Jul 29,2021 22:20

సమావేశంలో మాట్లాడుతున్న తులసిరామ్‌రెడ్డి

      రాప్తాడు : మహిళలకు భవిష్యత్తులో సింగిల్‌ విండో లోన్‌ సిస్టం ద్వారా రుణాలను మంజూరు చేస్తామని డిఆర్‌డిఎ అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ తులసిరామ్‌ రెడ్డి తెలిపారు. రాప్తాడు మండల కేంద్రంలోని జ్యోతి మండల సమాఖ్య 17వ వార్షిక మహాసభ మండల సమాఖ్య కార్యాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తులసిరామిరెడ్డితో పాటు, ఏరియా కో-ఆర్డినేటర్‌ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘం సభ్యులు సక్రమంగా రుణాలు తీసుకుంటూ తిరిగి చెల్లించాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి సభ్యురాలు సింగిల్‌ విండో లోన్‌ సిస్టం ద్వారా మాత్రమే అప్పులు పొందే సులభమైన పద్ధతిలో రుణాలు ఇస్తామన్నారు. అనంతరం మండల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా యం.బండమీదపల్లి ముత్యాలమ్మ, కార్యదర్శిగా యర్రగుంట సునీత, కోశాధికారిగా పుల్లలరేవు సుధారాణిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం శివకుమార్‌ రెడ్డి, సిసిలు మల్లికార్జున, శ్రీరాములు, ఇందిరమ్మ, శివారెడ్డి, అకౌంటెంట్‌ శకుంతలమ్మ పాల్గొన్నారు.