Oct 15,2020 21:33

చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో మదనపల్లె ఒకటి. ఇక్కడ ఉపాధి కల్పన చాలా తక్కువ. పనుల కోసం దూరప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలు చాలా ఉన్నాయి. 'ధాత్రి ఫౌండేషన్‌' స్థాపనతో కొంతమంది స్థానిక మహిళల జీవనోపాధి దొరికింది. వారు చేతితో తయారుచేసే వస్తువులపై పట్టు సాధించారు. 
రెండేళ్ల క్రితం మహిళల జీవనోపాధి కల్పన కోసం మదనపల్లెలో 'ధాత్రి ఫౌండేషన్‌'ను శంకారపు స్వాతి ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్‌ ఏర్పాటు వెనక ఆర్థికంగా తాను, తన చుట్టూ ఉన్న మహిళలు ఎదుర్కొన్న సమస్యలే కారణం. స్వాతికి వివాహమైన ఏడాదికే మామయ్య ఆంజనేయులుకు క్యాన్సర్‌ అనివైద్యులు చెప్పారు. కుటుంబమంతా దు:ఖంలో మునిగింది. అప్పు చేసి మరీ వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో స్వాతి కూడా ఉపాధి కోసం వెతుకులాట మొదలెట్టింది. చిన్నతనంలో నేర్చుకున్న కుట్టు, అల్లికలను తిరిగి ప్రారంభించింది. ఆర్థికపరమైన సమస్యలతో తోటి మహిళల ఇబ్బందులూ గమనించింది. వారందరికీ తన ఇంటిదగ్గరే మిషన్‌ కుట్టడం, చీరలపై వర్క్‌ ఎంబ్రయిడరీ, రంగులు అద్దడం, చేతికుట్లు, అల్లికలు నేర్పించింది. పది మంది కాస్త వంద మంది అయ్యారు. మహిళ కూడా పనిచేస్తేనే ఒక గౌరవం, గుర్తింపు ఉంటుందని ఆలోచనతో 'ధాత్రి' ఫౌండేషన్‌ స్థాపించింది. పై కోర్సులతో పాటు పట్టుగూళ్లతో కళాకృతులు, బ్యూటీషియన్‌ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తుంది. ఇలా సుమారు 500 మంది శిక్షణ పొంది, ఇప్పుడు స్వయం ఉపాధి పొందుతున్నారు.
లాక్‌డౌన్‌లో పనిలేని నిరుపేదలకు ధాత్రి సంస్థ తరఫున నిత్యావసర సరుకులు అందజేసింది. నిరాశ్రయులకు భోజనం, వసతి కల్పించింది. పీలేరుకు చెందిన వికలాంగులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. వివేకానంద నగర్‌లో వేల మొక్కలు నాటారు. కూరపర్తి అనాథ ఆశ్రమంలోని పిల్లలందరికీ దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఓఎంజి బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఈ సంస్థ సేవలు నమోదయ్యాయి. సేవారత్న, ఉత్తమ సేవా పురస్కారం, వివేకానంద యువపురస్కారం ఇలా ఇరవైకి పైగా అవార్డులు వరించాయి. ప్రభుత్వం సహకరిస్తే మరింత మంది ఆర్థికంగా ఎదగటానికి తమ సంస్థ దోహదపడుతుందని చెబుతున్నారు స్వాతి.

గీత

బ్యూటీ థెరపి ఖర్చుతో కూడుకున్న కోర్సు. ధాత్రి ఫౌండేషన్‌ ఉచితంగా 3 నెలల శిక్షణ పొంది, ఇంటి దగ్గర బ్యూటీపార్లర్‌ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇల్లు గడుస్తుంది. - గీత


ఒకప్పుడు నాచేతిలో డబ్బులు లేక పిల్లలకు ఏమైనా కొనివ్వాలన్నా ఇబ్బంది పడేదాన్ని. ధాత్రి ఫౌండేషన్‌ వారు కుట్టుమిషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు డ్రస్సులు, బ్యాగులు, మోడ్రన్‌ బ్లౌజ్‌లు కుడుతున్నాను. వచ్చే డబ్బుతో అప్పులు తీర్చగలిగాను. - ఎస్తేరీ

ఎస్తేరీనేను ఏమి చదువుకోలేదు. భర్త సంపాదన లేక ఇంట్లో చాలా ఇబ్బందులు పడ్డాం. కుటుంబం రోడ్డున పడిన పరిస్థితి. ఏడాది క్రితం పౌండేషన్‌ ఇచ్చిన ఆర్థిక సహాయంతో కిరాణా షాపు పెట్టుకున్నాను. పిల్లలు ఆగిన చదువులు కొనసాగిస్తున్నారు. - జైనబ్‌

జైనబ్‌