Oct 15,2020 21:37
మహా మాంద్యమే : ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌

కరోనా వైరస్‌ పలు వర్ధమాన, పేద దేశాలకు పెను ముప్పుగా పరిణమించిందని ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌ డేవిడ్‌ మల్పాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 1930ల నాటి మహా సంక్షోభం తర్వాత ప్రపంచం మరోసారి తీవ్ర ఆర్థిక మాందాన్ని చవిచూస్తోందన్నారు. కరోనా విజృంభణతో ఆర్థిక వ్యవస్థలు పతనమైన పలు దేశాల్లో రుణ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందన్నారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సమావేశాల సందర్బంగా బుధవారం మల్పాస్‌ మీడియాతో మాట్లాడుతూ చాలా లోతైన ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టిందన్నారు. పేదరికంతో కొట్టుమిట్డాడుతున్న దేశాలను ఇది భారీగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆయా దేశాలకు భారీ వఅద్ధి కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంక్‌ రూపొందిస్తోందన్నారు. ఇక వ్యాక్సిన్‌లను సమకూర్చుకోలేని దేశాలకు వ్యాక్సిన్‌లు, మందుల సరఫరా కోసం 1200 కోట్ల డాలర్ల అత్యవసర వైద్య కార్యక్రమాల విస్తరణకు ప్రపంచ బ్యాంక్‌ బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర వేసిందన్నారు. కరోనా కాలంలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు దోహదం చేస్తున్నారన్నారు. అసంఘటిత రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి సామాజిక భద్రతా పథకాలతో ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయన్నారు. పేద దేశాల్లో ప్రజలకు అదనపు సామాజిక భద్రత కలిగించే దిశగా ప్రపంచ బ్యాంక్‌ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.