
- పరిశ్రమ తెరిపించాలని కార్మికుల ఆందోళన
ప్రజాశక్తి - టెక్కలి రూరల్: మండలంలోని రావివలసలో గల మెట్కోర్ అల్లాయిస్ పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా లాకౌట్ ప్రకటించింది. పరిశ్రమ గేటుకు లాకౌట్ నోటీసులను ఆదివారం అంటించింది. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న సుమారు 700 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. లాకౌట్ విషయం తెలుసుకున్న కార్మికులు పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పరిశ్రమను తెరిపించాలని నినాదాలు చేశారు. 2014లో మూతపడిన ఈ పరిశ్రమ ఏడాదిన్నర కిందట మళ్లీ ప్రారంభమైంది. స్థానికులకు ఉపాధి కల్పనలో ప్రాధాన్యత కల్పించకపోవడం, రెగ్యులర్ కార్మికులకు రావాల్సిన బకాయిలు, ఇతర సౌకర్యాలు, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్, ఇతర సౌకర్యాల కల్పన విషయంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పలుమార్లు కార్మికులు రోడ్డెక్కారు. కనీస వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు కార్మికులు, రోజువారీ కూలీలు కొన్ని నెలలుగా సమ్మె చేస్తున్నారు. 400 రెగ్యులర్ కార్మికులకు కూడా పని కల్పించకుండా 15 రోజులుగా పరిశ్రమను మూసివేసింది. దీనిపై సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో పాటు కార్మికశాఖ అధికారులకు కార్మికులకు పలుమార్లు వినతిపత్రాలు అందించారు. ఈ నేపథ్యంలో యాజమాన్య ప్రతినిధులు, కార్మికుల మధ్య చర్చలు జరిగినా ఫలించలేదు. కొద్దిరోజుల కిందట సబ్ కలెక్టర్ పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చలేమని యాజమాన్య ప్రతినిధులు చెప్పారు. ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామని నమ్మిస్తూ ఈనెల 19వ తేదీన పరిశ్రమలోని రూ.కోట్ల విలువ చేసిన సరుకును తరలించిందని కార్మికులు చెప్తున్నారు. తాజాగా ఆదివారం పరిశ్రమ గేటుకు నో వర్క్ - నో పే, లాకౌట్ నోటీసులను అంటించారు. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న 400 మంది రెగ్యులర్, 300 మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం స్పందించి పరిశ్రమను తెరిపించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.