Oct 14,2021 23:59

దాడిలో గాయపడిన విజయకుమారి

ప్రజాశక్తి-టంగుటూరు : చిన్న బంకు పెట్టుకొని జీవనం సాగిస్తున్న మహిళపై వైసిపి నాయకులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మండలంలోని సూరారెడ్డిపాలెం గ్రామం దళిత కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సూరారెడ్డిపాలెం గ్రామం మల్లవరపుపాడు రోడ్డులో బస్‌ షెల్టర్‌ ప్రక్కనే ఎస్‌సి కాలనీకి చెందిన మెత్తాళ్ళ విజయకుమారి అనే మహిళ చిన్న బంకుకు పెట్టుకుని జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో చోటు చేసుకుంటున్న వైసిపి, టిడిపి దాడుల నేపథ్యంలో విజయకుమారి బంకును ఎవరూ లేని సమయంలో రాచపూడి ఆది , నాగరాజు మెత్తాళ్ళ వెంకటేశ్వర్లు, మోషే, అత్యాల సురేష్‌, సుజాత అనే వారు కలిసి జెసిబితో విజయకుమారి బంకును ధ్వంసం చేయించారు. దీంతో బాధిత మహిళ తన బంకు ఎవరికి అడ్డం వచ్చింది, తన పొట్టకొడితే ఏమొస్తుందని అడిగింది. దీంతో ఆగ్రహించిన నిందితులు విజయ కుమారిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో విజయకుమారి గాయపడింది. క్షతగాత్రురాలిని హుటాహుటిన ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి బంధువులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.