May 15,2022 07:32
  • మద్యం, గంజాయి, పోర్న్‌ సైట్‌లను నిషేధించాలి
  • ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీ పోరాటాలు
  • అత్యాచార నిరోధక వేదిక నిరసనలో వక్తలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించేందుకు, అత్యాచారాలు, హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర చట్టాన్ని చేయాలని అత్యాచార నిరోధక వేదిక డిమాండ్‌ చేసింది. అత్యాచార నిరోధక వేదిక ఆధ్వర్యాన మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో కొవ్వొత్తులతో నిరసన, సంతకాల సేకరణ శనివారం జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యాచారాలను అరికట్టేందుకు కంటి తుడుపు చర్యలు చేపడుతుందే తప్ప, శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేయడంలేదన్నారు. ఇప్పటికైనా జస్టిస్‌ వర్మ కమిషన్‌ సిఫార్సుల అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్నారు.ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామన్నారు. అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడే సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి తప్ప, పోలీసు నిర్బంధాలు, ఆంక్షలతో అడ్డుకోవడం మహిళలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. మహిళా సంఘాల నేతల ఇళ్ల వద్ద పోలీసులతో నిర్బంధాలు, ఆంక్షలు, నోటీసులు ఇవ్వడం, కాపలాపెట్టడం మహిళల భద్రత పట్ల పోలీసు వ్యవస్థకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తుందన్నారు. సమగ్ర చట్టం కోసం మహిళలంతా కృషి చేయాలన్నారు. డిబిఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు మాట్లాడుతూ దళిత, మహిళా సంఘాల ఆధ్వర్యాన భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతంగా జరగాల్సి ఉందన్నారు. పిఒడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మద్యం, పోర్న్‌ వెబ్‌సైట్లను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. తల్లులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి తానేటి వనిత తల్లులకు క్షమాపణ చెప్పాలని, తుమ్మపూడి ఘటనపై గుంటూరు ఎస్‌పి చేసిన వ్యాఖ్యలకు బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాలని, బాలికపై అత్యాచారం జరిగితే పట్టించుకోని కడప పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. అండ్ర మాల్యాద్రి (కెవిపిఎస్‌), టి ఆంజనే యులు (పౌరహక్కుల సంఘం), జడ శ్రావణ్‌కుమార్‌ (హైకోర్టు న్యాయవాది) సంఘీభావం తెలిపారు. ''హింసను అరికడదాం-మహిళలను కాపాడదాం, అత్యాచారాల నివారణకు సమగ్ర చట్టం చేయాలి'' అంటూ అత్యాచార నిరోధక వేదిక రూపొందించిన బ్యానర్‌పై మహిళా సంఘాల నాయకులతోపాటు మహిళలు, విద్యార్థులు, చిన్నారులు సంతకాలు చేసి సంఘీభావం తెలిపారు. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో కె శ్రీదేవి (ఐద్వా), కె.స్వరూపరాణి (శ్రామికమహిళ), రాధ (చైతన్యమహిళ), రాణి (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) తదితరులు పాల్గొన్నారు.