
ప్రజాశక్తి- వంగర, గుర్ల : మహిళల సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమం సోమవారం వంగరలో జరిగింది. తొలుత మండల కేంద్రంలో రూ.90 లక్షలతో కొత్తగా నిర్మించిన తాహశీల్దార్ కార్యాలయాన్ని, రూ.12.5 లక్షలతో ఆధునీకరించిన కోల్డ్ స్టోరేజ్‌ను, రూ.15.5 లక్షలతో ఆధునీకరించిన వ్యవసాయ వృత్తిదారుల సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడికి సమీపంలో ఏర్పాటు చేసిన సభలో వైఎస్‌ఆర్ ఆసరా పథకం కింద మూడవ విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మండలంలోని 772 సంఘాలకు చెందిన 8,306 మంది మహిళలకు రూ.5.55కోట్ల విలువైన చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, తమది చేతల ప్రభుత్వమని, ఏదైతే చెబుతామో...దానిని చేసి చూపిస్తామని అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబులా ప్రజల్ని మోసం చేసే అలవాటు తమకు లేదని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయడం ద్వారా, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి పూర్తిగా నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రజలు తమచుట్టూ జరుగుతున్న అభివద్దిని, అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను గమనించాలని కోరారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ పై కొంతమంది ఆడిపోసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కావాలా దోపిడీ చేసిన చంద్రబాబు కావాలా అని ప్రశ్నించారు.
కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం ఉండాలన్నారు. వంగర గ్రామంలో సచివాలయ భవనం పూర్తి చేసేందుకు సహకరించా లని విజ్ఞప్తి చేశారు. జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయడం ద్వారా, ప్రజల కళ్లలో ఆనందాన్ని చూస్తున్నామని చెప్పారు. రాజాం ఎంఎల్‌ఎ కంబాల జోగులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్‌సి పాలవలస విక్రాంత్ మాట్లాడారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, ఆర్‌డిఒ అప్పారావు, శ్రీకాకుళం జెడ్‌పి వైస్ ఛైర్మన్ జగన్మోహనరరావు, జెడ్‌పిటిసి కరణం రాధ, ఎంపిపి ఉత్తరావల్లి సురేష్ ముఖర్జి, తాహశీల్దార్ ఐజాక్, ఎంపిడిఒ వి.శ్రీనివాసరావు, వైసిపి మండల కన్వీనర్ కరణం సుదర్శన్ రావు, అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
గుర్ల : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక లో హామీ ఇచ్చిన ప్రకారం డ్వాక్రా సంఘాల మహిళలలు బ్యాంకుల్లో వాడుకున్న అప్పుల ను మాఫీ చేస్తానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుర్లలో ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంల డ్వాక్రా మహిళలకు రూ.8.76 కోట్లు చెక్కును అందజేశారు. అనంతరం జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, కలెక్టర్ సూర్య కుమారి, డిఆర్‌డిఎ పీడీ కల్యాణచక్రవర్తి, ఎంపిపి పొట్నూరు ప్రమీల, జెడ్‌పిటిసి శీర అప్పల నాయుడు, డిఎల్‌డిఎ చైర్మన్ బెల్లాన బంగారు నాయుడు, వైసిపి నాయకులు పొట్నూరు సన్యాసి నాయుడు. ఎంపిడిఓ కల్యాణి, తహశీల్దార్ పద్మావతి ,ఎ పి ఎం.నారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కెజిబివి పాఠశాల విద్యార్థులకు కళ్ళద్దాలు మంత్రి సత్యనారాయణ, ఆప్తాలమిక్ అధికారి శ్రీనివాసరావు పంపిణీ చేశారు..