Oct 28,2021 18:16

లండన్‌ : మహిళలు వ్యాపార రంగంలో పురుషులకు సమానంగా రాణించలేరని అపోహ పడేవారికి అస్మాఖాన్‌ అనే మహిళ ధీటైన సమాధానమిచ్చారు. భారత్‌లో జన్మించిన అస్మాన్‌ఖాన్‌... లండన్‌లో డార్జిలింగ్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. ఆమె ప్రతివారం ఆ రెస్టారెంట్‌లో భారత్‌ స్పెషల్‌ వంటకమైన బిర్యానీని అక్కడి ప్రజలకు రుచి చూపిస్తారు. ఈ స్పెషల్‌ బిర్యానీ కోసం.. అక్కడి ప్రజలు రెస్టారెంట్‌లో ముందుగానే బుకింగ్‌ చేసుకుంటారు. ఈ రెస్టారెంట్‌కున్న మరో విశేషమేమిటంటే.. ఇందులో అందరూ మహిళలే పనిచేస్తారు. ఈమె నిర్వహించే ఈ రెస్టారెంట్‌కి మంచి ట్రాక్‌ రికార్డు కూడా ఉంది. అయితే ఇంత ప్రజాదరణ పొందిన, వ్యాపార రంగంలో రాణిస్తున్న ఆమెకి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. రెస్టారెంట్‌ కోసం ఆమె ఓ స్థలాన్ని చూశారు. అయితే ఆ స్థలాన్ని ఆమెకివ్వడానికి ఆ భూయజమాని ఆసక్తి చూపించలేదు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'దాదాపు రెండేళ్లుగా.. ఓ స్థలం కోసం నేను భూ యజమానిని అడిగాను. నేను అడిగిన ప్రతిసారీ.. సరైన స్థలం లేదనే చెబుతున్నాడు. ఒకవేళ డబ్బులేదని అలా చెబుతున్నాడా అనుకుంటే పొరపాటే. నావద్ద స్థలాన్ని కొనేంత డబ్బు ఉన్నది. మరి ఎందుకు ఆయన అలా అంటున్నాడు అంటే.. మహిళలు ఈ రంగానికి సరిపోరు.. వారు రాణించలేరు.. దీనికి పురుషులు మాత్రమే సరిపోతారు అని అతని అభిప్రాయం. కేవలం మహిళననే అభిప్రాయంతో వారు నాకు సైట్‌ ఇవ్వలేదు. అయితే ఓసారి నాకు సైట్‌ ఇవ్వడానికి నిరాకరించిన భూయజమానులు నేను నడిపే రెస్టారెంట్‌కి వచ్చారు. ఆ సమయంలో వారు నాకు సహాయం చేయకపోయినా.. అవేవీ మనసులో ఉంచుకోకుండా నేను వారికి భోజనాన్ని వడ్డించాను. వారు మధ్యలో మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ.. నేను మౌనం వహించాను. వారు నన్ను అలా చూసి చివరికి వారే స్థలాన్ని నాకిచ్చేశారు' అని అన్నారు.
వ్యాపార రంగంలో మహిళలు రాణించాలంటే వాళ్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వుంటుందని అన్నారు. 2019 కరోనా సమయంలో లాక్‌డౌన్‌ మూలంగా రెస్టారెంట్లు మూతబడి చెఫ్‌లు ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డారు. ఇక వ్యాపార రంగం గురించి... ఆ సంఘటన గురించి మాట్లాడుతూ.. 'పురుషులతో సమానంగా మహిళలు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టలేరు. ఎందుకంటే మహిళలు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రధాన అడ్డంకిగా ఉండేది డబ్బే. ఒకవేళ ఈ రంగంలోకి వచ్చినా మేము ఎప్పుడూ గెలవలేము. మేము వేరే రేసులో నడుస్తున్నాము. అందుకే మహిళలు తమను తాము బయటి వ్యక్తులుగానే చూసుకుంటున్నారు. ఎందుకీ వివక్ష? ఒక్క వ్యాపార రంగంలోనే కాదు.. పనిచేసే దగ్గర కూడా వివక్ష ఉంది. ఇప్పటికీ ముఖ్యమైన చెఫ్‌లలో నాలుగింట ఒకవంతు మాత్రమే మహిళా చెఫ్‌లున్నారని' ఆమె అన్నారు.