Apr 07,2021 21:49

చెన్నై : యుఏఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ లెక్కలేనన్ని సమస్యలు చవిచూసింది. పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. 11 సీజన్ల ఐపీఎల్‌లో సూపర్‌కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌కు దూరం కావటం అదే ప్రథమం. సుమారు ఐదు నెలల అనంతరం ఐపీఎల్‌ మళ్లీ వచ్చేసింది. సూపర్‌కింగ్స్‌ కష్టాలు మాత్రం అలాగే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దిగ్గజం ఎం.ఎస్‌ ధోని చివరి ఐపీఎల్‌ సీజన్‌గా ఊహాగానాలు వినిపిస్తుండగా.. చాంపియన్‌ వీడ్కోలుకు చెన్నై సిద్ధమవుతోంది. సూపర్‌కింగ్స్‌తో భావోద్వేగ అనుబంధం కలిగిన మహీ.. మరి ఐపీఎల్‌ 14ను ఎలా ముగిస్తాడో!!?

జట్టు ఎలా ఉంది? :
గత సీజన్‌లో చాలా అంశాలు సూపర్‌కింగ్స్‌కు ప్రతికూలంగా సాగాయి. ప్రధాన బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా సీజన్‌కు దూరం కాగా.. అంబటి రాయుడు వంటి కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. షేన్‌ వాట్సన్‌, కేదార్‌ జాదవ్‌లు దారుణంగా విఫలమయ్యారు. సీజన్‌ ముగింపు దశలో సూపర్‌కింగ్స్‌ తుది జట్టులో సమతూకం సాధించింది. రాబిన్‌ ఉతప్ప, మోయిన్‌ అలీ రాకతో బ్యాటింగ్‌ బలోపేతం కాగా.. నెమ్మదైన పిచ్‌లపై చతేశ్వర్‌ పుజారా గొప్ప వ్యత్యాసం చూపించగలడు. మోయిన్‌ అలీ, కృష్ణప్ప గౌతమ్‌లు ఆఫ్‌ స్పిన్‌ సమస్యలకు సైతం చెక్‌ పెట్టనున్నారు. యువ ఆటగాళ్లు ఎన్‌.జగదీశన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లు సీజన్‌ ఆరంభం నుంచీ సూపర్‌కింగ్స్‌కు కీలకం కానున్నారు. శార్దుల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌లకు తోడు లుంగి ఎంగిడి పేస్‌ విభాగం బాధ్యతలు చూసుకోనున్నారు. నూతన ఆటగాళ్ల చేరిక, కోర్‌ జట్టు అందరూ బరిలో నిలువటం సూపర్‌కింగ్స్‌ను ఉత్సాహపరుస్తోంది. ఆస్ట్రేలియా పేసర్‌ జోశ్‌ హజిల్‌వుడ్‌ సీజన్‌కు దూరం కావటం ప్రతికూలతే అయినా.. గత సీజన్‌లో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ పెద్దగా తుది జట్టులో నిలువలేదు. సురేశ్‌ రైనా రీ ఎంట్రీ.. మోయిన్‌ అలీ, రాబిన్‌ ఉతప్పల రాకతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ను తేల్చటం ధోనికి తలనొప్పి కానుంది!.

బలం, బలహీనతలు :
ఎం.ఎస్‌ ధోని రూపంలో అనుభవజ్ఞుడైన నాయకుడు చెన్నై సూపర్‌కింగ్స్‌కు అతి పెద్ద బలం. ఐపీఎల్‌లో అత్యధిక ఫైనల్స్‌ ఆడిన మహీ.. గత సీజన్‌ జ్ఞాపకాలను తుడిచేయాలని కోరుకుంటున్నాడు. కోర్‌ గ్రూప్‌ ఆటగాళ్లపై నమ్మకముంచే ధోని.. ఈ సీజన్‌ ఆరంం నుంచే తనదైన టీమ్‌ అందుబాటులో ఉండటంతో మ్యాజిక్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సారి బ్యాటింగ్‌ విభాగం, బౌలింగ్‌ విభాగంలో మెరుగైన వనరులు చెన్నై సొంతం. గత సీజన్‌లో బ్యాట్‌తో, బంతితో సరైన ప్రత్యామ్నాయం లేకపోవటం చెన్నైకి దెబ్బతీసింది. ఆ లోపాలను సూపర్‌కింగ్స్‌ సరిచేసుకుంది. కాగితంపై సాధారణంగా కనిపించే సూపర్‌కింగ్స్‌.. మైదానంలో ఎప్పుడూ భిన్నమైన జట్టే.

వెటరన్‌ క్రికెటర్లను నమ్ముకుని టైటిల్‌ సాధించినా.. అదే ఫార్ములా ప్రతిసారీ పనిచేయదు. సురేశ్‌ రైనా 2019 నుంచి కేవలం ఐదు మ్యాచులే ఆడాడు. ఎం.ఎస్‌ ధోనికి సైతం గత సీజన్‌ తర్వాత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. మిగతా జట్ల తరహాలో మిడిల్‌ ఆర్డర్‌లో విధ్వంసక హిట్టర్లు సూపర్‌కింగ్స్‌ శిబిరంలో కరువయ్యారు. ఇది ఈ సీజన్‌లో సూపర్‌కింగ్స్‌కు ప్రతికూలంగా మారనుంది.

ఎక్స్‌ఫ్యాక్టర్‌ :
ఇద్దరు అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్‌ కరణ్‌లు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ జడేజా, పేస్‌ ఆల్‌రౌండర్‌ కరణ్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. బంతితో ఎంత ప్రభావం చూపించగలరో.. ఇటీవల బ్యాట్‌తో అంతకుమించిన ప్రదర్శన చేస్తున్నారు. ఈ సీజన్‌లో జడేజా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చి.. ఫినీషర్‌గా కరణ్‌ను పంపించే అవకాశం ఉంది. బ్యాట్‌తో, బంతితో ఈ ఇద్దరి ప్రదర్శన సూపర్‌కింగ్స్‌ ఫలితాలను నిర్దేశించనుంది.

చెన్నై జట్టు (స్వదేశీయులు) :
ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌), సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాబిన్‌ ఉతప్ప, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, కర్ణ్‌ శర్మ, ఎన్‌. జగదీశన్‌, కెఎం ఆసిఫ్‌, సాయి కిశోర్‌, కృష్ణప్ప గౌతమ్‌, చతేశ్వర్‌ పుజారా, హరిశంకర్‌ రెడ్డి, భగత్‌ వర్మ, హరి నిశాంత్‌.
విదేశీయులు :
డుప్లెసిస్‌, డ్వేన్‌ బ్రావో, ఇమ్రాన్‌ తాహీర్‌, శామ్‌ కరన్‌, లుంగి ఎంగిడి, మిచెల్‌ శాంట్నర్‌, మోయిన్‌ అలీ.
అత్యుత్తమ ప్రదర్శన : 2010, 2011, 2018 చాంపియన్‌