Dec 06,2022 23:15

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: పని ప్రదేశాలలో మహిళల లైంగిక వేధింపు నివారణ, నిషేధం దిద్దుబాటు-2013 (ఇన్సైట్స్‌ ఆన్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్‌ యట్‌ వర్క్‌ ప్లేస్‌) అంశంపై మంగళవారం స్థానిక కొత్తపేటలోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు పనిచేస్తున్న కార్యాలయాలలో లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించేందుకు మహిళా లైంగిక వేధింపు నిరోధక రక్షణ చట్టం-2013 ను ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందన్నారు. ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్‌ సంస్థలు ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆయా సంస్థల్లో లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాధులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నానాటికి విస్తరిస్తున్న సాంకేతిక విప్లవంతో యువత చెడు మార్గంలో పయనించడం బాధాకరమన్నారు. డేటింగు, రిలేషన్‌షిప్‌, ప్రత్యేక యాప్‌ రావడం ద్వారా యువత భానిసలు కావడం దురదష్టకరమన్నారు. నేటి ఆధునిక యుగంలో మహిళలపై చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సష్టికి మహిళ మూలమని ఆ మహిళను గౌరవించాల్సిన భాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి దిశా యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు. నాగరికత వల్ల నేటి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని యువత చెడు మార్గంలో పయనిస్తూ అమాయక మహిళలను ముఖ్యంగా పేదవారిని లక్ష్యం చేసుకుని డబ్బు ఆశ చూపి మోసగిస్తున్నారన్నారు. ఇటువంటి వారిపై అక్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ విద్యార్థులను కోరారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో పటిష్టమైన వివాహా, కుటుంబ వ్యవస్థ ఉందని అన్నారు. మహిళలు పనిచేస్తున్న ప్రదేశాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కల్పించే విధంగా చట్టం రూపొందించడం జరిగిందని, ఈ చట్ట ప్రకారం సంబంధిత నేరం చేసిన వ్యక్తికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. ఆ చట్టాన్ని ఆయా ప్రభుత్వ, ప్రవైట్‌ సంస్థలు మరింత పకడ్బందిగా అమలుచేసి కఠిన శిక్షలు విధిస్తే సమాజంలో భయం కలుగు తుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ జిల్లా అధికారి ఉమాదేవి మాట్లాడుతూ మహిళాల ఆర్థిక సాధికారిత, బాల్య వివాహ నిర్మూలన, మహిళా చట్టాలు హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఏ మహిళ అయితే హింసను ఎదుర్కొంటున్నారో నిర్భయంగా ముందుకు వచ్చి మహిళల రక్షణకు నిర్ధేశించిన చైల్డ్‌ లైన్‌ 1098, ఉమెన్‌ హెల్ప్‌ లైన్‌ 181, పోలీస్‌ 100/112, వంటి హెల్ప్‌ లైన్లను సంప్రదించడం ద్వారా రక్షణ పొందాలని కోరారు. అవగాహన కార్యక్రమంలో మార్పు సంస్థ డైరెక్టర్‌ సూయజ్‌, కళాశాల సైకాలజిస్ట్‌ దేవిరెడ్డి కళ్యాణి, కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ టి శ్రీనివాస్‌, కళాశాల ప్రిన్సిపల్‌ డా. వి నారాయణరావు, లెక్చరర్‌ వి. శైలజ, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.