
న్యూఢిల్లీ : దేశంలో మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సహరన్పూర్ జిల్లాలో పొలానికి వెళ్లిన 16 ఏళ్ల బాలికను తుపాకీతో బెదరించి అత్యాచారానికి పాల్పడగా, ఇదే రాష్ట్రంలో షాజహన్‌పూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలికి ముత్తు ముందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డమే కాకుండా, ఆ ఘటనను వీడియోను తీసిన నిందితుడు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు.
యుపిలో వరుస ఘోరాలు
సహరన్పూర్ జిల్లాలో ఒక గ్రామంలో 16 ఏళ్ల బాలిక ఒక మహిళతో కలిసి పొలంలోకి పని చేయడానికి వెళ్లింది. అక్కడ ఒక యువకుడు బాలికను తుపాకీతో బెదిరించి బలవంతంగా పక్కకు తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సమీప పొలాల్లో పని చేస్తున్న గ్రామస్తులు బాలిక అరుపులు విని సంఘటన స్థలానికి వెళ్లేసరికి యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం తరలించారు.
షాజహన్‌పూర్ జిల్లాలో 28 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయరాలికి మత్తు మందు ఇచ్చి ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియో కూడా తీశాడు. ఫిర్యాదు ప్రకారం బాధిత మహిళ తన విధులను ముగించుకుని వస్తుండగానే ఆమె గ్రామానికే చెందిన వ్యక్తి ఇంటికి చేరుస్తాననడంతో అతని వెంట వెళ్లింది. ఆయితే ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఈ వీడియో తీసి పెళ్లి చేసుకోమని కూడా బలవంతం చేస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి తల్లి, సోదరి, సోదరుడు, మరొక బంధువు మీద కూడా కేసు నమోదు చేశారు.
రాంచిలో కిడ్నాప్ చేసి..
15 ఏళ్ల బాలికను అపహరించి, కారులో ఐదుమంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దారుణం రాంచిలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ధుర్వా ప్రాంతంలో రింగ్ రోడ్ నుంచి బాలికకు కారులో బలవంతంగా ఎత్తుకునిపోయారు. రాతు పోలీస్ స్టేషన్ పరిధిలోని దలదలి ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌కు సమీపంలో కారును పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అనుమానంతో తనిఖీ చేశారు. ఏడుస్తున్న బాలికను, ఐదుగురు నిందితుల్ని గుర్తించారు. నిందితులంతా 20 ఏళ్ల లోపు వారే. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని, ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు.