Jun 20,2021 11:50

ఆకాశమే ఓ మహాద్భుతం..! అంతరిక్షం అంతుచిక్కని రహస్యం..! సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు.. ఇలా విశ్వంలో ప్రతి ఒక్కటి ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఇక వర్షం కురిసే సమయంలో ఆకాశంలో కనిపించే మెరుపులు.. సరికొత్త ప్రపంచాన్ని కళ్లకు చూపిస్తాయి. భూమి మీద నుంచి మెరుపును చూస్తే.. నల్లటి మబ్బుల్లో భారీ వెలుగు చార ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది. కానీ మెరుపులు తుపానులకన్నా చాలా ప్రమాదం అని మనలో ఎందరికి తెలుసు? మెరుపు గురించి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం.

    ర్షం పడే సమయంలో ఆకాశంలో ఉరుములతోపాటు కనిపించే ఓ విద్యుత్తు తరంగమే మెరుపు. వాస్తవానికి తుపానులకన్నా మెరుపుల వల్లే మన దేశంలో ఎక్కువమంది మరణించారని ఎర్త్‌ లైటినింగ్‌ రిపోర్టు-2019 తెలిపింది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రతి ఒక్క డిగ్రీ పెరుగుదలతో 12 శాతం మెరుపు తీవ్రత పెరుగుతోంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు మన దేశంలో మెరుపుల శాతం తీవ్రంగా ఉంటుంది. తూర్పు తీరం, జార్ఖండ్‌, మేఘాలయలలో ఈ మెరుపుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒడిశాలో ఎక్కువగా మెరుపులు కనిపించినా, పశ్చిమ బెంగాల్‌లో వాటి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది.
   మన దేశంలో దాదాపు రైతులే ఈ మెరుపు దాడిలో మృత్యువాత పడుతున్నారు. మనది వ్యవసాయ దేశం. పంట పొలాలు అన్నీ ఊరికి వెలుపలే ఉంటాయి. అలా వ్యవసాయ పనులు చేసుకునే రైతులే మెరుపు దాడిలో చనిపోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. వారి మరణాల వెనుక కారణాలు అనేకం. రైతులు ఎక్కువగా నిరక్షరాస్యులే ఉంటారు. కాబట్టి మెరుపు మీద సరైన అవగాహన వారికి ఉండదు. ఉదాహరణకు వర్షం పడి ఉరుములు, మెరుపులు రాగానే ఊరి వెలుపల వ్యవసాయ పనుల్లో నిమగమై ఉన్న రైతు తనను తాను రక్షించుకోవడానికి ఏదో ఒక చెట్టు కిందకు పరుగులు తీస్తాడు. అది ఏమాత్రం సురక్షితం కాదు. అంతేకాదు వైరుతో తయారుచేసిన పరికరాలను ఉపయోగిస్తే మెరుపు సమయంలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో తప్పనిసరిగా బ్యాటరీతో పనిచేసే పరికరాలను మాత్రమే వాడితే ఎలాంటి ప్రమాదం జరగదు. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో ఇళ్లలోనూ లోహపు వస్తువులను ఏమీ తాకకూడదు. ఇలాంటి అనేక విషయాలపై రైతులకు అవగాహన ఉండదు. ఇంకా వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులకు చేరకపోవడమూ ఎక్కువ మరణాలు సంభవించడానికి ఒక కారణం. వాతావరణంలో జరిగే మార్పుల గురించి చివరి రైతు వరకు అవగాహన కల్పించి, వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది.
    మనదేశంలో 2018వ సంవత్సరంలో 2,300 మందికి పైగా మెరుపు దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో తెలిపింది. అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 13 గంటల్లో 36,749 మెరుపు దాడులు నమోదయ్యాయి. 2005 నుంచి ప్రతి సంవత్సరం కనీసం రెండువేల మంది ఈ మెరుపు దాడుల్లో మరణిస్తున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే భారతదేశంలో అధిక సంఖ్యలో ప్రజలు ఆరుబయట పనిచేయడమే మరణాలకు కారణమని చెప్పొచ్చు.

                                                                              జాగ్రత్తలు :

  • మెరుపులు మెరుస్తున్నప్పుడు పెద్ద భవనం లేదా కారులో ఆశ్రయం పొందాలి.
  • బహిరంగ ప్రదేశాలు, కొండ ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు అనుకోకుండా మెరుపుదాడులు జరుగుతున్నాయనుకోండి. మనల్ని మనం రక్షించుకోవడానికి దగ్గరలో ఎలాంటి ప్రదేశం లేకపోతే.. మన పాదాలను కలిపి, మోకాళ్లపై చేతులు, తలను ఉంచితే కొంతవరకు ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
  • మెరుపులు మెరుస్తూ ఉన్నప్పుడు పొడవైన చెట్ల కిందకు వెళ్లకూడదు.
  • వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి అనిపిస్తే ఒకవేళ సముద్రాల్లో, చెరువుల్లో ఉన్నవారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలి.