Jun 24,2022 01:51
ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల: న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 26న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షి దారులు సద్విని యోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ పేర్కొన్నారు. గురువారం ఎస్‌పి కార్యాలయంలో నిర్వహించిన పోలీస్‌ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో నిర్వహించే లోక్‌ అదాలత్‌లో న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న క్రిమినల్‌, సివిల్‌, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులలో ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించాలని, జిల్లాలో అన్ని పోలీస్‌ స్టేషన్‌ అధికారులను ఆదేశించారు. లోక్‌ అదాలత్‌ వల్ల కక్షిదారుల ఆర్థిక సమస్యలతో పాటు న్యాయస్థానం సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. న్యాయస్థానం ఇచ్చిన నివేదిక ప్రకారం రాజీ పడటానికి అవకాశం ఉన్న కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి ఇరు పక్షాలకు మెగా లోక్‌ అదాలత్‌పై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.