమె పెట్టిన షరతులు, ఆ వివాహం సోవియట్‌ రాజధాని మాస్కోలో జరగటం ... చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నరసాపురంలో గోదావరిని మెల్లీ ఒక్కతే ఆ వొడ్డు నుంచి రాజోలు వరకూ ఈదుకుంటూ రావటం, తాను రైలు తప్పిపోయి పది మైళ్ల దూరం నడిచి అర్ధరాత్రి ఇంటికి చేరడం లాంటి సంఘటనలు మనల్ని గగుర్పాటుకు గురి చేస్తాయి. సబర్మతి ఆశ్రమంలో రాత్రి పూట మహిళలు కూడా గస్తీ డ్యూటీలో పాల్గొనవచ్చని మెల్లీ సత్యాగ్రహం చేసి మరీ గాంధీని ఒప్పించడం విస్మయపరుస్తుంది. మద్రాసులో ఉన్నప్పుడు చనుబాల కోసం వీధుల వెంబడి తిరగడం, డబ్బు లేకుండా హోటల్‌కు వెళ్లి బాకీ కోసం తన కళ్లద్దాలు హామీగా ఉంచడం .. లాంటి ఉదంతాలు వారి సాధారణ జీవితానికి అద్దం పడతాయి.
***
1898 ఆగస్టు 11న పుట్టిన లక్ష్మణరావు గారు 1985 ఫిబ్రవరిలో కన్నుమూశారు. బరంపురంలోని వికాసం సంస్థకు పన్నెండేళ్లు అధ్యక్షులుగా ఉన్నారు. మూడు తరాల సభ్యుల్ని సామ్యవాద సాధన వైపు మళ్లించి ఎర్రజెండా కప్పుకుని అమరులయ్యారు. ఆ మేధావికి సాన్నిహిత్యంగా మెలిగే అవకాశం కలగడం నా అదృష్టం. ఆయనకు పిల్లలు లేరు. మేమే ఆయన పిల్లలం, ఆయన ఆశయాలకు వారసులం.
(ఆగస్టు 11 : ఉప్పల లక్ష్మణరావు గారి జయంతి)
- విజయచంద్ర, కవి, బరంపురం
94387 20409