Sep 29,2022 17:34

హైదరాబాద్‌ : సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగ ప్లాన్‌ బెడిసికొట్టి.. సెక్యూరిటీకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఆ దొంగ పేరు కృష్ణ. అతడి వయసు 30. మూడు రోజుల క్రితమే ఇతను ఒడిశా నుంచి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. కాగా, మంగళవారం రాత్రి 11.30 గంటలకు మహేష్‌ ఇంట్లో దొంగతనం చేయడానికి దొంగ ప్రహరీ గోడ ఎక్కాడు. అయితే ఆ గోడ 30 అడుగుల ఎత్తు కలిగి ఉండడంతో అంత ఎత్తు నుంచి దూకేసరికి పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్‌ గమనించి అక్కడికివెళ్లి చూడడంతో. దొంగ గాయాలతో పడి ఉన్నాడు. సెక్యూరిటీ వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు గాయపడ్డ దొంగను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.